Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

విపక్షాలను తిప్పికొడదాం!

– వద్దు అనేదాకా అసెంబ్లీ నడుపుదాం.. – అల్లరికి దిగితే తగురీతిలో స్పందిద్దాం – సంక్షేమంలో మనమేటాప్ -2019లో అధికారం మనదే..! – గెలుపు బాధ్యత నాకు వదిలేయండి – గ్రీన్‌చానెల్‌లో ఇరిగేషన్ నిధులు – మార్కెట్ కమిటీ చైర్మన్ల రిజర్వేషన్లు మన ఘనతే – టీఆర్‌ఎస్ శాసనసభాపక్ష సమావేశంలో సీఎం కే చంద్రశేఖర్‌రావు

CM-KCR-meeting-with-party-MLAs-and-MLCs

అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షాలు చేసే ఏ విమర్శనైనా దీటుగా తిప్పికొట్టాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులకు పిలుపునిచ్చారు. దేశంలో ఏ ప్రభుత్వం చేయనన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాం.. ప్రజలకు జవాబుదారీగా ఉంటున్నాం. ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి అంశానికీ దీటుగా బదులిద్దాం. ప్రతిపక్షాలు వద్దు అని పారిపోయేదాకా అసెంబ్లీ సమావేశాలు నడుపుదాం అని ఆయన అన్నారు.

రాష్ట్రంలో కనీవిని ఎరుగని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినందున 2019లోనూ అధికారం మనదే.. గెలిచే బాధ్యత నాకు వదిలేయండి అని కేసీఆర్ అన్నారు. బుధవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో మంగళవారం తెలంగాణభవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం నిర్వహించారు. మధ్యాహ్నం 3.15 గంటలకు మొదలై దాదాపు గంటన్నరపాటు కొనసాగిన ఈ సమావేశంలో అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.

గత శాసనసభ సమావేశాల్లో మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి బదులిస్తే ప్రతిపక్షాలు మళ్లీ నోరెత్తలేదని అదేవిధంగా ఈసారి అయా అంశాల మీద పూర్తిస్థాయి సమాచారంతో రావాలని కేసీఆర్ శాసనసభ్యులకు సూచించారు. ప్రతిరోజు వందశాతం హాజరు ఉండాలని, సభలో హుందాగా వ్యవహరించాలని ఆయన ఉద్బోధించారు. ఒకవేళ అవతలివైపునుంచి అల్లరి చేష్టలు చేస్తే తగురీతిలో స్పందించి సభ నడుపుకుంటామని కేసీఆర్ స్పష్టం చేశారు.

మనం ప్రజలకు జవాబుదారీ… అసెంబ్లీ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహంపై మాట్లాడుతూ కచ్చితంగా సరైన సమయానికి అందరూ హాజరుకావాలని కేసీఆర్ చెప్పారు. శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి, మరో ఐదారుగురు మంత్రులతోపాటు చీఫ్ విప్, విప్‌లు సమన్వయంతో పనిచేయాలన్నారు.

ఏరోజుకు ఆరోజు అంశాలవారీగా ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. దేశంలోనే ఏ రాష్ట్రంలో అమలుచేయని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్ని అమలుచేస్తున్నం. మ్యానిఫెస్టోలో ఇచ్చిన కేజీ టు పీజీ తప్ప అన్ని హామీలు అమలుచేస్తున్నం. ఇయ్యని హామీలు కూడా అమలు చేసినం. కేజీ టు పీజీ వచ్చే ఏడాది అమలుచేద్దాం. మనం చెప్పుకోవడానికి చాలా ఉంది. ప్రతిపక్షాల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనం ప్రజలకు జవాబుదారీ. ప్రతిపక్షాలు అడిగే ప్రతి ప్రశ్నకు దీటుగా సమాధానమిద్దాం. సభ సజావుగా సాగేందుకు సహకరిస్తే ఎన్ని రోజులైనా సభను నడుపుకుందాం. కానీ అల్లరి చిల్లరి చేష్టలు చేస్తమంటే ఊరుకునేది లేదు. పార్లమెంటులోనే సభకు సహకరించకుంటే బయటికి పంపుతున్నరు. ఇక్కడ కూడా ప్రతిపక్షాలు సభను సాగనివ్వమంటే… ఎట్ల సాగనివ్వాలో అట్ల చేద్దాం.. అని అన్నట్లు తెలిసింది. 28 వరకూ సెలవులు..

