Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

నీళ్లిచ్చినంకనే ఓట్లడుగుతాం

మూడేండ్లలో వాటర్‌గ్రిడ్ పథకాన్ని పూర్తిచేసి ప్రజలకు నల్లాల ద్వారా నీళ్లిచ్చినంకనే ఎన్నికల్లో నిలబడి ప్రజలను ఓట్లడుగుతామని రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్‌శాఖమంత్రి కల్వకుంట్ల తారకరామారావు పునరుద్ఘాటించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వ పాలనకు, పథకాలకు ప్రజలు పూర్తిస్థాయిలో సహకరిస్తారన్న అచంచల విశ్వాసంతో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఈ మేరకు భీష్మ ప్రతిజ్ఞ చేశారని కేటీఆర్ గుర్తుచేశారు.

-ప్రజలు సహకరిస్తారనే సీఎం కేసీఆర్ శపథం -వాటర్‌గ్రిడ్ మామూలు పథకం కాదు..85 లక్షల కుటుంబాలకు నీళ్లిచ్చే భగీరథయత్నం -అధికారం పోయినందుకే కాంగ్రెస్‌కు కడుపుమంట -తెలంగాణ ప్రజాప్రయోజనాలు దెబ్బతీస్తున్న చంద్రబాబు -మహబూబ్‌నగర్ జిల్లా ఎల్లూరు సెగ్మెంట్ -వాటర్‌గ్రిడ్ శంకుస్థాపన సభలో మంత్రి కేటీఆర్

మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల సమీపంలోని నాగసాల గ్రామశివారులో రూ.5,953 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న ఎల్లూరు సెగ్మెంట్ వాటర్‌గ్రిడ్ పథకానికి బుధవారం ఆయన శంకుస్థాపన చేసి పైలాన్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగసభలో కేటీఆర్ మాట్లాడారు. ప్రజలు కాంగ్రెస్‌ను అధికారానికి దూరం చేసినందుకే ఆ పార్టీ నాయకులు కడుపుమంటతో ప్రభుత్వంపై అర్థంలేని ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.

IT-Minister-KT-Rama-Rao-launched-water-grid-program-at-Mahabubnagar-01

60 ఏండ్ల దూరదృష్టితో వాటర్‌గ్రిడ్ దేశచరిత్రలో ఏ ముఖ్యమంత్రీ చేయనివిధంగా ఓవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమ కార్యక్రమాలతో సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తున్నారని తెలిపారు. వాటర్‌గ్రిడ్ అంటే మామూలు పథకం కాదని, రూ.6,773 కోట్ల అంచనా వ్యయంతో 60ఏండ్ల వరకు 3,737 గ్రామాల పరిధిలో 85లక్షల కుటుంబాలకు రక్షిత మంచినీరు అందించే భగీరథ యత్నమన్నారు.

ఎల్లూరు సెగ్మెంట్ వాటర్‌గ్రిడ్ ద్వారా పాలమూరు జిల్లాలో 12, రంగారెడ్డి జిల్లాలో 7 నియోజకవర్గాల పరిధిలోని 82 మండలాలు, 16 మున్సిపాలిటీల ప్రజలకు 60 నీటిశుద్ధి ప్లాంట్‌ల ద్వారా లక్షా 50వేల కిలోమీటర్ల మేరకు పైపులైన్లు వేసి శ్రీశైలం బ్యాక్‌వాటర్ నుంచి రక్షిత మంచినీరు అందించనున్నట్లు తెలిపారు. సెగ్మెంట్ -2 ద్వారా పాలమూరు జిల్లాలోని గద్వాల, ఆలంపూర్ నియోజకవర్గాల పరిధిలో 9 మండలాలు, రెండు మున్సిపాలిటీలకు జూరాల ప్రాజెక్టు ద్వారా తాగునీరందిస్తామన్నారు. గడువుకంటే ముందే రెండేండ్లలో పథకాన్ని పూర్తిచేసి జిల్లాలో ఇంటింటికి నల్లానీరు అందిస్తామని, వచ్చే ఎండాకాలంలోగా రైతులకు పగటిపూటే 9గంటల విద్యుత్‌ను నిరంతరాయంగా సరఫరా చేస్తామని అన్నారు.

ప్రజా ప్రయోజనాలను అడ్డుకుంటున్న బాబు వాటర్‌గ్రిడ్, పాలమూరు ఎత్తిపోతల తదితర పథకాలతో రాష్ట్ర అభివృద్ధి కోసం తమ ప్రభుత్వం కృషిచేస్తుంటే ఏపీ సీఎం చంద్రబాబు సీడబ్ల్యూసీకి లేఖలు రాస్తూ అడ్డుపడుతున్నారని కేటీఆర్ విమర్శించారు. వాటర్‌గ్రిడ్ పథకాన్ని సైతం అడ్డుకునేందుకు బాబు కుట్ర చేస్తున్నారన్నారు. తెలంగాణ ప్రభుత్వం బాజాప్తానే నదీజలాలను వినియోగిస్తుందని స్పష్టంచేశారు. తెలంగాణలో గోదావరి ద్వారా 900 టీఎంసీలు, కృష్ణానది ద్వారా 300 టీఎంసీల నీటిని వినియోగించుకునే అవకాశముందని గతంలో అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్న విషయాన్ని కేటీఆర్ గుర్తుచేశారు.

