Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

వరంగల్‌లో టెక్‌మహీంద్రా

రాష్ట్రానికి పెట్టుబడులు రప్పించేందుకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి మేరకు వరంగల్‌లో కార్యకలాపాలు ప్రారంభించేందుకు ప్రముఖ టెక్ దిగ్గజం టెక్‌మహీంద్రా ముందుకొచ్చింది. మొదటిదశలో 500 మందికి ఉపాధి కల్పించే విధంగా సంస్థను నెలకొల్పుతామని టెక్‌మహీంద్రా చైర్మన్ ఆనంద్‌మహీంద్రా ప్రకటించారు. దావోస్‌లో నిర్వహిస్తున్న ప్రపంచ ఆర్థిక వేదికలో.. ఆనంద్‌మహీంద్రాతోపాటు పలువురు ప్రముఖ పారిశ్రామికవేత్తలతో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్‌అదానీ, టాటా గ్రూప్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్, బజాజ్‌గ్రూప్ చైర్మన్ రాహుల్‌బజాజ్, హీరోమోటోకార్ప్ సీఈవో పవన్‌ముంజాల్, వెల్‌స్పన్‌గ్రూప్ చైర్మన్ బీకే గోయెంకా, ఉదయ్‌కోటక్, లాక్‌హీడ్ మార్టిన్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రిచర్డ్ అంబ్రోస్ వంటి ప్రముఖులతో మంత్రి భేటీ అయ్యారు. తెలంగాణ- మహీంద్రా సంస్థల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేయాలని.. వరంగల్ పట్టణంలో టెక్‌మహీంద్రా కార్యకలాపాలు ప్రారంభించాలని ఆనంద్‌మహీంద్రా, కంపెనీ సీఈవో సీపీ గుర్నానీని మంత్రి కేటీఆర్ కోరారు.

రాష్ట్ర ప్రభుత్వం ద్వితీయశ్రేణి నగరాలకు ఐటీ పరిశ్రమను విస్తరించేందుకు చేస్తున్న ప్రయత్నాలతోపాటు వరంగల్‌లో ఉన్న అవకాశాలు, టాలెంట్‌పూల్ వంటి అంశాలను మంత్రి వారికి వివరించారు. దీంతో వరంగల్‌లో టెక్‌సెంటర్ ఏర్పాటుచేసేందుకు ముందుకొచ్చారు. ముందుగా 500 మందితో సెంటర్ నెలకొల్పి, భవిష్యత్‌లో విస్తరిస్తామని తెలిపారు. మహీంద్రా సంస్థ తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్రంలో రెండోశ్రేణి నగరాలకు ఐటీ పరిశ్రమను విస్తరించడంలో ప్రేరకంగా పనిచేస్తుందని చెప్పారు. ఈ నిర్ణయం తీసుకున్న అనంద్‌మహీంద్రా, సీపీ గుర్నానికి మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. ఫిన్లాండ్ రాజధాని హెల్సింకిలో నిర్వహించే అతిపెద్ద స్టార్టప్ అండ్ టెక్ ఈవెంట్‌స్లష్‌ను ఈసారి హైదరాబాద్‌కు తీసుకొస్తామని వారు హామీ ఇచ్చారు. టీహబ్ ద్వారా రాష్ట్ర రాజధాని ఇప్పటికే దేశ స్టార్ట్‌ప్ క్యాపిటల్‌గా మారిందని, ఈ కార్యక్రమం నగర స్టార్టప్ ఏకోసిస్టంకు గొప్ప ఊతమిస్తుందని మంత్రి తెలిపారు. త్వరలోనే ఆనంద్‌మహీంద్రా సీం కేసీఆర్‌ను కలువనున్నారు.

హైదరాబాద్ అత్యుత్తమం: సీఏ సంస్థ గ్లోబల్ సీఈవో మైక్‌గైగోరి ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశాలు జరుగుతున్న దావోస్‌లో ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో వరుసగా సమావేశమవుతున్న మంత్రి కేటీఆర్.. గురువారం సీఏ సంస్థ గ్లోబల్ సీఈవో మైక్‌గైగోరితో భేటీ అయ్యారు. కంపెనీ భవిష్యత్ విస్తరణ ప్రణాళికలో హైదరాబాద్‌కు ప్రాధాన్యమివ్వాలని మంత్రి కేటీఆర్ కోరారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన మైక్‌గైగోరి.. ప్రస్తుతం హైదరాబాద్‌లో తమ కంపెనీ వృద్ధిరేటు పూర్తి సంతృప్తికరంగా ఉన్నట్టు తెలిపారు. తమ కంపెనీ కార్యకలాపాలు కొనసాగిస్తున్న పలు నగరాలతో పొల్చితే హైదరాబాద్ అత్యుత్తమ నగరమని చెప్పారు. ముఖ్యంగా ట్రాఫిక్, ఎయిర్‌పోర్ట్ కనెక్టివిటీ, చవుకైన మౌలిక వసతులున్నాయంటూ ప్రశంసలు కురిపించారు.

త్వరలో రాష్ట్రానికి ఫైజర్ బృందం ఫైజర్‌వాక్సిన్ అధ్యక్షురాలు సుసాన్ సిలబెర్మన్‌తో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. హైదరాబాద్ నగరం ప్రపంచ వ్యాక్సిన్స్ తయారీహబ్‌ల్లో ఒకటిగా ఉన్నదని, దాదాపుగా 25 శాతం ప్రపంచ వ్యాక్సిన్లు ఇక్కడే తయారవుతున్నాయని మంత్రి సుసాన్‌కు తెలిపారు. నగరంలోని జీనోమ్‌వ్యాలీ, ప్రభుత్వం ఏర్పాటుచేయనున్న ఫార్మాసిటీల గురించి వివరించారు. ఫైజర్‌సంస్థ వాక్సిన్ ఉత్పత్తి కేంద్రాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటుచేయాలని, ఇందుకు అవసరమైన అధ్యయనానికి ఫైజర్‌బృందాన్ని పంపాలని కోరారు. ఇందుకు ఆమె సానుకూలంగా స్పందించారు.

ఏరోస్పేస్ రంగంలోనూ అవకాశాలు ఏరోస్పేస్ దిగ్గజం లాక్‌హీడ్‌మార్టిన్ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు రిచర్డ్‌అంబ్రోస్‌తో సమావేశమైన మంత్రి కేటీఆర్.. ఈ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు అవసరమైన ఏకోసిస్టం హైదరాబాద్‌కు ఉన్నదని మంత్రి చెప్పారు. ఎయిరోస్పేస్ పార్కులు, మార్స్ ఆర్బిటర్ ప్రయోగంలో హైదరాబాద్ ఎమ్మెస్‌ఎంఈల భాగస్వా మ్యం వంటి అంశాలను మంత్రి వివరించారు. బల్గేరియా టూరిజంశాఖ మంత్రి నికోలినా అంగేల్‌కోవాతో కేటీఆర్ సమావేశమయ్యారు. ఇరుప్రాంతాల మధ్య స్టార్టప్, ఇన్నోవేషన్ టూరిజంరంగాల్లో ప్రమోషన్‌పైన చర్చించారు. ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ ప్యానెళ్ల తయారీసంస్థ ట్రినాసోలార్ ఉపాధ్యక్షుడు రొంగ్‌ఫాంగ్‌యిన్, ఫిలిప్స్‌సంస్థ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ హెంక్ డీ జంగ్, అబ్రాజ్‌గ్రూప్ మేనేజింగ్ పార్ట్‌నర్ కీటోడీబోయర్‌తోపాటు ఇంకా పలు కంపెనీల ప్రతినిధులతో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.