Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

వైద్య వసతుల్లోనూ ముందంజ

పేద దేశాల నుంచి సంపన్న దేశాల వరకు ప్రజలు.. ప్రభుత్వాల నుంచి కోరే గ్లోబల్‌ డిమాండ్‌ నాణ్యమైన విద్య, వైద్యం. తెలంగాణ రాష్ట్రంలో వైద్యపరంగా తెలంగాణ రాకముందు, వర్తమానం, భవిష్యత్తుగా విభజించవచ్చు. వైద్యానికి ఒకప్పుడు హైదరాబాద్‌ కేంద్ర బిందువుగా ఉండేది. స్వాతంత్య్రానికి ముందు దేశంలోనే అత్యుత్తమ వైద్యసంస్థలుండేవి. ఉస్మానియా, యునాని, టి.బి., మెంటల్‌ హాస్పిటల్‌, జడ్జిఖానా, నిలోఫర్‌, నిజాం బొక్కల హాస్పిటల్‌, ఫీవర్‌ హాస్పిటల్‌.. ఇలా ఎన్నో. ప్రపంచంలో మొదటి అనెస్తీషియా క్లోరోఫామ్‌ ఉస్మానియాలోనే ఇచ్చారు. అలానే మలేరియాకు కారణమైన క్రిమిని కూడా ఇక్కడే కనుక్కున్నారు. కానీ ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ వైద్యం దిగజారిపోయింది. ‘నేను రాను బిడో సర్కారు దవాఖానకు’ అనే పాట అప్పటి ప్రభుత్వ వైద్యసంస్థల పరిస్థితికి అద్దం పట్టింది.

కొత్త రాష్ట్రంలో అనేక ఒడిదుడుకులున్నప్పటికీ ఇతర రాష్ర్టాల కంటే గణనీయమైన మార్పు తేగలిగాం. గత ఆరేండ్లలో అటు నీటిపారుదలరంగం, వ్యవసాయం, మౌలిక సదుపాయాలు, సంక్షేమ రంగానికి అత్యధిక నిధుల కేటాయింపు వల్ల ఇంకా చేయాల్సిన కొన్ని పనులు ముందున్నాయి. ముఖ్యంగా జిల్లా కేంద్రాల్లో సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్స్‌, నియోజకవర్గ కేంద్రాల్లో 100 పడకలు, అలాగే మండల కేంద్రాల్లో 30 పడకల హాస్పిటల్స్‌ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.

తెలంగాణ రాష్ట్రం వచ్చాక ప్రభుత్వ వైద్యరంగంలో గణనీయమైన మార్పు వచ్చిందనడానికి అనేక ఆరోగ్య సూచికలు నిదర్శనం. 60 ఏండ్ల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కేవలం ఐదు ప్రభుత్వ వైద్య కళాశాలలు ఉంటే, గత ఐదేండ్లలో ఐదు నూతనంగా ఏర్పడి, వాటి సంఖ్య పదికి చేరింది. 700 ఎంబీబీఎస్‌ సీట్లు 1650కి, 531గా ఉన్న పీజీ సీట్లు 835కి, 58గా ఉన్న సూపర్‌ స్పెషాలిటీ సీట్లు 86కు పెరిగాయి. ఇక కేసీఆర్‌ కిట్లు ప్రభుత్వ హాస్పిటల్స్‌లో ప్రసవాలు పెరగడానికి తోడ్పడ్డాయి. 8 లక్షల 60 వేల కిట్లను పంపిణీ చేశారు. ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు 30.5 శాతం నుంచి 60 శాతానికి పెరిగాయి. నూతనంగా 350 బస్తీ దవాఖానలు, 25 ఐసీయూ సెంటర్లు, 25 తెలంగాణ డయాగ్నోస్టిక్‌ సెంటర్లు ఏర్పడ్డాయి. దీర్ఘకాలిక రోగులైన డయాలసిస్‌ పేషెంట్లకు ఉచితంగా 46 నూతన డయాలసిస్‌ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. అమ్మ ఒడి పథకం కింద- గర్భిణులను, ప్రసవించిన తరువాత మాతాశిశువులను ఇంట్లో దింపడానికి కొత్తగా 241 అమ్మ ఒడి (102) వాహనాలను ఏర్పాటు చేశారు.

