-త్వరలోనే వ్యవసాయ సదస్సు: సీఎం కేసీఆర్ -ముఖ్యమంత్రిని కలిసిన శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ -స్వామినాథన్‌పై గౌరవాన్ని చాటుకున్న సీఎం

భారత హరిత విప్లవ పితామహుడు (ఇండియన్ ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్) ఎంఎస్ స్వామినాథన్ సిఫారసులను తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ విధానాల రూపకల్పనకు స్ఫూర్తిగా తీసుకుంటామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ఆయన పరిశోధనలు, సిఫారసులను అమలు చేస్తామన్నారు. సచివాలయంలో సీఎంను స్వామినాథన్ సోమవారం కలిశారు. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య తెలంగాణలో వ్యవసాయ విధానం పై చర్చ జరిగింది. తాము తెలంగాణ రాష్ర్టాన్ని భారత దేశ విత్తన భాండాగారంగా మార్చాలని ప్రయత్నిస్తున్నామని సీఎం కేసీఆర్ ఆయనకు వివరించారు. త్వరలో నే వ్యవసాయ సదస్సును నిర్వహిస్తామని, అందులో ప్రధానోపాన్యాసం చేయాలని స్వామినాథన్‌ను సీఎం కేసీఆర్ కోరారు.
స్వామినాథన్‌పై గౌరవాన్ని చాటుకున్న సీఎం పెద్దలను, గురువులను గౌరవించడం సీఎం కేసీఆర్‌కు అలవాటు. అలాగే తనను కలిసేందుకు వచ్చిన హరిత విప్లవ పితామహుడు స్వామినాథన్ పట్ల తన గౌరవాన్ని, అభిమానాన్ని చాటుకున్నారు. సచివాలయానికి వచ్చిన స్వామినాథన్‌ను తన చాంబర్లోకి సాదరంగా ఆహ్వానించారు. 90 ఏండ్ల వయసులో ఆయన వీల్‌చైర్‌పై సీఎం చాంబర్‌కు వచ్చారు. తిరిగి వెళ్లేటప్పుడు లిఫ్ట్ వరకు కేసీఆర్ స్వయంగా వీల్ చైర్‌ను నెట్టుకుంటూ వెళ్లారు. చెన్నైలోని స్వామినాథన్ ఫౌండేషన్‌ను తప్పక సందర్శిస్తానని కేసీఆర్ చెప్పారు.