కాంగ్రెస్‌ది అధికార విరహ వేదన అధికారంలో ఉండగా ప్రజలను పట్టించుకోని కాంగ్రెస్ ప్రస్తుతం అధికార విరహ వేదనతో, కడుపుమంటతో రగిలిపోతూ రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేయడం విడ్డూరంగా ఉందని కేటీఆర్ విమర్శించారు. మొన్నటిదాకా అధికారంలో ఉండి ఇప్పుడు డ్రామా కంపెనీ పెడితే కాంగ్రెస్‌ను ప్రజలెలా నమ్ముతారని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా ఉంటుందే తప్ప పనిలేని ప్రతిపక్షాలకు కాదన్నారు.

రైతు ఆత్మహత్యలు గత పాలకుల పాపమే: లక్ష్మారెడ్డి గత ప్రభుత్వాల నిర్వాకం వల్లనే ప్రస్తుతం రైతుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతున్నదని వైద్య ఆరోగ్యశాఖమంత్రి లక్ష్మారెడ్డి విమర్శించారు. 60 ఏండ్లలో తెలంగాణను నాశనం చేసిన గత పాలకులకు టీఆర్‌ఎస్ 15 నెలల పాలనను విమర్శించే నైతిక హక్కు లేదన్నారు.

ఎంపీ జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ ఇంటింటికీ నల్లానీరు ఇచ్చాకనే ఓట్ల కోసం ప్రజలముందుకు వెళతామని ముఖ్యమంత్రి చేసిన శపథానికి తాముకూడా కట్టుబడి ఉన్నామన్నారు. మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పాలనను పొరుగు రాష్ట్రాల సీఎంలు సైతం ప్రశంసిస్తుంటే తమ జెండాదిమ్మెలు కదలుతున్నాయనే ప్రతిపక్షాలు అసత్య ఆరోపణలకు దిగుతున్నాయని విమర్శించారు. ప్రజల ప్రయోజనాలకోసం చేపట్టిన పథకాలకు అందరూ సహకరించాలని ఎమ్మెల్సీ రాంచందర్‌రావు కోరారు. సభలో పాలమూరు జెడ్పీ చైర్మన్ భాస్కర్, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, అంజయ్యయాదవ్, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు శివకుమార్, పంచాయతీరాజ్‌శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రేమండ్‌పీటర్, కలెక్టర్ టీకే శ్రీదేవి, జేసీ రాంకిషన్, ఈఎన్‌సీ సురేందర్‌రెడ్డి, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ కృపాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ జగదీశ్వర్‌రెడ్డి, జెడ్పీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు.

IT-Minister-KT-Rama-Rao-launched-water-grid-program-at-Mahabubnagar

ఎల్లూరు వాటర్‌గ్రిడ్ పనులను పరిశీలించిన కేటీఆర్ కొల్లాపూర్, నమస్తే తెలంగాణ: వాటర్‌గ్రిడ్ పనులను నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలని అధికారులకు మంత్రి కేటీఆర్ సూచించారు. బుధవారం సాయంత్రం ఆయన మహబూబ్‌నగర్ జిల్లా కొల్లాపూర్ మండలం ఎల్లూరు శివారులో నిర్మిస్తున్న ఎంజీఎల్‌ఐ మొదటి రిజర్వాయర్ వద్ద పనులను పరిశీలించారు. షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్, వాటర్‌గ్రిడ్ ఇంజినీరింగ్ ఇన్ చీఫ్ సురేందర్‌రెడ్డి, చీఫ్ ఇంజినీర్ బాబురావు, ఎస్‌ఈ కృపాకర్‌రెడ్డి, జాయింట్ కలెక్టర్ రాంకిషన్‌తో కలిసి పంప్‌హౌస్ కోసం జరుగుతున్న తవ్వకాలను పరిశీలించారు.

ఎల్లూరు రిజర్వాయర్ నీటి నిల్వ సామర్థ్యం, రిజర్వాయర్‌లోకి నీటి తరలింపు వివరాలను అడిగి తెలుసుకున్నారు. వాటర్‌గ్రిడ్ ప్రాజెక్ట్ మ్యాప్‌ను పరిశీలించారు. మంత్రి తిరుగు పయనమవుతుండగా వాటర్‌గ్రిడ్ నిర్మాణంలో భూములు కోల్పోయిన ఓ బాధితుడి కుమారుడు తాను ఇంజినీరింగ్ చదివానని, తనకు వాటర్‌గ్రిడ్‌లో ఉద్యోగం ఇవ్వాలని మంత్రిని కోరాడు. దీనికి మంత్రి స్పందిస్తూ వాటర్‌గ్రిడ్‌లో ఔట్ సోర్సింగ్ విధానంలో తప్పకుండా ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.