-11 నుంచి పైలట్ ప్రాజెక్టు -రాష్ట్రవ్యాప్తంగా 27 గ్రామాలు ఎంపిక -గజ్వేల్ నియోజకవర్గంలో 3 గ్రామాలు -తదుపరి దశలో పట్టణ భూముల సర్వే -ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం -భూములకు అక్షాంశ, రేఖాంశాలు ఇచ్చి -శాశ్వతంగా రక్షణ కల్పించేందుకు చర్యలు -భావితరాలకు భూతగాదాలు ఉండొద్దనే.. -భూ సమస్యల్లేని దేశాల్లో పెరిగిన జీడీపీ -భూముల్లో ఇంచు కూడా తేడా రావొద్దు -సర్వేలో నిర్లక్ష్యం వహిస్తే చట్టపర చర్యలు -గ్రామసభలు నిర్వహించి సర్వే చేయాలి -కలెక్టర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, -ఇతర ప్రజాప్రతినిధులు సహకరించాలి -పంజాబ్‌ను మించి ధాన్యం పండిస్తున్నం -ఎవుసాన్ని క్రమంగా స్థిరీకరించుకున్నం -రాష్ట్రంలో పెరుగుతున్న భూముల ధరలు -అద్భుతంగా పనిచేస్తున్న ధరణి పోర్టల్ -సర్వే ప్రతినిధులతో సమీక్షలో సీఎం కేసీఆర్
రాష్ట్రంలోని వ్యవసాయ భూములకు డిజిటల్ సర్వే నిర్వహించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. ముందుగా ఈనెల 11 నుంచి పైలట్ డిజిటల్ సర్వేను చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పైలట్ ప్రాజెక్టు కింద సర్వేచేయడానికి రాష్ట్రవ్యాప్తంగా 27 గ్రామాలను ఎంపికచేయాలని, ఇందులో 3 గ్రామాలను గజ్వేల్ నియోజకవర్గం నుంచి, మిగతా 24 గ్రామాలను రాష్ట్రంలోని ఇరవై నాలుగు జిల్లాల నుంచి ఎంపికచేయాలని సీఎస్ సోమేశ్‌కుమార్‌కు సీఎం నిర్దేశించారు. భూముల డిజిటల్ సర్వే నిర్వహణ అంశాన్ని చర్చించేందుకు ప్రగతిభవన్‌లో బుధవారం సీఎం కేసీఆర్ డిజిటల్ సర్వే ఏజెన్సీల ప్రతినిధులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ‘రాష్ట్రంలోని పేదల భూమి హకుల రక్షణ కోసమే ధరణి పోర్టల్‌ను అమల్లోకి తెచ్చినం. భూ తగాదాలులేని భవిష్యత్ తెలంగాణను నిర్మించే లక్ష్యంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం డిజిటల్ సర్వే చేయిస్తున్నది. రాష్ట్రంలోని వ్యవసాయ భూములను డిజిటల్ సర్వేచేసి, వాటికి అక్షాంశ, రేఖాంశాలను (కో ఆర్డినేట్లు) గుర్తించి, తద్వారా పట్టాదారుల భూములకు శాశ్వత ప్రాతిపదికన రక్షణ చర్యలు చేపట్టాలనేదే ప్రభుత్వ ఉద్దేశం’ అని చెప్పారు. ప్రజల భూమిహకులను కాపాడాలనే ప్రభుత్వ నిర్ణయంలో భాగంగా డిజిటల్ సర్వేను సమర్థంగా నిర్వహించాలని సర్వే సంస్థలను కోరారు. ‘తెలంగాణ ప్రభుత్వ ఉద్దేశాన్ని అర్థం చేసుకోం డి. వ్యాపారంకోణం నుంచే కాకుండా, రైతులకు సామాజికసేవగా భావించి సర్వే నిర్వహించండి’ అని కేసీఆర్ పిలుపునిచ్చారు. పైలట్ సర్వేలో భాగంగా ముందుగా తగాదాలు లేని గ్రామాల్లో సర్వే నిర్వహించాలని, తర్వాత అటవీభూము లు, ప్రభుత్వ భూములు కలిసి ఉన్న గ్రామాల్లో నిర్వహించాలని సూచించారు. ఇలా సమస్యలు లేని గ్రామాలు.. సమస్యలు ఉన్న గ్రామాల్లో.. మిశ్రమంగా సర్వే నిర్వహించి క్షేత్రస్థాయిలో అనుభవాల్ని గ్రహించాలని చెప్పారు. తద్వారా పూర్తిస్థాయి సర్వేకు విధి విధానాలను ఖరారుచేసుకోవాలని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ముం దుగా వ్యవసాయ భూముల సర్వే చేపట్టాలని, అవి పూర్తయిన అనంతరం పట్టణ భూముల సర్వే చేపట్టే అవకాశమున్నదని వెల్లడించారు.
