Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

వివక్షపై ఉద్యమమిది

-తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితోనే దళితబంధు
-రాజకీయాలకు అతీతంగా పథకం అమలు
-అందరం కలిసికట్టుగా దళితుల్ని ఆదుకోవాలి
-వారిని తల్లిదండ్రుల్లా కడుపున పెట్టుకోవాలి
-నచ్చిన వ్యాపారం నచ్చిన చోట చేసుకోవచ్చు
-దశలవారీగా రాష్ట్రంలో ప్రతి కుటుంబానికీ
-వలసపోయినవారినీ లెక్కలోకి తీసుకోవాలి
-రక్షణ నిధి నిర్వహణ బాధ్యత దళితులదే
-లక్ష మందితో ప్రత్యేక పర్యవేక్షణ కమిటీలు
-కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు కీలకపాత్ర పోషించాలి
-దళితుల్లో స్వీయసామర్థ్యంపై చైతన్యం కల్పించాలి
-పథకానికి మనమే ఆవిష్కర్తలం.. మనమే ఆదర్శం
-ఏడు దశాబ్దాలుగా కాంగ్రెస్‌, టీడీపీ ఏం చేశాయి?
-వాళ్లు చేసి ఉంటే ఇంతటి దీనస్థితి ఉండేది కాదు
-దళితబంధుపై జాతీయ స్థాయిలో అభినందనలు
-దళితబంధుపై సమీక్షలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు

దళితబంధు పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా పూర్తిస్థాయిలో అమలు చేయడానికి ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. ఒకనాడు అంతులేని వివక్షను ఎదుర్కోవడం వల్లనే తెలంగాణ ఉద్యమం వచ్చిందని, నేడు అదే ఉద్యమ స్ఫూర్తితో దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నామని ఉద్ఘాటించారు. దళితబంధు అమలుతోపాటు ఇతర పథకాలు, రాయితీలు అన్నీ కూడా వారికి వర్తిస్తాయని, వేటినీ రద్దుచేసేది లేదని పునరుద్ఘాటించారు. విద్యలేక, ఆర్థిక పరిస్థితి బాగాలేక, అణగారిపోయిన దళితులను తల్లిదండ్రుల్లా ఆదుకోవాలని పేర్కొన్నారు. సోమవారం ప్రగతిభవన్లో సీఎం అధ్యక్షతన, రాష్ట్రం నలుమూలల్లోని 4 మండలాల్లో దళితబంధు పథకం అమలుపై అత్యున్నతస్థాయి సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 4 మండలాలకు చెందిన జిల్లాల మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు పాల్గొన్నారు. ఈ సమావేశంలో సీఎం కేసీఆర్‌ ప్రసంగం ఆయన మాటల్లోనే..

వివక్ష నుంచి బయటపడాలె
ఒకనాడు తెలంగాణ ప్రాంతంలో సాగునీటి ప్రాజెక్టులు నిర్మించాలని కొట్లాడితే ఎస్పారెస్పీ మొదలుపెట్టిన్రు. 1996 ప్రాంతంలో ఎస్సారెస్పీ కాలువలు కడుతున్న టైమ్‌లో నేను పోయిన. ‘ఎవరైతే వివక్షను ఎదుర్కొంటున్నరో.. అన్యాయానికి గురవుతారో వాళ్లు ఏదో ఒకరోజు కోలుకుంటరు.. కచ్చితంగా తిరుగబడుతరు. న్యాయం దక్కేదాక పోరాడుతరు’ అని చెప్పిన. ‘ఆరోగ్యం సహకరిస్తే, నేను బతికుంటే తెలంగాణ ఉద్యమాన్ని వెయ్యేండ్లు బతికేలా చేస్తా’ అని కూడా చెప్పిన. అన్నట్టే ఉద్యమాన్ని ప్రారంభించి, తెలంగాణ సాధించుకున్నం. ఇప్పుడు అనేక రంగాల్లో అనూహ్య ఫలితాలు సాధిస్తున్నం. సాగునీటి ప్రాజెక్టులు, హరితహారం వంటి అనేక కఠినమైన, జటిలమైన అంశాలపై.. అదే స్థాయిలో మేధోమథనంతో, ప్రయత్నంతో విజయాలు సాధించినం. ఈ క్రమంలో చాలా తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కొన్నం. ఇవాళ కులం మతం అనే తేడా లేకుండా రైతుబంధును అన్ని వర్గాలకు అమలు చేస్తున్నం. ఒకొక రంగాన్ని, వర్గాన్ని అభివృద్ధి చేస్తూ వస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, నేడు దళితుల అభ్యున్నతే లక్ష్యంగా చర్యలు చేపట్టింది. తీవ్రమైన వివక్షకు, భరించరాని నిర్లక్ష్యానికి గురైనవారు ఇప్పుడు తప్పకుండా బయటికి రావాలి. దళిత కుటుంబాల్లో గుణాత్మక మార్పు రావాలి. లేకపోతే మనం సాధించుకొన్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి అర్థం ఉండదు.రాజకీయ వైరుధ్యాలు పనికిరావు

ఎన్నికలపుడు రాజకీయాలు ఉండాలి.

