వరంగల్‌లో ఏదో ఒక అలజడి సృష్టించాలని బీజేపీ ప్రయత్నిస్తోందని పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు అన్నారు. పరకాల ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి ఇంటిపై బీజేపీ గుండాలు దాడి చేయడాన్ని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, రాజయ్య తీవ్రంగా ఖండించారు. దాడి ఘటనపై వెంటనే వరంగల్ పోలీస్ కమిషనర్‌తో మాట్లాడి దాడికి పాల్పడిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇలాంటి చర్యలను వాటిని ఉపేక్షించకూడదన్నారు.

బీజేపీ రాష్ట్రంలో భౌతిక దాడులను ప్రోత్సహిస్తోందన్నారు. తెలంగాణలో ఇలాంటి సంస్కృతికి చోటు లేదన్నారు. వరంగల్‌లో ఏదో ఒక అలజడి సృష్టించాలని బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. చల్లా ధర్మారెడ్డి రామాలయం డబ్బులు లెక్కలు అడిగితే తప్పా అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ శ్రేణులు ఎక్కడా దాడులు, ఆందోళనలు చేయవద్దని కోరారు. టీఆర్ఎస్ పార్టీ దాడులకు వ్యతిరేకమన్నారు. ధర్మారెడ్డి ఇంటిపై దాడిని ప్రజాస్వామ్యవాదులంతా ఖండించాలన్నారు.
బీజేపీ వాపును చూసి బలుపు అనుకుంటోందన్నారు. త్వరలో వరంగల్ కార్పోరేషన్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ఇలాంటి చిల్లర రాజకీయాలకు పాల్పడుతోందన్నారు. తెలంగాణ ప్రజలు ఇలాంటి వాటిని సహించరని, వారికి సరైన బుద్ధి చెప్తారని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ సంస్థాగతంగా బలమైన కార్యకర్తలున్న పార్టీ అని, ఉద్యమాలు చేసిన పార్టీ అన్న విషయాన్ని బీజేపీ గుర్తు పెట్టుకోవాలని హెచ్చరించారు.