Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

వాటర్‌గ్రిడ్ ఏర్పాటు ప్రతిష్ఠాత్మకం

-నాలుగేండ్లలో పూర్తి.. 15 రోజులకోసారి సమీక్ష: మంత్రి కేటీఆర్

KTR రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్ ఇవ్వడం ద్వారా స్వచ్ఛమైన తాగునీటిని అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం తాగునీటిగ్రిడ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు పంచాయతీరాజ్, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు. సోమవారం వాటర్‌గ్రిడ్ ఏర్పాటుపై సీఎం సమీక్ష నిర్వహించిన అనంతరం సచివాలయంలో మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. వాటర్‌గ్రిడ్ ఏర్పాటును ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారని చెప్పారు. రూ.27 వేల కోట్ల అంచనా వ్యయంతో 1,26,036 కిలోమీటర్ల పరిధిలో ఏర్పాటు చేయనున్న గ్రిడ్‌కు అవసరమైతే ప్రత్యేక అథారిటీని ఏర్పాటు చేస్తామని సీఎం చెప్పినట్టు కేటీఆర్ వివరించారు.

వాటర్‌గ్రిడ్ పనుల సర్వేకు అవసరమైతే ప్రభుత్వ హెలికాప్టర్‌ను వినయోగించుకోవాలని అధికారులకు సీఎం సూచించినట్టు వెల్లడించారు. వాటర్‌గ్రిడ్ ఏర్పాటుపై సీఎం 8 గంటలపాటు అధికారులతో సమీక్ష నిర్వహించారు. నాలుగేండ్లలో వాటర్‌గ్రిడ్ పనులను పూర్తి చేయాలని నిర్ణయించామని, పర్యక్షణకు ప్రతిజిల్లాలో 15 రోజులకోసారి సమీక్ష నిర్వహిస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. గ్రిడ్ పనులను అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించనున్నట్లు చెప్పారు. వాటర్‌గ్రిడ్ పరిధిలోకి హైదరాబాద్‌ను తీసుకొచ్చే అంశంపై హైదరాబాద్ వాటర్‌వర్క్స్ ఇంజినీర్లతో కేసీఆర్ త్వరలో సమావేశమవుతారని కేటీఆర్ తెలిపారు. నవంబర్ 1 నుంచి పెంచిన కొత్త పింఛన్లను, కొత్త రేషన్‌కార్డులను పంపిణీ చేయనున్నట్లు చెప్పారు.

డిసెంబర్‌నాటికి హైదరాబాద్‌లో వై-ఫై సేవలు డిసెంబర్ చివరినాటికి హైదరాబాద్ నగరంలో వై-ఫై సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు మంత్రి కేటీఆర్ చెప్పారు. ఈ నెలఖరులోపు టెండర్ల ప్రక్రియ పూర్తవుతుందని, నగరంలో ఇప్పటికే 4జీ, వై-ఫై సేవలను రిలయన్స్ సంస్థ ప్రాంభించిందని చెప్పారు. మెట్రోపొలిస్ సదస్సు జరిగే ప్రాంతాలతోపాటు, వెస్ట్‌జోన్ పరిధిలో ఉన్న హోటల్స్ అన్నింటికీ వై-ఫై సేవలను రిలయన్స్ సంస్థ అందించనున్నట్టు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలకు 4 జీ, వై-ఫై సేవలను విస్తరించే అంశంపై ప్రభుత్వం కసరత్తు చేస్తున్నదని కేటీఆర్ తెలిపారు. రాష్ట్రంలో మరో ఆరునెలల్లో 2900 గ్రామాల్లో ఈ-పంచాయతీలను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి వివరించారు.

కరీంనగర్ నుంచి ఈ -పంచాయతీల ఏర్పాటును ప్రారంభించనున్నామన్నారు. కాగా, హైదరాబాద్‌లో అక్టోబర్ 6 నుంచి 10 వరకు జరిగే అంతర్జాతీయ మెట్రోపొలిస్ సదస్సు ముగింపు వేడుకలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హాజరుకానున్నట్లు మంత్రి కేటీఆర్ చెప్పారు. ఈ సదస్సుకు 60 దేశాలకు చెందిన 800 నుంచి 1200 మంది ప్రతినిధులు, 2000 మంది స్థానిక ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.