-అన్ని హంగులతో వరంగల్ ఓఆర్ఆర్.. -ఈనెల 22న శంకుస్థాపన చేయనున్న సీఎం కేసీఆర్

రాష్ట్రంలో రెండో అతిపెద్ద నగరం వరంగల్‌ను హైదరాబాద్ మాదిరిగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. ఇందులో భాగంగా రూ.1445 కోట్ల అంచనావ్యయంతో వరంగల్ చుట్టూ నాలుగు లేన్ల అవుటర్ రింగ్‌రోడ్ (ఓఆర్ఆర్) నిర్మాణం చేపడుతున్నది. వరంగల్ నగరానికి మణిహారంగా ఓఆర్ఆర్ నిలువబోతున్నది. హైదరాబాద్ చుట్టున్న ఓఆర్ఆర్ను తలపించే విధంగా 74 కిలోమీటర్ల పొడవున అన్ని హంగులతో వరంగల్ రింగ్‌రోడ్‌ను నిర్మించాలని సంకల్పించింది. ఈ నెల 22న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఈ రింగ్‌రోడ్డుకు శంకుస్థాపన చేయనున్నారు. రింగ్‌రోడ్ నిర్మాణంలో భాగంగా రాష్ట్ర హైవేపై 17.7 కిలోమీటర్ల రహదారి అభివృద్ధికి ప్రభుత్వం రూ. 669.59 కోట్ల ఖర్చుకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. హైదారాబాద్‌లో ఉన్నట్లు అన్ని ఆధునిక వసతులు, విద్య, ఉపాధి అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో వరంగల్ నగరాన్ని తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం బృహత్ ప్రణాళికలతో ముందుకు సాగుతున్నది. వరంగల్‌లో ప్రతిష్ఠాత్మకమైన టెక్స్టైల్ పార్క్‌ను త్వరలో ఏర్పాటు చేయనున్నది. విద్యార్థులకు శిక్షణనిచ్చే టాస్క్ కేంద్రాన్ని ఇప్పటికే ప్రారంభించింది.
నేత కార్మికుల కోసం ఆజంజాహి మిల్లు పునరుద్ధరణ చేపడుతున్నది. ఐటీ కంపెనీలను విస్తరిస్తున్నది. రవాణా సౌకర్యాల పెంపు కోసం అవుటర్ రింగ్‌రోడ్ నిర్మాణంపై దృష్టిసారించింది. దీనివల్ల వరంగల్ నగరానికి ట్రాఫిక్ ఇబ్బందులు తప్పుతాయి. వరంగల్ మీదుగా ఇతర జిల్లాలకు వెళ్లాల్సిన వాహనాలు ఇకపై వరంగల్ నగరంలోకి రాకుండా రింగ్‌రోడ్ పై నుంచి నేరుగా కరీంనగర్, ములుగు, ఖమ్మం, హైదరాబాద్ రహదారులకు మళ్లుతాయి. హైదరాబాద్ ఓఆర్ఆర్ నిడివి 158 కిలోమీటర్లు కాగా వరంగల్ ఓఆర్ఆర్ 74 కిలోమీటర్లు ఉంటుంది. హైదరాబాద్- వరంగల్ జాతీయరహదారి కింద 29 కిలోమీటర్ల్ల రోడ్డు, ఇటీవలే మంజూరైన వరంగల్ -ఖమ్మం జాతీయరహదారిలోని 22 కిలోమీటర్ల రోడ్లు కవర్ అవుతుంది. ఈ రెండు హైవేల నుంచి వచ్చే రహదారులు ఓఆర్ఆర్కు కనెక్ట్ అవుతాయి. కరుణాపురం – ఆరెపల్లి చౌరస్తా వరకు 29.8 కిలోమీటర్ల రింగ్‌రోడ్ నిర్మాణానికి కేంద్రం తన వాటా కింద రూ.776 కోట్లు మంజూరు చేసింది. ఈ రింగ్‌రోడ్‌లో కరుణాపురం నుంచి ఖమ్మంరోడ్లో సింగారం వరకున్న 17.7 కి.మీ. రోడ్ రాష్ట్ర రహదారుల పరిధిలోకి వస్తుంది. ఈ భాగం నిర్మాణానికి రూ.669.59 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది.
