Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

వైవిధ్యం.. వినూత్నం

-కొత్త పంథాలో టీఆర్‌ఎస్ ఎన్నికల ప్రచారశైలి
-అన్ని వర్గాల ప్రతినిధులతో మంత్రి కేటీఆర్ భేటీలు
-సోషల్‌మీడియాలో గులాబీ శ్రేణుల దూకుడు
-ప్రజల్లో టీఆర్‌ఎస్‌పై మరింత పెరుగుతున్న ఆదరణ

రాష్ట్ర అభివృద్ధి.. ప్రజా సంక్షేమంలో నాలుగున్నరేండ్లలోనే తనదైన ముద్ర వేసిన టీఆర్‌ఎస్ పార్టీ.. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో వైవిధ్యాన్ని ప్రదర్శిస్తున్నది. వినూత్న శైలితో దూసుకెళ్తున్నది. సాధారణ ప్రజలతో మమేకం అవడంతోపాటు.. వివిధ రంగాల నిపుణులు, వృత్తి నిపుణులు, వ్యాపారులు, ఇతర వర్గాలతో మమేకం అవుతున్నారు. ముఖ్యంగా ఆన్‌లైన్, సోషల్ మీడియాలో టీఆర్‌ఎస్ ప్రచారానికి పెద్ద ఎత్తున స్పందన వస్తున్నది. వినూత్న ప్రచారంలో భాగంగా ఐటీ, మున్సిపల్‌శాఖల మంత్రి కే తారకరామారావు వివిధ వర్గాలతో సమావేశం అవుతున్నారు. ఆన్‌లైన్ , సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ప్రజలు రద్దీగా ఉండే కూడళ్లలో భారీ ఎల్‌ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేసి ప్రభుత్వం చేపట్టిన పథకాలను వివరిస్తున్నారు. నెలకుర్తి శ్రీనివాస్‌రెడ్డి, హైదరాబాద్, నమస్తే తెలంగాణ:

ఆన్‌లైన్ ప్రచారంలో కేటీఆర్ జోరు సోషల్‌మీడియా కేవలం ప్రచార మాధ్యమం కాదని.. ప్రజలకు చేరువగా ఉంటూ.. వారికి సేవ చేసే ఆధునిక మార్గమని మంత్రి కేటీఆర్ ఇప్పటికే నిరూపించారు. ఆయన ఫేస్‌బుక్, ట్విట్టర్ ఖాతాను అనుసరించేవారు లక్షల్లో ఉన్నారు. ఎంతోమంది తమ, తోటివారి సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. సోషల్‌మీడియా ద్వారా వచ్చిన సమస్యలపై కేటీఆర్ తక్షణం స్పందిస్తున్నారు. ఈ ఎన్నికల నేపథ్యంలో మంత్రి కేటీఆర్ ఆన్‌లైన్‌లో ప్రచారం నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ట్విట్టర్ ద్వారా ఈ నెల 4న ఆస్క్ కేటీఆర్ పేరుతో లైవ్‌లో అందుబాటులోకి వచ్చారు. ప్రజల అభిప్రాయాలను తెలుసుకొని, అనుమానాలను నివృత్తి చేశారు. ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. త్వరలో మళ్లీ లైవ్ కార్యక్రమం నిర్వహించాలని భావిస్తున్నారు.వివిధ వర్గాలతో వరుస సమావేశాలు మంత్రి కేటీఆర్ ఇప్పటికే వ్యాపార వర్గాలతో సమావేశం అయ్యారు. ఆదివారం ఆయుష్ డాక్టర్లతో సమావేశం నిర్వహించారు. రాబోయే ఎన్నికల్లో విద్యార్థి శక్తిని సమర్థవంతంగా వినియోగించుకుకోవాలనే లక్ష్యంతో.. టీఆర్‌ఎస్ అనుబంధ విద్యార్థి విభాగం టీఆర్‌ఎస్వీ నాయకులతో ఇటీవలే భేటీ అయ్యారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై వారికి దిశానిర్దేశం చేశారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉంటేనే విద్యార్థులకు బంగారు భవిష్యత్ ఉంటుందనే విషయాన్ని మరోసారి స్పష్టం చేశారు.