పీడింపులు లేని రిజిస్ట్రేషన్లపై ప్రశంసలు ‘తెలంగాణను సాధించుకొని అన్ని రంగాలను తీర్చిదిద్దుకొంటున్నం. సాగునీటి ప్రాజెక్టులను నిర్మించి నీళ్లు అందిస్తున్నం. తెలంగాణ ఇవ్వాల పంజాబ్‌ను మించి ధాన్యాన్ని పండించే పరిస్థితికి చేరుకొన్నది. ఈ నేపథ్యంలో భూములకు ధరలు కూడా పెరుగుతున్నవి. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ప్రజల భూములకు రక్షణ కల్పించే చర్యలను ప్రభుత్వం చేపట్టింది. మధ్య దళారీలు లేకుండా సామాన్య రైతును పీడించే వ్యవస్థలను తొలిగించి పూర్తి పారదర్శకంగా ఉండేలా ధరణి పోర్టల్‌ను ప్రభుత్వం రూపొందించింది. అన్ని అవాంతరాలను అధిగమించి ధరణి పోర్టల్ అద్భుతంగా పనిచేస్తున్నది. తమకు ఎలాంటి పీడింపులు లేకుండా రిజిష్ట్రేషన్లు తదితర భూ లావాదేవీలు జరుగుతున్నాయని, ప్రజలనుంచి ప్రభుత్వం ప్రశంసలు అందుకొంటున్నది’ అని సీఎం కేసీఆర్ తెలిపారు. గ్రామాల్లో తగాదాలు లేనివిధంగా ఇప్పటికే ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయ భూ వ్యవహారాలు చకబడిన నేపథ్యంలో డిజిటల్ సర్వే నూటికి నూరు శాతం విజయవంతం అవుతుందని సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు.
భూమి హక్కుల ప్రక్రియలో చాలా మార్పులు వేలఏండ్లుగా కొనసాగుతున్న భూపరిపాలనలో రోజురోజుకూ గుణాత్మక మార్పులు చోటుచేసుకొంటున్నాయని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ వివరించారు. ‘మనిషి ఆదిమానవుడిగా బతుకు ప్రారంభించినప్పుడు భూమ్మీద హకు లులేవు. మనిషి వ్యవసాయం నేర్చుకొన్న అనంతర పరిణామాల్లోనే ఈ హకు అనేది ప్రారంభమైంది. అటు తర్వాత రాజులకాలం నుంచి నేటి ప్రజాస్వామికవ్యవస్థ వరకు భూమి హకుల ప్రక్రియలో అనేక రకాల మార్పులు చోటుచేసుకొంటూ వస్తున్నాయి. మారుతున్న కాలంలో ప్రభుత్వాలు కూడా ప్రజల భూములు, ఆస్తుల రక్షణ విషయంలో అప్‌డేట్ అవుతూ ఉండాలి. నూతన సాంకేతిక విధానాలను అనుసరిస్తూ ప్ర జలభూములు, ఆస్తులకు రక్షణ కల్పించే చర్య లు చేపట్టాలి. అదేపనిని ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం ఉద్దేశాన్ని లక్ష్యాన్ని అర్థం చేసుకొని, అందుకు అనుగుణంగా కార్యాచరణను రూపొందించుకొంటారనే నేను మీకు ఈ చారిత్రక నేపథ్యాన్ని వివరిస్తున్నాను’ అని సీఎం కేసీఆర్ తెలిపారు.