పథకాల అమల్లో కాదు. రాజకీయ వైరుధ్యాలు పథకాల అమల్లో పనికిరావు. దళితబంధు ప్రతి దళిత కుటుంబానికీ అందిస్తం. స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు గడిచింది. ఈ మధ్యకాలంలో అనేక పార్టీలు, అనేక ఆలోచనా ధోరణులతో ప్రభుత్వాలు నడిపించాయి. ఇప్పటికీ కశ్మీర్‌ నుంచి కన్యాకుమారివరకు దళితులు నిరుపేదలుగానే ఉన్నారు. మన రాష్ట్రంలోనూ ఇదే పరిస్థితి. అది మన దురదృష్టం. కుటుంబంలో ఒక వ్యక్తి బాగా లేకపోతే అందరూ తలోచేయి వేసి బాగుచేసే ప్రయత్నం చేస్తరు. అలాంటి స్ఫూర్తితోనే దళితుల్లో గుణాత్మక మార్పు తెచ్చే బాధ్యతను అందరం తీసుకొని, తప్పును సవరించే ప్రయత్నం చేయాలి. ఇందులో భాగంగానే దళితబంధును ప్రారంభించినం. కచ్చితమైన లక్ష్యాలు నిర్దేశించుకున్నం. దానికి అనుగుణంగానే ముందుకుపోతున్నం. గతంలో ఇలాంటి కార్యక్రమాన్ని కేంద్రంగానీ, ఇతర రాష్ర్టాల్లో గానీ చేపట్టలేదు. కాబట్టి దీన్ని అర్థం చేసుకొంటూ, అవగాహన చేసుకొంటూ, సమీక్ష చేసుకొంటూ ముందుకుపోవాలి. సీఎం దళిత్‌ ఎంపవర్‌మెంట్‌ స్కీం కింద బడ్జెట్‌లో రూ.వెయ్యి కోట్లు కేటాయించుకొన్న తర్వాత దళిత మేధావులు, అధికారులు, కవులు, రచయితలు, దళితుల అభివృద్ధి కోసం పనిచేస్తున్న వ్యక్తులు, సంస్థలతో దఫదఫాలుగా మాట్లాడిన తర్వాత లక్ష్యాలు నిర్దేశించుకున్నం. అమలులో భాగంగా ఏదైనా ఒక అసెంబ్లీ నియోజకవర్గంగానీ, మండలంగానీ పైలట్‌ ప్రాజెక్టుగా తీసుకుంటే మరింత అవగాహన వస్తుందని, గొప్పగా ముందుకు తీసుకుపోయే అవకాశం ఉంటుందని హుజూరాబాద్‌ నియోజకవర్గాన్ని తీసుకున్నం.

మానసికంగా దృఢంగా తయారు చేయాలె
దళిత సమాజానికి చాలా విషయాల్లో అవకాశాలు రాలేదు. ప్రభుత్వ హాస్టళ్లలో, అవకాశం ఉన్న ఇంకోచోటో చదువుకొని కొంతమంది ఉద్యోగాలు పొందితే, చాలా కొద్ది మందికి రాజకీయంగా అవకాశాలు దక్కాయి. ఒక మార్వాడీని తీసుకుంటే వారికి బతకడానికి ఒక ఆర్ట్‌ ఉన్నది. కానీ దళితులకు విద్యలేక, ఆర్థిక పరిస్థితి బాగాలేక, అణగారిపోయి.. మా కర్మ ఇంతేలే అన్న ఒక నిరాశావాద దృక్పథంలో కూరుకుపోయి ఉన్నరు. ఇక్కడే మనం వాళ్లను తల్లిదండ్రుల్లా ఆదుకోవాలి. ప్రత్యేకించి జిల్లా కలెక్టర్లు, జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు వాళ్లను తల్లిదండ్రుల్లా అప్రోచ్‌ కావాలి. వాళ్లు మనల్ని కొంచెం ఇరిటేట్‌ చేసినా.. సంయమనంతో ఉండాలి. వాళ్లను మానసికంగా దృఢంగా చేస్తూ.. విశ్వాసాన్ని పాదుగొల్పాలి. అప్పుడే ఇది విజయవంతమవుతుంది. తప్పకుండా రెండేండ్ల తర్వాత ఎటువంటి పాజిటివ్‌ ఫలితాలు వస్తాయో.. ఎంత సంతోషం ఉంటుందో మనం చూస్తం. ఇలాంటి కార్యక్రమాలను పొద్దున్న లేచిన దగ్గరి నుంచి వ్యతిరేకించేవాళ్లు కూడా ఉంటారు. వాళ్లను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మంచి కార్యక్రమం చేసిన ప్రతిసారి అనుమానాలు వ్యక్తంచేసే దురలవాటు దేశంలో ఉన్నది. అంతర్జాతీయ స్థాయిలో తెలివైన వాళ్లలో మనం ఆరోస్థానంలో ఉన్నం. చైనా, జపాన్‌ వాళ్ల కంటే మనం ఎంతో తెలివైనవాళ్లం. కానీ ఒక టీమ్‌గా ఫెయిల్‌ అవుతున్నం. ఇది మనకు ఉన్న అసలు సమస్య. అనుమానాలు ఎక్కువ. ఒక ఆలోచన అమలు చేయాలంటే 25% గత విషయాలపై, 25% భవిష్యత్తు సమస్యలపై ఆలోచిస్తం. 50% మాత్రమే వర్తమానంలో బతుకుతం. అందుకే ఆశించినంత ఫలితాలు రావు. అలా కాకుం డా విజయవంతం చేసి చూపెట్టాలన్న లక్ష్యంతో పనిచేస్తే తప్పకుండా ఫలితాలు ఆశించిన దానికంటే మెరుగ్గా వస్తయి. నేను హుజూరాబాద్‌, వాసాలమర్రిలో గమనించింది ఏందంటే.. చక్కగా చదువుకున్న పిల్లలు దళితుల్లో ఉంటున్నారు. గతంలో ఎమ్మెల్యేగా నిలబెట్టాలన్నా చదువుకున్న వ్యక్తి దొరకని పరిస్థితి ఉండేది. ఇప్పుడు ప్రతి కుటుంబంలో చదువుకున్న పిల్లలుంటున్నారు. ఇది మనకు పెద్ద ఆస్తి. దాన్ని మనం వాడుకోవాలి.

