వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలుచేయడంవరకే పరిమితం కాకుండా, వాటి నిల్వకు కూడా మార్కెటింగ్‌శాఖ ప్రణాళికాబద్ధంగా గోదాముల నిర్మాణం చేపట్టాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సూచించారు. సచివాలయంలో శుక్రవారం మార్కెటింగ్శాఖపై ఆ శాఖ మంత్రి హరీశ్‌రావు, మార్కెటింగ్, వ్యవసాయశాఖల ఉన్నతాధికారులతో సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. రైతులకు విత్తనాలు, ఎరువులు సకాలంలో అందించేందుకు ముందుగానే నిల్వ చేసుకునే ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఏడాదికి ఎన్ని లక్షల టన్నుల వ్యవసాయ ఉత్పత్తులు వస్తున్నాయి? గోదాముల సామర్థ్యం ఎంత? ఎక్కడెక్కడ గోదాముల అవసరముంది? అనే విషయాలపై అధ్యయనంచేసి అవసరమైనచోట గోదాముల నిర్మాణం చేపట్టాలని సీఎం సూచించారు.

-అవసరమైన చోట కొత్తవి నిర్మించాలి -విత్తనాలు, ఎరువుల నిల్వకోసం ఏర్పాట్లు చేయాలి -నకిలీ ఎరువులు, విత్తనాలపై ఉక్కుపాదం మోపాలి -మార్కెటింగ్‌శాఖ సమీక్షలో సీఎం కేసీఆర్ ఆదేశం ధాన్యం కొనుగోలు చేస్తున్న ప్రభుత్వరంగ సంస్థలు, మార్కెటింగ్‌శాఖ, వ్యవసాయ పరపతి సంఘాలు, డ్వాక్రా సంఘాలు సమన్వయంతో కొనుగోళ్లు, నిల్వ, గోదాముల నిర్వహణ చేపట్టాలని ఆదేశించారు. గోదాములను ధాన్యం, మొక్కజొన్నలాంటివాటికోసమే కాకుండా, ఎరువులు, విత్తనాల నిల్వ కోసం కూడా ఉపయోగించాలన్నారు. ప్రతి సీజన్లో రైతులు ఎరువుల కోసం రోడ్డెక్కటం పరిపాటిగా మారిందని, ఇలాంటి పరిస్థితి పోవాలంటే రైతులకు ఎన్ని టన్నుల ఎరువులు అవసరముందో ముందే అంచనావేసి.. వేసవికాలంలోనే తెప్పించి గోదాములలో నిల్వ చేసుకోవాలని సూచించారు.
ఎండాకాలంలో ఎరువులు, విత్తనాల నిల్వ కోసం.. వర్షాకాలం తర్వాత వ్యవసాయ ఉత్పత్తుల నిల్వ కోసం గోదాములు ఉభయతారకంగా ఉపయోగించుకోవాలన్నారు. మార్కెటింగ్‌శాఖ ఖర్చు పెట్టే ప్రతి రూపాయి రైతులకు ఉపయోగపడాలని పేర్కొన్నారు. మార్కెట్లకు తడిసిన ధాన్యం తీసుకురావటంతో రైతులకు ధర తక్కువగా వస్తున్నదని, దీన్ని నివారించేందుకు మార్కెట్లలో డ్రైయ్యర్లు పెట్టాలని ఆదేశించారు. నకిలీ ఎరువులు, పురుగు మందులు, కల్తీ విత్తనాల నిరోధానికి కఠినంగా వ్యవహరించాలని సూచించారు. ఫర్టిలైజర్ మిక్సింగ్ ప్లాంట్లలో ఎరువుల పేరుతో మట్టిని కలిపి మోసం చేస్తున్నారని, అధికారులు ఈ విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు.
శీతల గిడ్డంగుల నిర్మాణంలో జాగ్రత్తగా ఉండాలని, ఏయే వ్యవసాయ ఉత్పత్తులకు ఎంతమేరకు చల్లదనం అవసరమో గుర్తించి వాటిలో ప్రత్యేక ఛాంబర్లు ఏర్పాటుచేయాలని పేర్కొన్నారు. ఈ సమీక్షా సమావేశంలో పార్లమెంటరీ కార్యదర్శి జలగం వెంకట్రావ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ , మార్కెటింగ్‌శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య, వ్యవసాయశాఖ డైరెక్టర్ జీడీ ప్రియదర్శిని, మార్కెటింగ్‌శాఖ అదనపు డైరెక్టర్ లక్ష్మీబాయి తదితరులు పాల్గొన్నారు.