భూ తగాదాలకు శాశ్వత పరిష్కారంగా సర్వే భూ తగాదాలు నూటికి నూరుశాతం లేకుండా పరిషరించుకున్న దేశాల్లో ఆదాయం (జీడీపీ) 3 నుంచి 4 శాతం పెరిగిందని గణాంకాలు నిరూపిస్తున్నాయని సీఎం కేసీఆర్ వెల్లడించారు. తెలంగాణను సాధించుకొన్న తర్వాత గత పాలకులు విస్మరించిన ప్రజా సమస్యల్లో భూ సర్వే కూడా మిగిలిపోయిందని చెప్పారు. ఈ విషయంలో చిన్న తప్పు జరిగినా భవిష్యత్తు తరాలు మూల్యం చెల్లించుకొంటాయని హెచ్చరించారు. ప్రభుత్వాలు చేసే తప్పులకు పేద ప్రజలు ఇబ్బందులు పడకూడదనే.. గత పాలకుల అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ముందుచూపుతో తెలంగాణ ప్రభుత్వం భూ సర్వే కోసం చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు. రైతుబంధు పేరిట పంట సాయాన్ని అందిస్తూ, సాగునీరు అందిస్తూ రైతును బాగుచేసుకొంటూ, వ్యవసాయాన్ని స్థిరీకరించుకొన్నామని తెలిపారు. విద్య, వైద్యం, తాగునీరు వంటి రంగాలను ఒకొకటిగా చకదిద్దుకొంటూ వస్తున్న ప్రభుత్వం.. రేపటి భవిష్యత్తు తరాలకు భూ తగాదాలు లేకుండా శాశ్వతంగా పరిషారం చూపాలనే ఉద్దేశంతో డిజిటల్ సర్వేను చేపడుతున్నదని సీఎం కేసీఆర్ వెల్లడించారు. ఈ సమావేశంలో ఎంపీ రంజిత్‌రెడ్డి, రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, సీఎస్ సోమేశ్‌కుమార్, సీఎంవో ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ్‌రావు, సీఎం కార్యదర్శి భూపాల్‌రెడ్డి, సీఎం కార్యదర్శి (రెవెన్యూ), రిజిస్ట్రేషన్ల శాఖ సీఐడీ వీ శేషాద్రి, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్, డీజీపీ మహేందర్‌రెడ్డి, ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు, సర్వే లాండ్ రికార్డ్స్ కమిషనర్ శశిధర్, టీఎస్‌టీఎస్ ఎండీ వెంకటేశ్వర్‌రావు, డిజిటల్ సర్వే సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఇంచు తేడా రాకుండా కొలత డిజిటల్ సర్వే నిర్వహణ విధివిధానాలపై సీఎం కేసీఆర్ సర్వే ఏజెన్సీల ప్రతినిధులతో చర్చించారు. వారి కార్యాచరణ గురించి కూలంకషంగా అడిగి తెలుసుకొన్నారు. రైతులకు ఇంచుభూమి కూడా తేడారాకుండా కొలతవచ్చేలా అత్యాధునిక సాంకేతికతను వినియోగించి సర్వే చేపట్టాలని వారికి సూచించారు. తేడాలు రాకుం డా సర్వేచేయాల్సిన బాధ్యత ఏజెన్సీలదేనని, ఏమాత్రం అలసత్వం వహించినా తప్పులకు తావిచ్చినా, చట్టపరమైన చర్యలను తీసుకోవడానికి ప్రభుత్వం వెనకాడదని సీఎం సర్వే ఏజెన్సీల ప్రతినిధులకు స్పష్టంచేశారు.
టిప్పన్ నక్షా విధానం ప్రాతిపదికగా సర్వే గ్రామాల్లో సంప్రదాయంగా కొనసాగుతూ వస్తున్న భూ సర్వే విధానంలో అవలంబిస్తున్న టిప్పన్ నక్షా విధానాన్ని ప్రాతిపదికగా చేసుకొని సర్వే నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. గ్రామ సభలు నిర్వహించి, ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించి, సర్వే చేపట్టాలని సూచించారు. ఈ క్రమంలో ప్రభుత్వం ఎప్పటికప్పుడు కావాల్సిన సహకారం అందిస్తుందని, కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇతర ప్రజాప్రతినిధులు అందుబాటులో ఉంటూ సర్వే ఏజెన్సీలకు సహకరిస్తారని చెప్పారు. సర్వే పూర్తిచేయాల్సిన బాధ్యత ఏజెన్సీలదేనని సీఎం కేసీఆర్ అన్నారు.