కెపాసిటీ బిల్డింగ్‌ చేయాలె..
ప్రభుత్వం ఇచ్చే నిధులతో ఎలాంటి ఉపాధి అవకాశాలు కల్పించుకోవాలి? ఆర్థికంగా ఏది లాభదాయకం? ఏం చేయగలం? తదితర విషయాలపై దళితులకు అవగాహన లేదు. ఇటీవల హుజూరాబాద్‌ నియోజకవర్గ స్థాయి సమావేశంలో పలువురు వెల్లడించిన విషయాలు అందుకు ఉదాహరణ. ఈ నేపథ్యంలో మొదటగా పథకం లబ్ధిదారులకు వారి శక్తి సామర్థ్యాలపై పూర్తి అవగాహన కల్పించాలి. కెపాసిటీ బిల్డింగ్‌ చేయాలి. ఎలాంటి యూనిట్లు పెట్టుకుంటే ఎంతమేరకు లాభం ఉంటుంది? అందరూ ఒకే ఉపాధిని ఎంచుకుంటే వాటిల్లే నష్టాలపై అవగాహన కల్పించాలి. డెయిరీ, సెంట్రింగ్‌ తదితర లాభదాయకమైన యూనిట్లను వారికి చూపాలి. డూప్లికేషన్లు లేకుండా, విభిన్న రకాలు ఉండేలా చూసుకోవాలి. ఇద్దరు ముగ్గురు కలిసి యూనిట్లు పెట్టుకుంటామంటే అనుమతించాలి. ఎక్కడంటే అక్కడ పెట్టుకునేందుకు అవకాశం కల్పించాలి. ఎలాంటి పరిమితులు విధించవద్దు. పాజిటివ్‌ యూనిట్ల్లు పెట్టుకుంటామని వచ్చినవారికి సత్వరమే డబ్బులు అందజేయాలి. మొత్తంగా దళితకుటుంబం ఆర్థికంగా ఎదగడమే పథకం మూలసూత్రం.

