Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

వైభవంగా కాళేశ్వరం

-పొరుగు రాష్ట్రాలతో సత్సంబంధాలతో చక్కటి ఫలితాలు
-మహారాష్ట్ర సహకారంతోనే కాళేశ్వరం సాకారం.. అదే బాటలో కర్ణాటక
-కాళేశ్వరంతో 80 శాతం తెలంగాణకు సాగు, తాగునీరు ఈ ఏడాది సీతారామ, దేవాదుల పూర్తి
-ప్రాజెక్టుల విషయంలో అహోరాత్రులు శ్రమించా.. నేను అచీవర్‌ని: సీఎం కేసీఆర్
-ఉద్యోగులకు పీఆర్సీ, రిటైర్మెంట్ వయసు పెంపుతో ఒకే ప్యాకేజీ త్వరలో కొత్త మున్సిపల్ చట్టం
-జూలైలోగా మున్సిపల్ ఎన్నికలు పూర్తి పటిష్ఠంగా పంచాయతీరాజ్ చట్టం అమలు
-ఏపీతో స్నేహపూర్వక సంబంధం
-తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి అంగుళానికి నీరు అందిస్తాం
-నేడు ఏపీ భవనాల అప్పగింత
-27 హైదరాబాద్‌కు ఏపీ డెలిగేషన్
-సామరస్యంగా విభజన సమస్యల పరిష్కారం
-జగన్ యువకుడు.. ఉత్సాహవంతుడు
-టీఆర్‌ఎస్ పార్టీ భవన నిర్మాణాలకు అన్ని జిల్లాల్లో భూ కేటాయింపు
-డైరెక్టర్ శంకర్‌కు స్టూడియో నిర్మాణానికి 5 ఎకరాలు
-శారదాపీఠానికి రెండెకరాలు
-మేం ఎన్డీయేలో భాగస్వాములం కాదు
-ఫెడరల్ ఫ్రంట్‌కు కట్టుబడి ఉన్నా
-మోదీని మొదట విమర్శించింది నేనే
-నిధుల విషయంలో షాను క్షమాపణ చెప్పాలని డిమాండ్‌చేశా
-నచ్చిన చోట సమర్థించా.. నచ్చనిచోట విమర్శించా
-కేంద్రరాష్ట్ర సంబంధాలు రాజ్యాంగబద్ధంగానే ఉంటాయి
-క్యాబినెట్ సమావేశం అనంతరం రాష్ట్ర సీఎం కేసీఆర్ వెల్లడి

తెలంగాణను సస్యశ్యామలంచేసే కాళేశ్వరం ప్రాజెక్టును వైభవంగా ప్రారంభించుకొంటున్నామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తెలిపారు. 45 లక్షల ఎకరాలకు సాగునీటిని, 80 శాతం తెలంగాణకు తాగునీటిని అందించే, పారిశ్రామిక అవసరాలు తీర్చే ఇలాంటి బృహత్తర ప్రాజెక్టు ఏ రాష్ట్రంలోనూ లేదన్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంగా కాళేశ్వరం ప్రాజెక్టును సీఎం అభివర్ణించారు. సముద్రంలోకి వృథాగా పోతున్న దాదాపు ఐదువేల టీఎంసీల నీళ్లను తెలంగాణ, ఏపీలోని ప్రతి అంగుళానికి అందించాలని నిర్ణయించామని సీఎం కేసీఆర్ తెలిపారు. గత ప్రభుత్వం గిల్లికజ్జాలు పెట్టుకోవడం వల్ల గత ఐదేండ్లలో చాలారకాలుగా నష్టపోయామని.. ఇకపై అలా జరిగే ఆస్కారం లేదన్నారు.

మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లతో స్నేహసంబంధాలు కొనసాగిస్తామని వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో మహారాష్ట్ర సహకారం మరువలేనిదని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌తో సంబంధాలు ప్రభుత్వం మారిన తర్వాత మెరుగుపడ్డాయని.. వీటిని కొనసాగిస్తూ ఇరురాష్ర్టాల మధ్య అన్ని అంశాలను సామరస్యంగా పరిష్కరించుకొంటామని సీఎం చెప్పారు. ఈ నెల 27న కొత్త సచివాలయ, శాసనసభ భవనాలకు శంకుస్థాపన చేస్తామని సీఎం ప్రకటించారు. ఉద్యోగులకు పదవీ విరమణ వయస్సు పెంపుదలతోపాటు, పీఆర్సీని కలిపి ఒకే ప్యాకేజీగా ఇస్తామని ప్రకటించారు. జూలైలోగా మున్సిపల్ ఎన్నికలను నిర్వహిస్తామన్నారు. పంచాయతీరాజ్ చట్టాన్ని పటిష్ఠంగా అమలుచేయాలని నిర్ణయించామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో టీఆర్‌ఎస్ పార్టీ భవనాలకోసం భూములను కేటాయించాలని మంత్రిమండలి నిర్ణయించినట్లు సీఎం చెప్పారు. సినీదర్శకుడు శంకర్‌కు స్టూడియో నిర్మాణానికి ఐదెకరాలు, శారదాపీఠానికి రెండెకరాలు కేటాయిస్తున్నామని తెలిపారు. మంగళవారం రాష్ట్ర మంత్రిమండలి సమావేశం అనంతరం ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడారు. వివిధ అంశాలపై సీఎం పేర్కొన్న వివరాలు ఆయన మాటల్లోనే..