ఇక ప్రభుత్వ దవాఖానలలో పడకల సంఖ్య 17,130 నుంచి 23,450కి పెరిగాయి. ఆక్సిజన్‌ పడకలు 234 నుంచి 11,758కి పెరిగాయి. మెటర్నల్‌ ఐసీయూలు గతంలో అసలు లేవు. ఇప్పుడు ఐదు ఏర్పడ్డాయి. స్పెషలిటీ ట్రామా ఐసీయూలు 13; గుండె, స్టెమ్‌ సెల్‌, బోన్‌మారో లాంటి నూతన అవయవ మార్పిడి కేంద్రాలు ఏర్పడ్డాయి. ఆధునిక డెలివరీ సూట్స్‌ ఇదివరలో ఏమీలేవు. ఇప్పుడు 424 అందుబాటులోకొచ్చాయి. వైరాలజీ లాబ్‌ ఒకటే ఉండగా నుంచి ఇప్పుడు వాటి సంఖ్య 23. కొత్తగా 50 బైక్‌ అంబులెన్సులను ఏర్పాటు చేశారు. వైద్యరంగంలో కొత్తగా కల్పించిన సదుపాయాల ఫలితం మనకు వివిధ ఆరోగ్య సూచికల్లో కనిపిస్తుంది. మెటర్నల్‌ మోర్టాలిటీ రేటు (ప్రసవ సమయంలో మరణించడం) లక్షకు 92 నుంచి 63కు తగ్గింది. ఇన్‌ఫాంట్‌ మోర్టాలిటీ (శిశుమరణాలు) వెయ్యికి 39 నుంచి 26కు తగ్గాయి. ఇమ్యునైజేషన్‌ 68 నుంచి 96 శాతానికి పెరిగి దేశంలోనే మూడో స్థానంలో ఉన్నాం.

అన్నీ సాధించేశాం అనుకుంటే అతిశయోక్తి అవుతుంది. కానీ కొత్త రాష్ట్రంలో అనేక ఒడిదుడుకులున్నప్పటికీ ఇతర రాష్ర్టాల కంటే గణనీయమైన మార్పు తేగలిగాం. గత ఆరేండ్లలో అటు నీటిపారుదలరంగం, వ్యవసాయం, మౌలిక సదుపాయాలు, సంక్షేమ రంగానికి అత్యధిక నిధుల కేటాయింపు వల్ల ఇంకా చేయాల్సిన కొన్ని పనులు ముందున్నాయి. ముఖ్యంగా జిల్లా కేంద్రాల్లో సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్స్‌, నియోజకవర్గ కేంద్రాల్లో 100 పడకలు, అలాగే మండల కేంద్రాల్లో 30 పడకల హాస్పిటల్స్‌ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఉస్మానియా హాస్పిటల్స్‌ లాంటి ప్రపంచ ప్రసిద్ధ సెంటర్లను ఒక నూతన క్యాంపస్‌ నూతన హంగులతో నిర్మించాలి. అలానే జీవనశైలి జబ్బులైన క్యాన్సర్‌, బ్రెయిన్‌ స్ట్రోక్‌, కిడ్నీ, బీపీ, షుగర్‌, ట్రామా, ఐసీయూ కేర్‌ సెంటర్స్‌ మీద ప్రత్యేక శ్రద్ధ అవసరం. మిషన్‌ భగీరథ, బాలామృతం, సన్న బియ్యం, 100 శాతం వ్యాక్సినేషన్‌, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, పరిశుభ్రత వల్ల ఇప్పటికే అనేక సీజనల్‌ వ్యాధులు తగ్గాయి. ముఖ్యంగా కాలుష్యం కనిపించని ప్రమాదకారి. శ్వాసకోశ, ఇతర జబ్బులకు ప్రధాన కారణం. హరితహారం, కాలుష్య నియంత్రణ, ఫార్మా సిటీ లాంటి ప్రాజెక్టులు భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలను తగ్గించడానికి దోహదపడుతాయి.