అధికారులు.. ప్రజాప్రతినిధుల పాత్ర కీలకం..
పరిశ్రమలపై పెట్టుబడి పెట్టడం వల్ల పదిమందికి ఉపాధి లభిస్తుంది. రాష్ట్ర ఆర్థిక ప్రగతికి దోహదం చేస్తుంది. అదే తరహాలో దళితబంధు కూడా రాష్ట్ర ఆర్థికప్రగతికి ఎంతో దోహదం చేయనున్నది. సానుకూల దృక్పథంతోనే పథకాన్ని చూడాలి. పథకం అమలులో అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు అత్యంత కీలక పాత్ర పోషించాలి. అంకితభావంతో పనిచేయాలి. ముందు పథకం గొప్పతనం, ప్రయోజనాలపై అవగాహన పెంచుకోవాలి. లబ్ధిదారులకు దానిని అర్థం చేయించి చైతన్యవంతులను చేయాలి. అరటిపండు ఒలిచినట్టు విషయాన్ని వారికి విడమరిచి చెప్పాలె. ఆ తర్వాత ఏ ఒక్క లబ్ధిదారుడినినీ వదలిపెట్టకుండా.. ఏ గ్రామంలో, ఏ లబ్ధిదారుడికి ఏ యూనిట్‌ మంజూరు చేసినం? పరిస్థితి ఎలా ఉన్నది? ఏ విధమైన ఫలితాలు వస్తున్నాయి? అనే ప్రతి అంశాన్ని పర్యవేక్షించాలి’ అని సీఎం కేసీఆర్‌ అన్నారు. సమావేశంలో ఎస్సీ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌, ఖమ్మం జిల్లా మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌, నల్లగొండ జిల్లా మంత్రి జీ జగదీశ్‌రెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లా మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, వీ శ్రీనివాస్‌గౌడ్‌, నిజామాబాద్‌ జిల్లా మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు గాదరి కిశోర్‌(తుంగతుర్తి), గువ్వల బాలరాజు (అచ్చంపేట), జైపాల్‌యాదవ్‌ (కల్వకుర్తి), భట్టి విక్రమార (మధిర), హనుమంత్‌షిండే (జుకల్‌), ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్‌, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, మాజీ మంత్రి మోతుపల్లి నర్సింహులు, ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ బండ శ్రీనివాస్‌, జడ్పీ చైర్‌పర్సన్లు లింగాల కమల్‌రాజ్‌, డీ శోభ, పీ పద్మావతి బంగారయ్య, జీ దీపిక, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, సీఎం ప్రిన్సిపల్‌ సెక్రటరీ నర్సింగ్‌రావు, సీఎం కార్యదర్శి స్మితా సబర్వాల్‌, సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్ఘీస్‌, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, ఎస్సీ డెవలప్‌మెంట్‌ కార్యదర్శి, సీఎం సెక్రటరీ రాహుల్‌ బొజ్జా, ఎస్సీ కార్పొరేషన్‌ ఎండీ పీ కరుణాకర్‌, టీఎస్‌ఎస్‌ ఎండీ జీటీ వెంకటేశ్వర్‌రావు, కరీంనగర్‌ జిల్లా కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌, ఖమ్మం జిల్లా కలెక్టర్‌ వీపీ గౌతమ్‌, సూర్యాపేట కలెక్టర్‌ టీ వినయ్‌ కృష్ణారెడ్డి, జితేశ్‌ వీ పాటిల్‌, పీ ఉదయ్‌కుమార్‌ పాల్గొన్నారు.

4 మూలల నుంచి మండలాల ఎంపిక అందుకే..
డబ్బు తీసుకుపోయి పంచి పెట్టుడు పెద్ద విషయం కాదు. ఈ ప్రాసెస్‌లో ఎదురయ్యే సమస్యలను సమీక్షించుకొని అంతిమ ఫలితాలను ఎలా సాధించాలనేది చూడాలి. దళితబంధును హుజూరాబాద్‌లో కొంత ప్రారంభం చేసినం. అక్కడ కొన్ని అనుభవాలు వచ్చినయి. హుజూరాబాద్‌ ఒక సైడ్‌ అయిపోయిందని కొందరు అన్నరు. రాష్ట్రం నలుమూలల నుంచి మారుమూల ప్రాంతాలను తీసుకుంటే కొత్త ఆలోచనలు వస్తయని సూచించిన్రు. ఆయా ప్రాంతాల్లో వాళ్ల అవసరాలు, ఉపాధి మార్గాలు వేరే ఉండొచ్చు. పాలమూరులో ఒక రకమైన ఉపాధి మార్గాలు ఉంటే, ఖమ్మంలో అవసరాలు వేరే ఉంటయి. నిజామాబాద్‌ జిల్లాకు ఇంకోరకం ఉండొచ్చు. ఇవన్నీ ఎట్లా తెలుస్తయి అంటే.. నాలుగు దిక్కుల నుంచి నాలుగు నియోజకవర్గాలు తీసుకోవాలని, లేదంటే కనీసం 4 మండలాలు తీసుకోవాల్నని అధికారులకు సూచించిన. అందుకే ఖమ్మం జిల్లా మధిర, కామారెడ్డి జిల్లా జుక్కల్‌, నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేట, సూర్యాపేట జిల్లా తుంగతుర్తిని ఎంపిక చేసినం. ఈ మండలాల్లో సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం దాదాపు 10 వేల దళిత కుటుంబాలు ఉన్నయి. ఇంకా పెరుగొచ్చు, తగ్గొచ్చు.