ఇరుగుపొరుగు రాష్ట్రాలతో కొనసాగించాల్సిన సంబంధాలు.. దాంతో వచ్చే ఫలితాలు.. తద్వారా రాష్ట్ర పురోగతికి దోహదపడే అంశాలపై విస్తృతస్థాయి చర్చ జరిగింది. ఇరురాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు ఇది చక్కని శుభవార్తగా భావిస్తున్నాను. తప్పకుండా ఆంధ్రప్రదేశ్‌తో స్నేహపూర్వక సంబంధం కొనసాగించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఇటీవలికాలంలో జరిగిన పరిణామాలు, ఏపీలో ప్రభుత్వ మార్పు, తదనంతరం ఆ రాష్ట్ర సీఎంతో వివిధ సందర్భాల్లో జరిగిన చర్చల దరిమిలా ఏపీ ప్రభుత్వం ముందుకొచ్చి భేషజాల్లేకుండా హైదరాబాద్‌లోని ప్రభుత్వ కార్యాలయాలు తెలంగాణ ప్రభుత్వానికి అప్పగిస్తున్నటువంటి పరిణామాలు.. వీటన్నింటి నేపథ్యాన్ని పురస్కరించుకుని చక్కటి వాతావరణం ఏర్పడింది. గతంలో మహారాష్ట్ర, కర్ణాటకతో రోజు బస్తీ మే సవాల్ అన్నట్లు పంచాయితీలుండేవి. అనేక విషయాల్లో అనేకరకాల వివాదాలుండేవి. కోర్టు వ్యాజ్యాలుండేవి. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక కర్ణాటకతో సత్సంబంధాలు పెట్టుకున్నాం. అవి కొనసాగుతున్నాయి. మూడుసార్లు వాటర్‌ను ఎక్స్చేంజి చేసుకున్నాం. మొట్టమొదటిసారి తెలంగాణ అడిగితే వారు నీరివ్వడం, వారు అడిగితే ఆర్డీఎస్ ద్వారా నీరు ఇవ్వడం.. మళ్లీ మొన్న జూరాల కోసం అవసరమైతే మూడోసారి కూడా మూడు టీఎంసీల నీరిచ్చారు. ఇది నిజంగా మంచి డెవలప్‌మెంట్. అదే పద్ధతిలో గత కాంగ్రెస్ ప్రభుత్వాలు పెండింగులో పెట్టినటువంటి ప్రాజెక్టుల సంగతి మనకు తెలుసు. లోయర్ పెన్‌గంగ.. ఐదు దశాబ్దాల నుంచి పెండింగులో ఉన్నది.

నేను ఆహ్వానిస్తే.. మీరు రావొద్దంటారా?
ప్రాజెక్టు ప్రారంభానికి ఆహ్వానించడానికి నేను పోతుంటే ఇక్కడున్న మీరు రావద్దని అంటున్నరు. ఇది రాష్ట్రానికి మంచిది కాదు. ఎవరన్న ఇలా మాట్లాడుతరా.. సంస్కారం అనిపించుకుంటుందా.. ఇది మంచిదా.. జీవితంలో 50 ఏండ్లు అధికారం ఇస్తే కట్టలేదు. తమ్మిడి హెట్టి అని ప్రారంభించి తట్టెడుమన్ను కూడా తవ్వలేదు. అనుమతి సాధించలేదు. అగ్రిమెంట్ చేసుకోలేదు. లోయర్ పెన్‌గంగ, లెండి కెనాల్ పెండింగ్ పెట్టారు. ఇండియా మొత్తంలో 45 లక్షల ఎకరాలకు సాగునీటిని, 80శాతం తెలంగాణకు తాగునీటితోపాటు, పారిశ్రామిక అవసరాలు తీర్చే బృహత్తర ప్రాజెక్టు ఏ రాష్ట్రంలోనూ లేదు. ఇది ప్రపంచపు అతి పెద్ద మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం. అంతపెద్ద ప్రాజెక్టు ఇది. తక్కువ సమయంలోచేశాం. అన్ని గ్రామాల్లో పండుగ జరుపుకుంటరు. రాష్ట్రమంతా పండుగ వాతావరణం ఉంటుంది. ప్రాజెక్టు సమీపంలో తక్కువ స్థలం ఉంటుంది. వర్షం కురిస్తే ఇబ్బందులుంటాయి కాబట్టి పరిమిత సంఖ్యలో వెళ్తున్నాం. లైవ్ టెలికాస్ట్ ఉంటుంది కాబట్టి సభ పెట్టలేదు. మంచి సందర్బం కాబట్టి పాజిటివ్ కోణంలో కవర్ కావాలి. రాజకీయాలుంటే మాట్లాడుకుందాం అదివేరే సంగతి. ఇదొక పాజిటివ్ అంశం. కొత్త రాష్ట్రానికి ఒక అచీవ్‌మెంట్.