టీఆర్‌ఎస్‌వైపే ఆర్యవైశ్యులు గతంలో వ్యాపార వర్గాలు ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండేవారు. తెర వెనుక నుంచే రాజకీయాలను నడిపించే వారు. కానీ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో జరుగుతున్న పనులు, అభివృద్ధి, ఆయన విజన్‌ను చూసి.. వ్యాపార వర్గాలుగా గుర్తింపుపొందిన ఆర్యవైశ్యులు పెద్దఎత్తున టీఆర్‌ఎస్‌లో చేరారు. ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనడానికి ముందుకొస్తున్నారు. మరో రెండు దశాబ్దాల పాటు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండాలంటూ బహిరంగంగానే ప్రకటించారు. రాబోయే రోజుల్లో ఐటీ వర్గాలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, రాజకీయాలకు దూరంగా ఉండి సమాజసేవలో చురుగ్గా పాల్గొంటున్న ఇతర వర్గాలతోనూ భేటీ అయ్యేందుకు కేటీఆర్ ప్రణాళికలు రచిస్తున్నారు. పార్టీకి సంబంధించిన మహిళలు, ప్రత్యక్ష రాజకీయాల్లో లేని మహిళలతో కూడా సమావేశం కానున్నారు.

కార్మికులతో కలయిక కార్మిక విభాగం నేతలతోనూ మంత్రి కేటీఆర్ త్వరలో భేటీ కానున్నారు. టీఆర్‌ఎస్ కార్మిక విభాగానికి పెద్ద ఎత్తున అనుబంధ సంఘాలు ఉన్నాయి. ప్రతి శాఖలోనూ కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు కార్మికులు, అధికారుల సంఘాలు ఉన్నాయి. వారందరితో సమావేశమయ్యేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. కార్మికులు, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్‌ఎస్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకున్నది. గతంలో వేతనాలు పెరుగాలంటే పెద్ద ఎత్తున ధర్నాలు, ఆందోళనలు, నిరసనలు, వినతి పత్రాలు, చలో అసెంబ్లీ, చలో హైదరాబాద్ వంటివి నిర్వహించేవారు. టీఆర్‌ఎస్ పాలనలో వీటన్నింటికీ తావులేదు. ఉద్యోగులను ప్రగతి భవన్‌కు స్వయంగా పిలిపించి వేతనాలు పెంచిన చరిత్ర సీఎం కేసీఆర్‌ది. టీఆర్‌ఎస్ ప్రభుత్వం చిన్న ఉద్యోగుల వేతనాలను మానవీయ కోణంలో పెంచింది. గత నాలుగున్నరేండ్లలో అంగన్‌వాడీ టీచర్లకు రెండుసార్లు వేతనాలు పెంచారు. హోంగార్డులకు వరాల జల్లు కురిపించారు. ఉద్యోగులకు 43 శాతం పీఆర్సీ, విద్యుత్ ఉద్యోగులకు 35 శాతం పీఆర్సీని ప్రకటించారు. దీంతో ఉద్యోగ, కార్మిక సంఘాల్లో ఆదరణ పెద్ద ఎత్తున పెరిగింది. ఈ నేపథ్యంలో మరోసారి వేతనాలు, ఇతర సమస్యలు పరిష్కారం కావాలంటే కేసీఆర్‌ను మరోసారి సీఎంను చేయాలని ఉద్యోగ, కార్మిక సంఘాలను మంత్రి కేటీఆర్ కోరుతున్నారు. ఇలా విభిన్నంగా.. ముమ్మరంగా సాగుతున్న టీఆర్‌ఎస్ ప్రచారం ప్రతిపక్షాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నది.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.