వలస పోయినవాళ్లనూ లెక్కలోకి తీసుకోవాలి
నేను వాసాలమర్రిని దత్తత తీసుకొని కొన్ని కార్యక్రమాలు చేస్తున్న. లెక్కలు తీస్తే మొదట ఆ ఊర్లో 56 దళిత కుటుంబాలే ఉండె. నేను గ్రామ పాదయాత్రకు వెళ్లినప్పుడు లెక్కతీస్తే ఇంకో 20 మంది చేరిండ్రు. ‘మీరు ఎక్కడినుంచి వచ్చిండ్రయ్యా’ అంటే.. ‘మేం బతుకు దెరువుకోసం హైదరాబాద్‌కు పోయినం సార్‌. మీరు ఇంత మంచి స్కీం పెట్టిండ్రని తెలిసి తిరిగి వచ్చినం’ అన్నరు. నేను కూడా ఎంతో సంతోషపడ్డా. వాళ్లంతా అప్పటికప్పుడు కొన్ని గుడిసెలు వేసుకుని ఇండ్లు తయారుచేసుకున్నరు. ఇంత పెద్ద ఎత్తున తీసుకున్న ఈ దళితబంధు కార్యక్రమంలో అట్లాంటి వాళ్లను కూడా మనం విస్మరించవద్దు. ఒక సంవత్సరం ఆలస్యం అయినా ఫర్వాలేదు. చాలా విశాల హృదయంతో ఆలోచించాలి. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆనాడు నేను బయలుదేరినప్పుడు దేశంలో 38 పార్టీలు ఉన్నయి. జార్ఖండ్‌ ముక్తిమోర్చా, అజిత్‌సింగ్‌ పార్టీ మాత్రమే మనకు సపోర్ట్‌గా ఉన్నరు. నాకు వ్యక్తిగతంగా మిత్రుడు కాబట్టి రాంవిలాస్‌పాశ్వాన్‌ మద్దతు ఇచ్చారు. తర్వాత రాందాస్‌ అథావలె చేరారు. అట్లా ముందుకుపోతున్న కొద్దీ 38 పార్టీలు సపోర్ట్‌ చేశాయి. అంటే మన ఉద్యమంలో ధర్మం.. న్యాయం ఉంటే మద్దతు తప్పకుండా వస్తది.

కలెక్టర్లదే కీలక పాత్ర
నేను సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఫ్రెండ్‌షిప్‌ బ్యాంక్‌ అని పెట్టాను. దానిలో డబ్బులు ఉండవు. పేరుకు మాత్రం బ్యాంక్‌. మనుషుల పేర్లు మాత్రమే రిజిస్టర్‌లో ఉంటాయి. ఆ రిజిస్టర్‌లో ఉన్న ఏ ఫ్రెండ్‌కు ఏ ఆపద వచ్చినా.. ఏ అవసరం ఉన్నా.. రిజిస్టర్‌లో ఉన్న ఐదు వందలమందో, ఆరువందలమందో తలా కొంత ఇచ్చి అలా వచ్చిన మొత్తాన్ని తీసుకెళ్లి ఇస్తరు. మీ అమ్మాయి పెండ్లికి మన ఫ్రెండ్‌షిప్‌ బ్యాంక్‌ నుంచి సాయం అని ఇస్తరు. ఒకసారి ఒక ముదిరాజ్‌ల అబ్బాయికి రెండు కిడ్నీలు పోయాయి. డాక్టర్లు ట్రాన్స్‌ప్లాంట్‌ చేయాలన్నారు. రూ.3.75 లక్షలు కావాలన్నరు. అప్పుడు నేనే చొరవ తీసుకుని మిత్రులందరికీ ఒక నాలుగు గంటలపాటు ఫోన్లు చేసి సాయం అడితే రూ.6 లక్షలు జమయ్యాయి. ఆ డబ్బులు ఇచ్చి అతడి కుటుంబ సభ్యులను హైదరాబాద్‌కు పంపించి ఆపరేషన్‌ చేయించాం. దళితబంధులో కూడా రూ.10 లక్షలు ఇవ్వగానే వాళ్లు ఇండ్లు బంగారం కావు. అక్కడి నుంచి వాళ్లు ఒక మెట్టు ఎదగాలి. ఒక ఊతం కావాలి.. కలెక్టర్లు జవాబుదారీగా ఉండాలి. ఈ కార్యక్రమం మొదలై నాలుగు అడుగులు ముందుకు వేస్తే చాలా అనుభవాలు వస్తయి. ఈ నాలుగు జిల్లాల కలెక్టర్లు మిగతా జిల్లా కలెక్టర్లకు ట్రైనర్లుగా కావాలె. పథకాన్ని అమలు చేస్తున్నప్పుడు ఏ అనుభవాలు వచ్చాయి.. ఏమేం జరిగాయి.. ఎట్లా పరిష్కరించారు.. ఎట్లా వేగవంతం చేశారు.. ఇట్లా మీకు వచ్చే అనుభవాలు చాలా ముఖ్యమైనవి. మీ దగ్గర దళితబంధు అమలైన తీరును మంత్రులు.. ఇతర మంత్రులకు, స్థానిక శాసనసభ్యులు ఇతర శాసనసభ్యులతో పంచుకుంటారు. ఇది ఎంతో గొప్ప కార్యక్రమం. కాబట్టి మంచి లక్ష్యం కోసం పనిచేయాలి. దళితబంధు అమలు, దళిత రక్షణ నిధి నిర్వహణలో కలెక్టర్లదే అతి ముఖ్యమైన పాత్ర. కలెక్టర్లు ఎంత గొప్పగా ఈ పథకాన్ని అర్థం చేసుకుంటే అంత గొప్ప ఫలితాలు వస్తయి. దళితబంధు అమలు తర్వాత ఆ కుటుంబాలు దారిద్య్రరేఖకు ఎగువనే ఉండాలి తప్ప.. ఎట్టి పరిస్థితుల్లోనూ దిగువకు పోకూడదు.