అది కాంగ్రెస్ నాయకులకు ఎన్నికల నినాదం. ఆ ప్రాజెక్టు ఈ రోజు చనాకా కొరాట రూపం లో చకచకా నిర్మాణం జరుగుతున్నది. షార్ట్‌లీ కంప్లీట్ కానున్నది. ప్రపంచమే అబ్బురపరిచే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభించుకొనే దశకు వచ్చింది. దానికి ఇంకా కొన్ని పనులు కావాల్సి ఉన్నవి. కొన్ని రిజర్వాయర్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. యాభై శాతం పూర్తికావాల్సి ఉన్నది. కొన్ని జరుగుతున్నాయి. పూర్తి సత్ఫలితాలు రావడానికి మరికొంత సమయం పడుతుంది. ఇంత చక్కగా పనులు జరగడానికి మహారాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహమే కారణం. చివరి దశలో మొన్న కూడా 15 ఎకరాల ప్రైవేటు భూమి, 25ఎకరాల అటవీభూమిని ఇప్పించారు. కరకట్టలు కట్టడానికి అవసరమైతే వారు ఉదారంగా వ్యవహరించారు. పర్యావరణ అనుమతులూ ఇప్పించారు. స్నేహపూర్వకంగా ఉండటం మూలాన ఇది సాధ్యమైంది. అదే శత్రుభావంతో ఉంటే.. గిల్లికజ్జాలు పెట్టుకుంటే సాధ్యమవుతుందా? ఈ ప్రాజెక్టు 45 లక్షల ఎకరాలకు రెండు పంటలకు నీళ్లిస్తది. ఫేజు-1లో 25 లక్షల ఎకరాలకు, శ్రీరాంసాగర్ ఆయకట్టు, ప్లస్ సిరిసిల్ల్ల దాని తాలుకా పరిసరాలు, హుస్నాబాద్ తాలుకా దాని పరిసరాల్లో ఉండే ప్రాంతాలు.. కొత్త, పాత కలిపి సుమారు 25 లక్షల ఎకరాలకు నీళ్లొస్తయ్. ఆపైన సిద్దిపేట జిల్లా, ప్రస్తుతం మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్‌కు వచ్చేనాటికి.. మరో 20 లక్షల ఎకరాలకు, అంటే దాదాపు 45 లక్షల ఎకరాలకు సాగునీరు, తెలంగాణ పారిశ్రామిక అవసరాలతోపాటు తెలంగాణకు సమృద్ధిగా నీరు అందించే మహత్తరమైన ప్రాజెక్టు కాళేశ్వరం ఇంత త్వరగా పూర్తి కావడంపట్ల ఆశ్చర్యపోతున్నారు. విజయవంతంగా ప్రారంభించుకొంటున్నాం. అందుకే, స్వయంగా మహారాష్ట్రకు వెళ్లి, విజయవాడకు వెళ్లి ఇద్దరుముఖ్యమంత్రులను ఆహ్వానించడం జరిగింది. ఇదే రకమైన స్నేహపూర్వక వాతావరణం కొనసాగించాలని కోరడం జరిగింది. వారిద్దరూ అంగీకరించారు. ఇంతత్వరగా ప్రాజెక్టు పూర్తయినందుకు సాక్షాత్తు మహారాష్ట్ర ముఖ్యమంత్రి షాక్ అయ్యారు. నిన్నమొన్న వచ్చి అగ్రిమెంట్‌చేసినట్లే ఉందన్నారు.

ఐదువేల టీఎంసీల నీళ్లను వాడుకుందాం..
ఏపీలో నూతన ముఖ్యమంత్రి యువకుడు, ఉత్సాహవంతుడు.. అక్కడి మెట్ట ప్రాంతాలకు నీరు ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. తెలంగాణలో మనం ఎట్లయితే ప్రాజెక్టులను పూర్తిచేశామో.. ఏపీలో నూచేయాలని అనుకుంటున్నాడు. ఈ భేషజాలు పనికిరావన్నాడు. నేను ముఖ్యకార్యదర్శి, ఆర్థిక కార్యదర్శి విజయవాడలో సమావేశమయ్యాం. 27న ఇక్కడికి ఏపీ డెలిగేట్స్ వస్తారు. హైదరాబాద్‌లో ఒక దఫా ఒకటిరెండ్రోజులు సమావేశమవుతాం. తర్వా తి సమావేశం విజయవాడలో పెట్టుకుంటాం. అవసరమైతే క్షేత్రపర్యటనలకు ఇరు రాష్ట్రాలకు సంబంధించిన సంయుక్త బృందాలు పోవాలని నిర్ణయించాం. ఇది తెలుగు ప్రజలకు సంతోషకరమైన శుభవార్త. పాత ఆంధ్రప్రదేశ్ అయినా, ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అయినా.. 1480 టీఎంసీలు గోదావరిలో కేటాయింపులున్నాయి. 811 టీఎంసీలు కృష్ణాలో కేటాయించారు. రెండు కలిపితే సుమారు 2,300 టీఎంసీల నీళ్లు మనకు కేటాయించారు. మనం వాడుకోకుండా మిగిలితే బంగాళాఖాతంలోకి పోతాయి. చివరి రాష్ట్రాలు మనవే కాబట్టి, మిగులు జలాలు మనమే వాడుకోవాలని బచావత్ ట్రిబ్యునల్ చెప్పింది. 50 సంవత్సరాల సీడబ్ల్యూసీ రికార్డులను పరిశీలిస్తే.. సుమారు 3,500 టీఎంసీల నీళ్లు సముద్రంపాలవుతున్నది.