డిజిటల్‌ హెల్త్‌కేర్‌కు పెద్ద పీట వేయాల్సిన అవసరం ఉంది. ఆధార్‌ కార్డు, పాన్‌ కార్డుల్లాగా ప్రతి వ్యక్తికీ జననం నుంచి మరణం వరకు ఆరోగ్య డేటాతో కూడిన ఎలక్ట్రానిక్‌ హెల్త్‌ కార్డును జారీ చేయాలి. తెలంగాణ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు, ఐఏఎస్‌ మాదిరి- తెలంగాణ హెల్త్‌ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీసెస్‌ వంటివి హాస్పిటల్‌ నిర్వహణలో ఉపయోగపడుతాయి. అలానే మెడికల్‌ అక్రెడిటేషన్‌ యూనిట్‌, ఫార్మా డెలివరీ అండ్‌ కంట్రోల్‌ యూనిట్‌ అవసరం. మెడికల్‌ ఆడిట్‌ తప్పనిసరి. ప్రభుత్వం ఎంత ఖర్చు పెడుతున్నది, సిబ్బంది ఎంత, ఎంతమందికి సేవలందిస్తున్నామనే అంశం చాలా కీలకమైనది. మెడికల్‌ రెఫరల్‌ సిస్టమ్‌, సూపర్‌ స్పెషలిటీ ఆన్‌లైన్‌ అపాయింట్‌మెంట్‌ వల్ల రద్దీ చాలావరకు తగ్గుతుంది. వీడియో కన్సల్టేషన్‌ వల్ల అటు సమయం, ఇటు డబ్బు ఆదా అవుతాయి. ప్రస్తుతం ఉన్న హెల్త్‌ మోడల్స్‌లో అతి తక్కువ ఖర్చుతో అత్యధిక ఫలితాలు ఇస్తున్న థాయ్‌లాండ్‌ హెల్త్‌ సిస్టం గురించి అధ్యయనం చేయాలి.

మౌలిక సదుపాయాలను ఎంతగా కల్పించినప్పటికీ పరిపాలనలో సంస్కరణలు లేకుండా వాటి ఫలితాలు పూర్తి స్థాయి లో అందుబాటులోకి రావు. ప్రభుత్వ సంస్థల్లో పని సంస్కృతి (వర్క్‌ కల్చర్‌) పెంచడానికి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. తగిన వాతావరణం పెంపొందేలా అన్ని విధాలా ప్రోత్సహించాలి. అవసరమైతే అన్ని వైద్య కళాశాలలు, సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్స్‌లో యూజీసీ స్కేల్స్‌ ఇచ్చి, డాక్టర్లు, ఇతర పారామెడికల్‌ సిబ్బందికి పారితోషికాలిచ్చి, నాన్‌ ప్రాక్టీసింగ్‌ చేయడం వల్ల పనిలో మరింత మెరుగైన ఫలితాలు వస్తాయి. అలాగే హాస్పిటల్స్‌ క్యాంపస్‌లో వసతిగృహాలు ఏర్పాటు చేయడం వల్ల సత్ఫలితాలుంటాయి. ప్రభుత్వ వైద్యశాలలో తక్కువ ఖర్చుతో కార్పొరేట్‌ స్థాయి సేవలు అందించగలిగితే ప్రజలు బ్రహ్మరథం పడుతారు. అంతిమంగా ఒక పేషెంట్‌ హాస్పిటల్‌కు వచ్చినప్పుడు సిబ్బంది ఒక చిరునవ్వుతో పలకరించడం, భరోసాగా భుజం తట్టడం, ధైర్యం చెప్పి మాట్లాడటం, పరిసరాలను శుభ్రంగా ఉంచడం, కాలం విలువ పాటించి సమయానికి సేవలందించడం చేస్తే ప్రభుత్వ వైద్యశాలలు ప్రజలకు ఆత్మబంధువులుగా నిలుస్తాయి. వీటికి ఒక్క రూపాయి కూడా ఖర్చు కాదు. అందుకే కరెన్సీతో పాటు కల్చర్‌ కూడా అవసరం.

(వ్యాసకర్త: మాజీ ఎంపీ, భువనగిరి)
డాక్టర్‌ బూర నర్సయ్యగౌడ్‌

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.