దళితులను మనం వాళ్లను తల్లిదండ్రుల్లా ఆదుకోవాలి. ప్రత్యేకించి జిల్లా కలెక్టర్లు, జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు వాళ్లను తల్లిదండ్రుల్లాగా అప్రోచ్‌ కావాలి. వాళ్లు మనల్ని కొంచెం ఇరిటేట్‌ చేసినా.. సంయమనంతో ఉండాలి. వాళ్లను మానసికంగా దృఢంగా తయారుచేస్తూ.. విశ్వాసాన్ని పాదుగొల్పాలి. అప్పుడే ఇది విజయవంతం అవుతుంది.

పథకం పర్యవేక్షణకు ప్రత్యేక కమిటీలు
మొదటిదశలో పథకం అమలు పటిష్ఠంగా జరగాలి. రెండవ దశలో పథకం పర్యవేక్షణ కీలకం. దళితబంధు పథకాన్ని ఎలాంటి లోపాలు లేకుండా పక్కాగా క్షేత్రస్థాయిలో అమలుచేసేందుకు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయాలి. పథకం అమలు, పర్యవేక్షణ వారిదే బాధ్యత. అన్ని గ్రామాలు, మండలాలు, నియోజకవర్గాల నుంచి కమిటీల్లో ప్రాతినిధ్యం ఉండాలి. గ్రామస్థాయిలో 6, మండలస్థాయిలో 15, జిల్లా స్థాయికి 24 మంది, అందులోనూ మొత్తం సభ్యుల్లో 50 శాతం మహిళలు ఉండాలి. ఇలా మొత్తంగా లక్షమంది సభ్యులు అందుబాటులోకి వస్తరు. వారే దళితబంధు పథకానికి రిసోర్స్‌ పర్సన్స్‌గా పనిచేస్తరు. అందుకు అవసరమైన నైపుణ్యాలను పెంపొందించేందుకు కమిటీ సభ్యులకు ప్రత్యేక శిక్షణనివ్వాలి. ఒక్కమాటలో చెప్పాలంటే దళితజాతి సంరక్షణ బాధ్యతను లక్ష మంది దళితులు భుజ స్కంధాలపై మోయనుండటమే పథకం గొప్పతనం.

-దళితబంధు ఖాతాలో 10 లక్షలను ప్రభుత్వం జమ చేస్తుంది.
-లబ్ధిదారులు దానిలో ఎంతైనా ఖర్చుపెట్టి యూనిట్‌ పెట్టుకోవచ్చు.
-మిగిలిన డబ్బులు లబ్ధిదారుల ఖాతాలోనే
-యూనిట్‌ విలువతో సంబంధం లేకుండా రూ.10 లక్షలు ఇస్తుంది.
-దళితబంధు కార్డులో లబ్ధిదారు పేరుతోపాటు కుటుంబ సభ్యుల పేర్లూ ఉంటాయి.
-ఫలానా వ్యాపారమే చేయాలి.. ఫలానా చోటే చేయాలన్న నిబంధనలు లేవు.
-ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చు.. ఒకరికన్నా ఎక్కువమంది కలిసి వ్యాపారం చేసుకోవచ్చు.
-దళిత రక్షణ నిధి నిర్వహణ బాధ్యత దళితులకే. సంబంధిత కమిటీలే దీన్ని నిర్వహిస్తాయి.
-దళితబంధు ఉన్న కుటుంబాలకు ఇప్పటికే అమలుచేస్తున్న పెన్షన్‌.. రేషన్‌ సహా అన్నీ అందుతాయి.


నో పాలిటిక్స్‌.. నో పర్సనల్‌

దళితులకు ఒక్కో పార్టీ మీద అభిమానం ఉండొచ్చు. రాజకీయ పార్టీ ఆధారంగా ఒక కుటుంబాన్ని విస్మరిస్తే అది పెద్ద క్రైమ్‌ అయితది. కాబట్టి పార్టీలకు సంబంధం లేకుండా అందరికీ రీచ్‌ కావాలె.
నో పాలిటిక్స్‌.. నో పర్సనల్‌. ప్రతి ఒక్కరికీ ఇయ్యాలని చెప్పిన.
-ముఖ్యమంత్రి కేసీఆర్‌