నేను అచీవర్‌ని
ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగే అఖిలపక్ష సమావేశానికి మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ను పంపుతున్నాను. నేను కాళేశ్వరం పనుల్లో తలమునకలై ఉన్నాను. ఈ సమావేశానికి హాజరవడం గురించి ప్రధాని కార్యాలయాన్ని సంప్రదించాం. వారు వర్కింగ్ ప్రెసిడెంట్‌ను పంపండన్నారు. పంపుతున్నా. ప్రధానిని కాళేశ్వరం ప్రాజెక్టుకు పిలవలేదనడం సరికాదు. ప్రతిదానికి పిలవము కదా? గతంలో మిషన్ భగీరథకు ఆహ్వానించాం. అన్నింటికీ పిలవాలా? నేను అచీవర్‌ను. నీతి ఆయోగ్‌కు నేను హాజరైతే ఒక వార్త. కాకపోతే. ఒక వార్త. కొందరు సిల్లీ వ్యక్తులు, పనికిమాలిన వారు ఊహించుకొని చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వంగా మా పద్ధ్దతిలో మేం ఉన్నాం. రాజకీయంగా కూడా మేం ఉండే రీతిలో మేం ఉంటాం. అసెంబ్లీలో బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచాం. ఆ తర్వాత స్థానిక సంస్థల్లో క్లీన్‌స్వీప్ చేశాం. పార్లమెంటులో మెజార్టీ సీట్లు కైవసం చేశాం. ఇవన్నీ చాలామందికి నచ్చవు. దానికి మేం ఏం చేస్తాం? వారు హుందాగా ఉండాల్సిన అవసరం ఉంది.

శ్రీశైలానికి అతిపెద్ద నదులు తుంగభద్ర, భీమా.. మిగతావి చిన్నచిన్నవి ఉన్నాయి. వీటిలో శ్రీశైలాన్ని ప్రామాణికంగా తీసుకుంటాం. అందులోనూ 1200 టీఎంసీలను ప్రామాణికంగా తీసుకుంటాం. సుమారు 4,700- 4,800 టీఎంసీల నీళ్లు ఇరురాష్ట్రాలు కలిపి వాడుకోవడానికి పుష్కలమైన అవకాశమున్నది. ఇంతకుముందు పొరపొచ్చాలు పెట్టుకుని, అపార్థాలు పెట్టుకుని, అవసరం లేనటువంటి కయ్యం పెట్టుకొని, కీచులాటలు పెట్టుకొని తెలుగు రాష్ట్రాల ప్రజలు నష్టపోయారు. ఇప్పుడు కీచులాటల్లేవు. కొట్లాటల్లేవ్. కేంద్రం పరిష్కరించాల్సిన దుర్గతి ఉండకూడదని నిర్ణయించాం. ఈరోజు తెలంగాణ క్యాబినెట్ కూడా ఇదే ఎండార్స్ చేసింది. నికరజలాలు, వరదజలాలను కలుపుకొంటే సుమారుగా కొంచెం అటుఇటుగా 5,000 టీఎంసీల నీళ్లను ఇరు రాష్ట్రాల్లోని ప్రతి అంగుళానికి తీసుకుపోవాలని నిర్ణయించాం. సంయుక్త ఆలోచనలతో ముందుకు వెళ్లాలని నిర్ణయించాం. దాని ఫలితాలు రానున్న రెండు, మూడేండ్లలో చూపెడతాం. విభజన అంశాలు, రోడ్డు రవాణా ఒప్పందాలు.. మోటర్ పర్మిట్స్.. ఇలా పరస్పరం సహకరించుకొనేలా.. ప్రతి అంశంలో ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ముందుకెళ్లాలని నిర్ణయించాం. యావత్ ప్రజలకు శుభం జరగాలని నిర్ణయించాం.

డైరెక్టర్ ఎన్ శంకర్‌కు 5 ఎకరాలు
తెలంగాణకు చెందిన డైరెక్టర్ ఎన్ శంకర్ స్టూడియో కట్టాలని కోరుతున్నారు. అతనికి శంకర్‌పల్లి సమీపంలోని మోకిల పరిసర ప్రాంతంలో ఎకరానికి రూ.5 లక్షల చొప్పున 5 ఎకరాలు కేటాయించాం. శంకర్ తెలంగాణ ఉద్యమంలో పెద్ద భాగస్వామి. అందుకే ఆ స్థలం కేటాయించాం. శారదాపీఠం ట్రస్టు వాళ్లు కూడా చాలా రోజుల నుంచి కోరుతున్నారు. వారికి కూడా రెండు ఎకరాలు కేటాయించాం. సంస్కృత పాఠశాల అందులో పెడుతామన్నారు. టీఆర్‌ఎస్ పార్టీ ఆఫీసుల నిర్మాణం కోసం 30 జిల్లాల్లో స్థలాలు కేటాయించడం జరిగింది. వరంగల్ రూరల్‌లో మాత్రం పెండింగ్‌లో ఉంది. అక్కడి మంత్రి, ఎమ్మెల్యే, ఇతర నాయకులు మార్పు చేద్దామంటున్నారు. ఖమ్మంలో కట్టడం పూర్తయింది. సిటీలో ఒకటి పెండింగ్‌లో ఉంది. స్థలాలు వెతుకుతున్నారు.

