రాష్ట్రంలోని రోడ్లకు, చెరువులకు మహర్దశ పట్టనుంది. ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్ పరిధిలోని రోడ్లన్నీ నూటికి నూరుశాతం బాగుపడాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు.

-పంచాయతీరాజ్ పరిధిలో 38,500 కి.మీ.. -ఆర్‌అండ్‌బీ పరిధిలో 10వేల కి.మీ.. -రహదారుల మరమ్మతులకు సీఎం ఆదేశం -యుద్ధ ప్రాతిపదికన పనులు.. మే నెలాఖరుకు పూర్తి -వరంగల్, కరీంనగర్ చుట్టూ రింగ్ రోడ్లు -ఖమ్మం, నిజామాబాద్, గజ్వేల్‌లకు కూడా.. -నిజామాబాద్-డిచ్‌పల్లి, ఖమ్మం-సూర్యాపేటకు ఫోర్‌లేన్ -రహదారులపై సమీక్షలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు
రోడ్ల నిర్మాణం, మరమ్మతులు, అభివృద్ధి, విస్తరణతోపాటు చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాలన్నీ డిసెంబర్ మొదటి వారంలో ప్రారంభించి వచ్చే ఏడాది మే నెలాఖరుకు పూర్తి చేయాలని సీఎం సూచించారు. పనులు ఎట్టి పరిస్థితుల్లోనూ జాప్యం కాకూడదని, త్వరితగతిన పూర్తి కావాలని చెప్పారు. మంత్రివర్గ ఉపసంఘం, ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌శాఖ అధికారులతో ముఖ్యమంత్రి సచివాలయంలో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి డాక్టర్ టీ రాజయ్య, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, కేటీ రామారావు, పోచారం శ్రీనివాసరెడ్డి, టీ హరీశ్‌రావు, ఈటెల రాజేందర్, జగదీశ్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి. జోగు రామన్న, ఎంపీ బాల్క సుమన్ ఈ సమీక్షలో పాల్గొన్నారు. పనులను పర్యవేక్షించడానికి అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత మంత్రులంతా జిల్లాల్లో పర్యటించాలని ఆదేశించారు. తాను కూడా వచ్చే నెల నుంచి హెలికాప్టర్ ద్వారా రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తానని చెప్పారు. రహదారుల పనులు పెద్ద ఎత్తున చేపట్టనున్నందున ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని సూచించారు. తక్షణ అవసరంకోసం పదవీ విరమణ పొందిన ఉద్యోగులను కాంట్రాక్టు పద్ధతిలో తీసుకోవాలని చెప్పారు. పనులు వేగంగా పూర్తి కావడానికి, నాణ్యతా ప్రమాణాలు పర్యవేక్షించడానికి ఇంజినీర్లు విస్తృతంగా పర్యటించాలని ఆదేశించారు. డీఈ స్థాయివరకు వాహనసౌకర్యం కల్పిస్తామని, ఏఈ అంతకన్నా కిందిస్థాయి అధికారులకు ఎఫ్‌టీఏ మంజూరు చేస్తామని అన్నారు. అదేవిధంగా ఇప్పటివరకు రెండు శాఖల్లో ఉన్న పెండింగ్ బిల్లులను తక్షణమే చెల్లించాలని ఆదేశించారు. రహదారుల నిర్మాణంలో నిర్లక్ష్యానికి గురైన నియోజకవర్గాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ప్రతీ జిల్లా కేంద్రంనుంచి హైదరాబాద్‌కు నాలుగు లైన్ల రోడ్లు, మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు రెండు లైన్ల రోడ్లు ఉండి తీరాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
పంచాయతీరాజ్ పరిధిలోని 38,500 కిలోమీటర్ల రోడ్ల అభివృద్ధి పంచాయతీరాజ్ పరిధిలోని 38,500 కి.మీ. పొడవున రోడ్లను అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. నియోజకవర్గానికి సగటున 385 కిలోమీటర్ల రోడ్లు బాగుపడుతాయని వెల్లడించారు. అందులోభాగంగా పంచాయతీరాజ్ పరిధిలో ఉన్న 14,500 కిలోమీటర్ల రహదారులు మరమ్మతులు చేయాలని, 4,160 కిలోమీటర్ల మెటల్ రోడ్లను బీటీ రోడ్లుగా మార్చాలని, 20,000 కిలోమీటర్ల మట్టిరోడ్లను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
వంతెనలు, కాజ్‌వేల నిర్మాణానికి రూ.250 కోట్లు ఖర్చవుతాయని అధికారులు అంచనాలు వేశారు. ఈ పనులను కూడా వెంటనే పూర్తిచేయాలని అన్నారు. పంచాయతీరాజ్ పరిధిలో ఉన్న రూ.700 కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని ఆన్నారు. రోడ్ల అభివృద్ధికి ప్రస్తుతం పెట్టిన బడ్జెట్‌తోపాటు వచ్చే బడ్జెట్‌లో కూడా నిధులు కేటాయిస్తామని చెప్పారు.
పనుల్లో నాణ్యతకు ఇంజినీర్లదే బాధ్యత రోడ్లు, భవనాల శాఖ అంచనాలకు సంబంధించిన పనులను వెంటనే చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. ఒకట్రెండు రోజుల్లోనే అంచనాల తయారీ పూర్తిచేసి, వారంలోగా టెండర్లు పిలిచి, 15వ రోజున టెండర్లు ఖరారు చేయాలని చెప్పారు. నవంబర్ నెలాఖరులోగా ఈ ప్రక్రియ పూర్తిచేయాలని, మే నెలాఖరువరకు పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. పనులు వేగంగా పూర్తి కావడంతోపాటు నాణ్యత విషయంలో కూడా అధికారులే బాధ్యత తీసుకోవాలని స్పష్టం చేశారు.
ఆర్‌అండ్‌బీ విభాగం అంచనాల ప్రకారం రాష్ట్రంలోని 10వేల కిలోమీటర్ల రహదారుల మరమ్మతులకు రూ.2400 కోటు,జిల్లా కేంద్రానికి డబుల్ లైన్ రోడ్లు లేని 149 మండల కేంద్రాలకు 2వేల కిలోమీటర్ల మేర డబుల్‌లైన్ రోడ్డు నిర్మాణానికి రూ.2589 కోట్లు, గోదావరి, కృష్ణా నదులపై వంతెనలు, శిథిలావస్థలో ఉన్న బ్రిడ్జిలు, కల్వర్టులు నిర్మించడానికి రూ.1445 కోట్లు, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, గజ్వేల్ చుట్టూ రింగ్‌రోడ్ల నిర్మాణానికి రూ.1550 కోట్లు, నిజామాబాద్- డిచ్‌పల్లి, ఖమ్మం-సూర్యాపేట రహదార్లను నాలుగు లైన్ల రోడ్లుగా మార్చడానికి రూ.440 కోట్లు, రాజీవ్ రహదారుల అభివృద్ధికి రూ.750 కోట్లు, పెండింగ్ బిల్లుల చెల్లింపులకు రూ.50 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు రేమాండ్ పీటర్, ఎస్. నర్సింగరావు, ఆర్ అండ్ బీ రోడ్స్ చీఫ్ ఇంజనీర్ రవీందర్‌రావు, పంచాయతీరాజ్ ఈఎన్‌సీ సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.