వంద శాతం సబ్సిడీ ఎంతో మేలు

దళితబంధు లాంటి పథకం దేశంలో ఎక్కడాలేదు. పైలట్‌ ప్రాజెక్టు కింద రాజకీయాలకు అతీతంగా నా నియోజకవర్గంలోని చింతకాని మండలాన్ని ఎంపిక చేసినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు. ముఖ్యమంత్రి ఆలోచనల మేరకు ఈ పథకం అమలు కోసం నా శాయశక్తులా కృషిచేస్తాను. ప్రజాస్వామ్య పద్ధతిలో దళితులందరినీ పైకితీసుకొనిరావాలన్న సీఎం కేసీఆర్‌ ఆలోచన పూర్తిస్థాయిలో అమలు జరగాలి. రాజకీయాలకు తావులేకుండా, విశాల దృక్పథంతో, ఒక బిడ్డ పట్ల తల్లిదండ్రుల మాదిరిగా తెలంగాణ ప్రభుత్వం ఉంటుందని సీఎం కేసీఆర్‌ చెప్పడం ఆహ్వానించదగ్గ విషయం. ఎరువుల షాపులు, మీ సేవ కేంద్రాలు, మద్యం దుకాణాలు, మెడికల్‌ షాపులు తదితర వాటిల్లో ఎస్సీలకు రిజర్వేషన్లు కేటాయించడం చాలా ఉపయోగపడుతుంది. పరిశ్రమలశాఖను కూడా ఈ పథకంలో భాగస్వామ్యం చేయాలని ముఖ్యమంత్రిని కోరాను. విలేజ్‌ బీపీవోలు, పౌల్ట్రీ ఫీడ్‌, డెయిరీ ఫీడ్‌ వంటి వాటిని కూడా ఈ పథకం కింద పరిశీలించాలని కోరాను. వందశాతం సబ్సిడీతో నిధులు ఇవ్వడం, లబ్ధిదారుడు ఫలానా యూనిట్‌ పెట్టాలని ఒత్తిడి చేయకపోవడం వంటివి ఉపయోగపడతాయి. పథకం అమలును ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా స్వయంగా నిరంతరం పర్యవేక్షించాలని సూచించాను. ఈ పథకంపై శాసనసభలో కూడా చర్చ జరగాలి. ఇదే స్ఫూర్తి కొనసాగాలి. దళిత రక్షణ నిధి ఆలోచన కూడా మంచిది. దళితులు తొలిసారి కొత్త కొత్త వ్యాపారాల్లోకి అడుగుపెట్టేందుకు ఈ పథకం ఉపయోగపడుతుంది.

-భట్టివిక్రమార్క, సీఎల్పీ నేత, మధిర ఎమ్మెల్యే


కేసీఆర్‌ చారిత్రక పురుషుడు

నా 40 ఏండ్ల రాజకీయ జీవితంలో పదిమంది ముఖ్యమంత్రులను చూశాను. దళితుల అభ్యున్నతి కోసం ఇంత మంచి పథకాన్ని ఎవరూ పెట్టలేదు. దళితబంధు ప్రేమబంధు. సీఎం కేసీఆర్‌ లాంటి చారిత్రక పురుషుడు మాత్రమే ఇలాంటివి చేయగలుగుతారు. ఈ పథకం రూపకల్పనలో నన్ను ఆహ్వానించడం, నిర్ణయాల్లో భాగస్వామిని చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ పథకం అంటరానితనం నుంచి దళితులను విముక్తి చేస్తుంది. దారిద్య్రం నుంచి బయటపడేస్తుంది. ఇలాంటి వాటి వల్ల అంబేద్కర్‌ ఆశయం నెరవేరుతుంది. ఈ పథకం దేశంలో సంచలనాన్ని సృష్టిస్తుంది. గతంలో ప్రభుత్వాలు దళితులకు బిచ్చం వేసినట్టు చిన్నచిన్న పథకాలు అమలుచేశాయి. ఒకేసారి రూ.10 లక్షలు ఎవ్వరూ ఇవ్వలేదు. దీనికి రాజకీయాలకు అతీతంగా అందరూ మద్దతిస్తున్నారు. ముఖ్యమంత్రికి చేతులెత్తి దండం పెడ్తున్నాను. ఇది మానవత్వంతో కూడిన పథకం.
-మాజీ మంత్రి మోతుపల్లి నర్సింహులు

బాగుపడతామన్న నమ్మకం కుదిరింది

దళితబంధుకు క్షేత్రస్థాయిలో విశేష స్పందన వస్తున్నది. నేను స్వయంగా హుజురాబాద్‌లో దీని ఫలితాలను చూశాను. ఈ పథకంతో బాగుపడతామన్న నమ్మకం దళితవర్గాల్లో వచ్చింది. ఆత్మవిశ్వాసం పెరిగింది. అనేకమంది కొత్త కొత్త వ్యాపారాల గురించి ఆలోచిస్తున్నారు. దళిత కుటుంబాల్లో పండుగ వాతావారణం ఉన్నది.
-కొప్పుల ఈశ్వర్‌, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి

వందేండ్ల మాలపల్లి ప్రాసంగికత దళితబంధుకున్నది పాతిన వెలిశిల పాదులో ప్రగతి లిపి మొలిసింది నరకబడ్డ చెట్ల వేర్లు నడక నేర్చుకుంటున్నవి ఏ జాతుల జ్ఞానంచే భరత జాతి వెలిగిందో
ఏ చేతుల సలువ వల్ల ధరణి మైల తొలగిందో ఆ వెలివాడల త్యాగాలకు ప్రతిరూపం అంబేదర్‌ మలి వేకువ యాగానికి శ్రీకారం కేసీఆర్‌. దళితుల పట్ల కొనసాగుతున్న సామాజిక అసమానతతోపాటు ఆర్థిక అసమానత కూడా తొలగిపోవాలని మాలపల్లి నవల రచయిత ఉన్నవ లక్ష్మీనారాయణ ఆకాంక్షించారు. మాలపల్లి నవలకు వందేండ్లు పూర్తికావస్తున్న సందర్భంలో మాలపల్లి ప్రాసంగికత దళితబంధు పథకం అమలు సందర్భంగా మనం అర్థం చేసుకోవాలి. గుర్రం జాషువాకు అర్ద శతాబ్దికి ముందే మంగినపూడి వెంకటశర్మ నిర్యుద్ధ భారతం అనే పద్యకావ్యంలో సనాతన భారతానికి అంటరానితనం చీడలాంటి కళంకమని పేరొన్నారు. జఠప్రోలు సంస్థానం వనపర్తి సంస్థానాదీశులు నాటి కాలం నుంచి దళిత వర్గాల అభివృద్ధికి కొన్ని చర్యలు తీసుకున్నా, దళితుల సమగ్రాభివృద్ధికి తెలుగు నేల మీద విప్లవాత్మకంగా పాటుపడిన ఒకే ఒక్క ప్రజాస్వామిక నేత సీఎం కేసీఆర్‌. దళితబంధు పథకానికి అగ్రకుల మేధావులు కూడా మద్దతివ్వాలి. దళితబంధు దేశ దళితజాతి అభ్యున్నతికి బాటలు వేయడం ఖాయం.

ప్రజాకవి గోరటి, ఎమ్మెల్సీ

విజయవంతం బాధ్యత మనందరిది
దళితబంధు పథకం గొప్ప ఆలోచన. దీనిని విజయవంతం చేయాల్సిన బాధ్యత అందరిపై ఉన్నది. ఒక తరానికి తరం అభివృద్ధి చెందుతుంది. తండ్రిలా ఆలోచించి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ పథకానికి రూపకల్పన చేశారు.

వేముల ప్రశాంత్‌రెడ్డి, రోడ్లు, భవనాలశాఖ మంత్రి

దేశానికి రోల్‌మోడల్‌
దళితబంధు పథకాన్ని ప్రతి రాష్ట్రం గమనిస్తున్నది. దేశానికి రోల్‌మోడల్‌ కాబోతున్నది. అవకాశాలను అందిపుచ్చుకోవడానికి అవసరమైన ఆర్థిక వనరులను తెలంగాణ సర్కారు సమకూరుస్తున్నది. వీటిని సద్వినియోగం చేసుకోని దళితజాతి బాగుపడాలి.
-వీ శ్రీనివాస్‌గౌడ్‌, ఆబ్కారీశాఖ మంత్రి

రాజకీయాలను పక్కనపెట్టాలి
రాజకీయాలను పక్కనపెట్టి పథకం అమలుపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టిపెట్టారు. ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యే నియోజకవర్గాన్ని కూడా పైలట్‌ ప్రాజెక్టులో ఎంపిక చేయడమే దీనికి నిదర్శనం.

పువ్వాడ అజయ్‌, రవాణాశాఖ మంత్రి
సాహసోపేత నిర్ణయం
దళితబంధు పథకం సాహసోపేత నిర్ణయం. అకుంఠిత దీక్షతో దీనిని విజయవంతం చేసేందుకు ప్రయత్నిద్దాం. స్వాతంత్య్ర భారత చరిత్రలో ఈ తరహా పథకాన్ని ఏ ప్రభుత్వమూ అమలు చేయలేదు.
-నిరంజన్‌రెడ్డి, వ్యవసాయ మంత్రి

దళితుల జీవితాలు మారుతాయి
దళితబంధుతో దళితుల జీవితాలు మారుతాయి. నల్లగొండ జిల్లాలో ఇప్పటికే దళితులకు చేప పిల్లల పెంపకం, ఉత్పత్తికి సంబంధించిన కాంట్రాక్టులు ఇచ్చాం. కూరగాయలు వంటివాటికి బ్రాండింగ్‌ చేస్తున్నాం. యూనిట్ల ఏర్పాటుపై లబ్ధిదారులకు ఐడియాలిస్తాం.
-జగదీశ్‌రెడ్డి, విద్యుత్తుశాఖ మంత్రి

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.