త్వరలోనే మున్సిపల్ ఎన్నికలు..
మున్సిపల్ ఎన్నికలు కూడా వీలైనంత త్వరగా జరుపాలని నిర్ణయించాం. అదొక్కటే ఎన్నిక మిగిలి ఉన్నది. సహకార ఎన్నికల పరిధి చిన్నది. మున్సిపల్ మిగిలాయి. టర్మ్ జూలైతో ముగుస్తున్నది. కొత్త మున్సిపాలిటీలు వచ్చాయి. నూతన మున్సిపల్ చట్టం కూడా తేవాలని ఆలోచిస్తున్నం. చట్టం చేయాలా, లేక ఆర్డినెన్స్ రూపంలో తేవాల్నా అని ఆలోచిస్తున్నం. వెంటనే బీసీ తదితర రిజర్వేషన్లు పూర్తిచేయలని మున్సిపల్ శాఖను ఆదేశించాను. ఒకసారి నోటిఫై అయిపోతే ఎన్నికలు జరుపుకోవచ్చు. కొద్ది రోజుల్లోనే రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తిచేసి, జూలైలోనే ఎన్నికలు ముగించే ప్రయత్నం చేస్తాం.

తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు
కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం గవర్నర్ నరసింహన్ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇరు రాష్ట్రాల సీఎంలు ముఖ్య అతిథులుగా వస్తున్నారు. వారితోపాటు కొందరు మంత్రులు వస్తున్నారు. మంత్రి ఈటల రాజేందర్ మేడిగడ్డ, కన్నెపల్లి ప్రాంతంలో జరిగే కార్యక్రమాలు సమన్వయపరుస్తారు. మొత్తం 5 స్టేషన్లు ఉన్నాయి. ప్రతిచోటా ఒకరు ఉండేలా ఐదుగురు మంత్రులను పెట్టాం. వారు టెంకాయ కొట్టి పూజలుచేస్తారు. ప్రధాన బరాజ్ మేడిగడ్డవద్ద హోమం చేస్తున్నాం. గతంలో ఇక్కడే శంకుస్థాపన చేసింది. భగవంతుడి పేరు పెట్టుకొని చేశాం కాబట్టి నిరాటంకంగా జరిగింది. మొదటి పంప్‌హౌస్ అయిన కన్నెపల్లి దగ్గర పూజచేస్తాం. అనంతరం లంచ్‌చేసి, అతిథులను సత్కరిస్తాం. ఉదయం 8 గంటలకు హోమం ప్రారంభమై పదిన్నరవరకు ముగుస్తుంది. తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు. ప్రాజెక్టు పూర్తవటం సంతోషకరం. దుష్టశక్తులు, దుష్టపన్నాగాలను లెక్కచేయకుండా ధైర్యంగా పనిచేశాం. ఇందులో గొప్ప కార్యక్రమం ఏమిటంటే ఒక 20 బ్యాంకులు కన్సార్టియం పెట్టి మనకు సాయం చేశాయి.

వాళ్లందరినీ పిలిచాం. నాలుగు హెలికాప్టర్లు ప్రభు త్వం తరుపున ఏర్పాటుచేస్తున్నాం. ఏపీ సీఎం వాళ్ల హెలికాప్టర్‌లోనే వస్తారు. మనం ఏర్పాటుచేసిన నాలుగింటిలో ఒకటి మహారాష్ట్ర సీఎంకు, గవర్నర్, బ్యాంకర్లకు, మనకు వినియోగిస్తున్నాం. ముందు జాగ్రత్తకోసం ఆరు హెలిపాడ్లు ఏర్పాటు చేశాం. కొన్ని పార్టీల వాళ్లు అవాకులు చెవాకులు మాట్లాడుతున్నరు. వాళ్లు కట్టినోళ్లు కాదు చేసినోళ్లుకాదు. పిచ్చి పిచ్చి మాట్లాడుతరు. నాయకులు అని అనుకునేటోళ్లకు విజ్ఞత ఉండాలి. పొరుగు రాష్ట్రాల సహకారంతో అద్భుతమైన ప్రాజెక్టు నిర్మాణం జరిపి ప్రారంభిస్తుంటే దానికి కూడా పిచ్చి మాటలు మాట్లాడుతరు. వాటిని మేం పరిశీలనలో కూడా తీసుకోం. ఒకాయనైతే మసిబూసి మారేడుకాయ చేసేందుకు ప్రయత్నిస్తున్నం అంటడు. ఆయన ఎన్నడైనా ప్రభుత్వంలో పనిచేశాడో లేదో. అంత అసహనం పనికిరాదు. ప్రజలు ఎక్కడ ఎవరికి అధికారం ఇవ్వాలో ఇస్తరు. టీఆర్‌ఎస్‌కు పాలించమని సంపూర్ణ మెజార్టీతో అధికారం ఇచ్చారు. మేము అలాగే చేస్తం. భవిష్యత్‌లో ప్రజలే తీర్పు చెప్తారు.

సొంత నిధులతో కట్టాం
గొప్ప విషయం ఏమిటంటే ప్రాజెక్టుకు కేంద్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. మొత్తం సెల్ఫ్ ఫండింగ్. సొంత నిధులు మనవి. బ్యాంకులు ఇతర మార్గాలద్వారా సేకరించాం. ఒక కొత్త రాష్ట్రం ఇంత పెద్ద మొత్తంలో నిధులు సేకరించడం మామూలు విషయం కాదు. ఎందుకంటే లక్షా 90 ప్రశ్నలు అడుగుతారు. కమర్షియల్ బ్యాంకులు అంత సులువుగా డబ్బు ఇవ్వవు. బోర్డులో నిర్ణయించి ఇస్తారు. వాళ్లను అందుకే ఒకరోజు ముందు ఆహ్వానించాం. ఖర్చు ఎలా జరిగిందో వాళ్లు కూడా చూస్తారు. సాధారణంగా పదేండ్లలో కూడా కట్టలేని.. 17 సబ్‌స్టేషన్లు కట్టాం. భారీ ఎత్తున జరిగిన ప్రణాళిక ఇది. ప్రాజెక్టు ఒక రోల్ మోడల్ కాబోతున్నది.