నగరానికి చుట్టూ 20 కిలోమీటర్ల పరిధిలో.. అభివృద్ధిలో భాగంగా వరంగల్ అతివేగంగా విస్తరిస్తున్న క్రమంలో నగరంలోకి భారీవాహనాలు రాకుండా నాలుగు లేన్లలో అవుటర్ రింగ్‌రోడ్‌ను నిర్మిస్తారు. వరంగల్ నగరానికి చుట్టూ 20 కిలోమీటర్ల పరిధిలో దీని నిర్మాణం జరుగుతుంది. హైదరాబాద్ నుంచి వరంగల్‌కు చేరే క్రమంలో కరుణాపురం గ్రామం వద్ద నుంచి అవుటర్ రింగ్‌రోడ్డు కుడి, ఎడమల వైపు సాగుతుంది. కరుణాపురం నుంచి సింగారం గ్రామం వరకు దాదాపు 17.7 కి.మీ. హైవే విస్తరణతో అభివృద్ధికి అయ్యే ఖర్చు రూ. 669.59 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తున్నది. కరుణాపురం నుంచి ఎడమ వైపున ములుగు రోడ్డులోని ఆరేపల్లి వరకున్న 29 కిలోమీటర్ల దారి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) పరిధిలో ఉంది. దీని అభివృద్ధికి ఇప్పటికే కేంద్రం అనుమతినిచ్చింది. నిర్మాణ కార్యక్రమాలు చేపట్టడానికి అంతా సిద్ధం చేసింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఆరేపల్లి నుంచి ఖమ్మం రోడ్డులో సింగారం వరకున్న 21.3 కిలోమీటర్ల జాతీయ రహదారిని కూడా అభివృద్ధి చేయాలన్న రాష్ట్ర సర్కార్ ప్రతిపాదనకు కూడా కేంద్ర ఉపరిత రవాణాశాఖ మంత్రి నితిన్‌గడ్కరీ మౌఖిక అనుమతినిచ్చారు. దీంతో ఈ 21.3 కిలోమీటర్ల రింగ్‌రోడ్ కోసం రూ.776 కోట్ల అంచనా వ్యయంతో డీపీఆర్ తయారు చేసి కేంద్రానికి పంపించినట్లు రాష్ట్ర రోడ్లు భవనాలశాఖ ఈఎన్సీ రవీందర్రావు తెలిపారు. హైదరాబాద్ ఔటర్ తరహాలోనే ఈ డీపీఆర్‌ను రూపొందించారు.
నాలుగు మండలాల్లో ఔటర్ విస్తరణ వరంగల్ ఔటర్ రింగ్ రోడ్డు 4 మండలాల్లో విస్తరించి ఉంటుంది. కరుణాపురం- ఖమ్మం రోడ్డు రూట్లో స్టేషన్ ఘన్పూర్, జఫర్‌గఢ్, వర్ధన్నపేట, సంగెం మండలాలున్నాయి. ఖమ్మం- ములుగురోడ్‌లో జఫర్‌గఢ్, ఘన్పూర్ మండలాల్లోని బొల్లికుంట, ధరంపూర్, గరిడెపల్లి, గొర్రెకుంట, కొండపల్లి, కొత్తపేట, మొగిలిచర్ల, నస్కపేట, పైడిపల్లి, వంచనగిరి తదితర గ్రామాలున్నాయి. ఈ గ్రామాలవాసులు అవుటర్ రింగ్ రోడ్డు దాటే సమయంలో ప్రమాదాల పాలుకాకుండా ఇంటర్ చేంజ్ రోడ్‌వేలు ఏర్పాటు చేస్తారు. కరుణాపురం- సింగారంల మధ్య ఉన్న గ్రామాలవారి కోసం 7 వెహికిల్ అండర్‌పాస్ వంతెనలు, 8 మైనర్ బ్రిడ్జిలు, 28 బాక్స్ కల్వర్టులు, సింగారం వద్ద ఇంటర్చేంజ్ రోడ్ వేలు నిర్మిస్తారు. సింగారం- ఆరెపల్లి రూట్లోని గ్రామాలవారి కోసం 31 కల్వర్టులు, 6 బ్రిడ్జిలు, 6 వెహికిల్ అండర్‌పాస్‌లు, ఒక ఆర్వోబీ, 3 ఇంటర్చేంజ్ రోడ్‌వేలు నిర్మించనున్నారు. ఈ రోడ్డులో అధిక సంఖ్యలో గ్రామాలుండటంతో ఇంటర్ చేంజ్ రోడ్డు వేస్ ఎక్కువ సంఖ్యలో ఏర్పాటు చేస్తున్నారు. రింగ్ రోడ్లకు ఇరువైపులా సర్వీస్రోడ్లుంటాయి. సర్వీస్ రోడ్లను అవుటర్ నిర్మాణదారులే నిర్ణీత కాలవ్యవధి వరకు నిర్వహిస్తారు. స్థానికుల అవసరాల మేరకు నిర్మాణంలో మార్పులు చేర్పుల ఖర్చులు కూడా భరిస్తారు.
-74కిలోమీటర్ల పొడవు -4లేన్ల రింగ్‌రోడ్ నిర్మాణం -1445 కోట్ల వ్యయం -కేంద్రం వాటా 776 కోట్లు -రాష్ట్రం వాటా 669 కోట్లు
హైదరాబాద్ ఔటర్ తరహాలోనే డీపీఆర్ పరిసర గ్రామాల సౌకర్యార్థం అండర్‌పాస్ వంతెనలు, మైనర్ బ్రిడ్జిలు, బాక్స్ కల్వర్టులు, ఇంటర్చేంజ్ రోడ్‌వేల నిర్మాణం