బిందెల ప్రదర్శన.. బంద్ అయ్యింది..
విద్యుత్ బాగు చేస్తాం అన్నం, చేశాం. అన్ని సెక్టార్‌లకు నాణ్యమైన 24 గంటల విద్యుత్ సరఫరా చేసే ఏకైక రాష్ట్రం తెలంగాణ. మంచి నీటి సమస్య లేదు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు బిందెల ప్రదర్శన బంద్ అయ్యిందని చెప్పాను. అది నిజం సమస్య ఎక్కడా లేదు. ప్రతిపక్షాలకు నచ్చకపోవచ్చు. వాళ్ల ఖర్మ నేనేం చేయలేను. జూలై చివరి వరకు వంద శాతం పూర్తవుతుంది. సీతారామ దేవాదుల కూడా కంప్లీట్ అవుతున్నది. ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ వరకే పూర్తి చేసే ఆలోచన చేస్తున్నాం. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని పరుగులు పెట్టిస్తం. తప్పకుండా కోటి పై చిలుకు ఎకరాలకు ఇరిగేషన్ మిషన్‌ను పూర్తి చేస్తం.

మోదీని మొదట విమర్శించింది నేనే ఎన్డీఏలో మేం భాగం కాదు. నేను ఫెడరల్ ఫ్రంట్‌ను ప్రతిపాదించాను. ఇప్పటికీ నేను కట్టుబడి ఉన్నాను. ఇందులో తప్పేముంది? రాష్ట్రం కేంద్రం మధ్య రాజ్యాంగపరమైన సంబంధాలు ఏ విధంగా కొనసాగుతాయో కొనిసాగిస్తాం. అక్కడ ప్రజలు మోదీగారికి అవకాశమిచ్చారు. ఆయన చేయాల్సింది ఆయనచేస్తారు..ఇక్కడ మాకు అవకాశమిచ్చారు. మేం చేయాల్సింది మేం చేస్తాం. దీనిపై పెద్ద కల్పనలెందుకు? మోదీ గారు ప్రధాని అయిన తర్వాత అతికఠినంగా నిందించిన వ్యక్తిని నేను. మీరు మర్చిపోతే.. నేను మర్చిపోతానా? ఏడు మండలాలు గుంజుకున్నపుడు ఆయన ఫాసిస్టు ప్రధానమంత్రి అన్నాను. ఇది రికార్డుల్లో ఉన్నది. రాష్ట్రపతి ఎన్నికను సమర్థించాం. అంశాల వారీగా ఇష్టమైన చోట, నచ్చినచోట మద్దతిచ్చాం. నచ్చనిచోట వ్యతిరేకించాం. ఇప్పుడు సైతం అదే సంబంధాలు కొనసాగుతాయి. కేంద్ర నుంచి ఒక్క రూపాయి రాష్ర్టానికి అదనంగా రాలేదు. ఇదే విషయంలో అమిత్‌షా తప్పుడు లెక్కలు చెపితే.. క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాను. ప్రతి రూపాయి రికార్డుల్లో ఉంటుంది. ప్రతి రూపాయిలెక్క కేంద్రం దగ్గర ఉంటుంది. రాష్ట్రం దగ్గర ఉంటుంది. కాగ్ ద్వారా ఆడిట్ ఉంటుంది.

నీతి ఆయోగ్ మిషన్ భగీరథకు, మిషన్ కాకతీయకు కలిపి 24,000 కోట్లు ఇవ్వాలని చెపితే. 24 రూపాయలు సైతం ఇవ్వలేదు. విభజనచట్టం ప్రకారం బీఆర్జీఎఫ్ రూ.450 కోట్లు ఇవ్వాల్సింది ఇవ్వలేదు. నాలుగేండ్లు ఇచ్చి ఓ ఏడాది ఇవ్వలేదు. ఇది రికార్డుల్లో ఉంది. రుణమాఫీ సహా ఇతరత్రమైనవి మాకు మేం చేసుకోగలం. మాకు వర్రీ లేదు. రాజ్యాంగబద్ధంగా మా డిమాండ్లు ముందుంచుతాం. ఇస్తే సంతోషంగా స్వీకరిస్తాం. ఇవ్వకపోతే ముందుకు సాగుతాం. నీటి వివాదాల విషయంలో రెండు పార్టీలు వైఫల్యం చెందాయనే విషయాన్ని నేను ప్రస్తావించాను. 2004లో ఏర్పాటైన బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ ఇప్పటికీ 15 సంవత్సరాలు గడిచాయి.. హరి లేదు..శివ లేదు. ట్రిబ్యునల్ తీర్పుకే 15 ఏండ్లు…రెండు దశాబ్దాలు అయితే…తీర్పు ఎప్పుడు రావాలి? ప్రాజెక్టు ఎప్పుడు కట్టాలి? ఏపీ సీఎంకు అదే చెప్పాను. ఢిల్లీ వద్దు.. ఎవరినీ అడిగే అవసరం వద్దు. ట్రిబ్యునళ్లు లేవు.. కోర్టులు లేవు. మనిద్దరం ఒక మాట అనుకుంటే పరిష్కారమవుతుంది. ప్రాజెక్టులు మొదలుపెట్టుకోవచ్చు అని చెప్పాను. దాన్ని వారు సంతోషంగా స్వాగతించారు. మహారాష్ట్ర సీఎం ఓ అడుగు ముందుకు వేసి ఓ మాట అన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రి మా పార్టీకి చెందినవారే. రాష్ర్టాలమధ్య ఉన్న వివిధ తగాదాలను ఆయన తెంపుతలేడు. దీంతోటి నేను తెలంగాణకుపోయి నేర్చుకో అని చెప్పాను. తెలంగాణ సీఎం వేరే పార్టీ అతను అయినప్పటికీ సామరస్యపూర్వకంగా చేసుకున్నాను అని చెప్పారు.

ఇది మా రికార్డు. తెలంగాణ ప్రాజెక్టుల నిర్మాణంలో అహోరాత్రులు నేనే పనిచేశాను. అడుగడుగునా నాకు తెలుసు నేనేం చేశానో. ఇప్పుడు కూడా చేస్తాను. ఎవరికైనా అనుమానాలుంటే..మేమేం చేయాలి? ఏం తెలియని సన్నాసులు ఉంటరు వాళ్లకు ఏం చెప్తం? తెలియక పిచ్చిమాటలు.. చేసిన మొకాలు కావు.. తెలియదు. కాళేశ్వరంలో మనం తీసుకుంటున్నది 90 మీటర్ల బెడ్‌లెవల్. తొలి దశ లిఫ్ట్ ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వస్తయి. 148 మీటర్లు అది. 90 నుంచి 148 తీసుకోవడంతో 75 టీఎంసీల నీళ్లు వినియోగంలోకి వస్తునాయి. గూడెం లిఫ్ట్, ఎన్టీపీసీ, నూతనంగా వచ్చిన ఎఫ్సీఐ, హైదరాబాద్ నగరానికి ఇచ్చే పది టీఎంసీలు కావచ్చు ఇవంతా ఎల్లంపల్లి నుంచి వస్తాయి. రెండోదశలో 148- 318 మీటర్ల వరకు రావడంతో మిడ్, లోయర్ మానేరు, ఎస్సారెస్పీ, గౌడవెల్లి, సిరిసిల్ల మలక్‌పేట్ ఇవన్నీ కలుపుకొని 25 లక్షల ఎకరాలు పారుతుంది. 100 మీటర్ల నుంచి 600 మీటర్లు అనుకుంటున్నరు. ఇది నేరుగా కాదు. దశలు. ప్రాధాన్యతలు మారుతాయి. తెలంగాణ రాష్ర్టానికి ప్రకృతి, దేవుడు నీళ్లు అక్కడ ఇచ్చారు. కాబట్టి నీటిని లిఫ్ట్ చేయాల్సిందే. భగీరథ వందశాతం లిఫ్టే. ఇది విజయవంతమయింది. ప్రగతిభవన్ వద్ద కొందరు పనికిమాలిన వాళ్ల ధర్నాలు అవసరం లేదు. రాజకీయ ప్రయోజనాల కోసం ధర్నాలు ఉంటాయి. టీఆర్టీ సమస్య పరిష్కారమయింది. అపాయింట్‌మెంట్ ఆర్డర్ అయింది. ఆయనెవరో పది మందిని తీసుకువస్తా అంటే ఎలా? సమస్య ఉంటే పరిష్కరించాల్సింది మేం. ఐదేండ్లు ఉంటాం. పరిష్కరిస్తాం అని గతంలో కూడా చెప్పాం. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి వ్యాఖ్యలు తగునా? రాష్ట్రంలో నేరాలు తగ్గాయనే విషయాన్ని సాక్షాత్తు కేంద్ర హోంశాఖ చెప్తుంటే ఉగ్రవాద అడ్డా అని బాధ్యతగల వ్యక్తులు మాట్లాడచ్చా? జనం నవ్వుకుంటున్నారు. ఐదేండ్లలో టెర్రరిస్ట్ దాడులు లేవు. వేరే రాష్ర్టాల వలే ఇబ్బందులు లేవు. రాష్ట్రంలో అంతా ప్రశాంతంగా ఉన్నది. దేశంలో ఏ రాష్ట్రం ఇట్ల లేని సమయంలో ఇలాంటి వ్యాఖ్యలను చూసి జనాలు నవ్వుకుంటున్నారు. అని సీఎం కేసీఆర్ అన్నారు.

పంచాయతీ వ్యవస్థ పటిష్ఠం
కొత్త పంచాయతీరాజ్ చట్టాన్ని పటిష్ఠంగా అమలుచేస్తం. పంచాయతీరాజ్ వ్యవస్థకు ఏ అధికారాలు అప్పగించాలో క్యాబినెట్‌లో చర్చించాం. కొత్తగా యువకులు, చదువుకున్నవారు, ఉత్సాహవంతులు ఎందరో స్థానిక సంస్థల్లో గెలిచారు. ఇప్పుడు పంచాయతీరాజ్ వ్యవస్థను క్రియాశీలం చేయాలనుకొంటున్నాం.. హరితహారం, నరేగావంటి పథకాలతోపాటు వాళ్లకు ఇంకేం అప్పగించవచ్చనేవి ఆలోచించాం. ఇవ్వాల్సిన అధికారాలు ఇచ్చి, అవసరమైన నిధులను ఇచ్చి క్రియాశీలంగా పనిచేయించాలని క్యాబినెట్‌లో సూత్రప్రాయంగా చర్చ జరిగింది. రాబోయే కొద్దిరోజుల్లో మరోసారి చర్చించి, కమిటీ వేసుకొని అమల్లోకి తెస్తం.

ఉద్యోగులకు ప్యాకేజీ
ఇంతకాలం ఎన్నికల కోడ్ ఉన్నది. ఉద్యోగులు ఎదురుచూస్తున్నరు. తప్పకుండా వాళ్లకు చేయాల్సి ఉంటుంది. కొద్దిరోజుల్లోనే మరొక సమావేశం పెడతాం. ఎన్నికల సందర్భంలో వాగ్దానం చేశాం. 61 ఏండ్లకు రిటైర్‌మెంట్ వయసు పెంచుతామన్నం. టీఆర్‌ఎస్ వాగ్దానంచేస్తే ఖచ్చితంగా నెరవేర్చుతుంది. అందరికీ ఆ విషయం తెలుసు. ఎప్పట్నుంచి పెంచాలి, ఎలా పెంచాలని ఆలోచిస్తాం. ఉద్యోగ సంఘాలతో కూడా చర్చలు జరుపుతం. పీఆర్సీ కొంత పెంచుతం, రిటైర్మెంట్ ఏజ్ పెంచుతం. మొత్తం కలిపి ప్యాకేజీ ఇవ్వాలని అనుకుంటున్నం. ఆర్థిక పరిమితులను కూడా వాళ్లకు విడమర్చి చెప్పి సామరస్యపూర్వకమైన ధోరణితో పోవాలన్న ఆలోచనతో ఉన్నం.

సీఎం ప్రకటనపై ఉద్యోగసంఘాల విశ్వాసం
-మంత్రివర్గంలో సానుకూల నిర్ణయంపై నేతల హర్షం రాష్ట్రంలో ఉద్యోగుల సమస్యలు, డిమాండ్లను సానుకూల దృక్పథంతో పరిశీలించి అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించడంపై పలు ఉద్యోగసంఘాల నాయకులు హర్షం వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రిపై మొదట్నుంచీ అపార నమ్మకం ఉన్నదని తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ సెక్రటరీ జనరల్ మమత పేర్కొన్నారు. తాము ముందుగా భావించినట్టే మంత్రివర్గ సమావేశంలో ఉద్యోగుల సమస్యలను ప్రత్యేకంగా చర్చించడం హర్షణీయమన్నారు. ఉద్యోగుల సమస్యలపై సంపూర్ణ అవగాహన ఉన్న సీఎం కేసీఆర్ త్వరలో సానుకూల ప్రకటన చేస్తారని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టంచేశారు.

ఉద్యోగుల సమస్యలపై పూర్తి అవగాహన
తెలంగాణ ఉద్యమ రథసారథిగా ప్రజలతో మమేకమై, ఉద్యోగులతో కలిసి పోరాడిన ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తమకు పూర్తి విశ్వాసం ఉన్నదని తెలంగాణ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పద్మాచారి, ప్రధానకార్యదర్శి పవన్‌కుమార్ చెప్పారు. ఉద్యోగుల సమస్యలపై పూర్తి అవగాహన ఉన్న సీఎం కేసీఆర్.. ఐఆర్, పీఆర్సీ పెంపు తదితర సమస్యలపై సానుకూల నిర్ణయం తీసుకుంటారనే నమ్మకం ఉన్నది కాబట్టే రాష్ట్రంలో ఉద్యోగులు ఎక్కడా ఆందోళనలకు దిగలేదని స్పష్టంచేశారు. రాష్ట్ర వాణిజ్యపన్నుల ఉద్యోగుల సంఘం గౌరవాధ్యక్షుడు టీ వెంకటేశ్వర్లు, అధ్యక్షుడు కేఎం వేణుగోపాల్, ప్రధాన కార్యదర్శి స్వర్ణకుమార్, రాష్ట్ర గెజిటెడ్ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి ఏ సత్యనారాయణ, కార్యదర్శి గోన విష్ణువర్ధన్‌రావు, తెలంగాణ ప్రభుత్వఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముద్దసాని వెంకటరమణారెడ్డి, ప్రధాన కార్యదర్శి వీరాచారి హర్షం వ్యక్తంచేశారు.

నేడు టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం
టీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణభవన్‌లో జరుగనున్నది. ఇటీవల ముగిసిన పార్లమెంట్, పరిషత్ ఎన్నికల ఫలితాలపై, త్వరలో జరుగనున్న మున్సిపల్ ఎన్నికలకు పార్టీ యంత్రాంగాన్ని సమాయత్తం చేసే అంశంపై సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నది. పార్టీ భవిష్యత్ కార్యాచరణపైనా చర్చిస్తారని సమాచారం. పార్టీ నూతన కార్యాలయాల నిర్మాణాలు, పార్టీ సభ్యత్వ నమోదు తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉన్నదని తెలిసింది.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.