అసెంబ్లీ సమావేశాలు బుధవారం ప్రారంభమవుతాయని తర్వాత 28 వరకు సెలవులు ఉంటాయని కేసీఆర్ చెప్పారు. తిరిగి 29వ తేదీ నుంచి మళ్లీ సమావేశాలు జరుగుతాయని.. తర్వాత ప్రతిపక్షాలు విసిగి, వేసారి… పారిపోయేదాకా సమావేశాలు కొనసాగిద్దామంటూ వ్యాఖ్యానించినట్లు తెలిసింది. గత సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఇచ్చిన సమాధానాలకు ప్రతిపక్షాలు నోరు తెరవలేకపోయాయని, ఈసారి కూడా వాళ్లకు ధీటుగా బదులిద్దామన్నారు. అసెంబ్లీ సమావేశాలు సజావుగా సాగేందుకు మజ్లిస్ సహకరిస్తుందని, బీజేపీ కొంత గొడవ చేసినా సభలో ఉండేందుకే వాళ్లు మొగ్గు చూపుతారని, కేవలం కాంగ్రెస్, టీడీపీలు గొడవ చేస్తాయని సీఎం అభిప్రాయపడినట్లు తెలిసింది.

రైతులకు చాలా చేస్తున్నం.. రైతు ఆత్మహత్యల అంశాన్ని ప్రస్తావించిన సీఎం… రైతులకు కావాల్సిందల్లా మనం చేస్తున్నామని అన్నారు. కోతల్లేని కరెంటు ఇస్తున్నం, ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచినం, వ్యవసాయ శాఖతో అనుబంధ విభాగాల్ని నుంచి కూడా సబ్సిడీ మీద పరికరాలు, సేద్యానికి సంబంధించిన చర్యలు తీసుకున్నం. సాగునీటి ప్రాజెక్టులు చేపడుతున్నం అని కేసీఆర్ వివరించారు. అయినా కొందరు ఆత్మహత్య చేసుకుంటున్నరు. అయితే మన రాష్ట్రంలోనే కాదు.. దేశమంతా ఇదే పరిస్థితి ఉంది. పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో కూడా రైతు ఆత్మహత్యలు జరుగుతున్నయి.

రైతు కుటుంబాలను మనం అన్నివిధాలా ఆదుకుంటున్నం. నష్టపరిహారాన్ని దేశంలోనే ఎక్కడాలేని విధంగా రూ.లక్షన్నర నుంచి రూ.ఆరు లక్షలకు పెంచినం.. అని సీఎం అన్నారు. కాంగ్రెస్, టీడీపీ హయాంలో ఏడు వేల మందికిపైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఆ వివరాలు తమ వద్ద ఉన్నాయని, ఆ పార్టీ లు అధికారంలో ఉన్నపుడు ఆ కుటుంబాలకు చేసిందేందో వివరాలన్నింటినీ సేకరించామని సీఎం అన్నట్లు సమాచారం.

సీపీఎం ఉద్దేశం వేరే ఉంది… ఆశా వర్కర్లకు సంబంధించి సీపీఎం చేస్తున్న ఆందోళనపై సీఎం కేసీఆర్ ఒకింత ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. దేశంలో ఒక్క తెలంగాణలోనే ఆశా వర్కర్లు ఉన్నారా? ఏపీలో కూడా ఉన్నారు. రైతు ఆత్మహత్యలు కూడా అక్కడ ఉన్నయి. కానీ ఆ పార్టీ మాత్రం ఇక్కడే ఆందోళన చేయడానికి కారణం ఏంది? మున్సిపల్ కార్మికుల సమ్మె సమయంలోనూ ఏపీలో కాకుండా ఇక్కడే ఎక్కువ చేసినరు. వాళ్ల ఉద్దేశం వేరే ఉంది.. అని అన్నట్లు తెలిసింది. టీడీపీకి వత్తాసు పలుకుతూ సీపీఎం అలా వ్యవహరిస్తుందని, ఆ పార్టీ రాష్ట్ర విభజన సమయంలోనూ తెలంగాణకు వ్యతిరేకంగా పని చేసిందని పేర్కొన్నట్లు సమాచారం. ఇప్పుడు కూడా ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టేందుకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తుందన్నారు.

ఇరిగేషన్ నిధుల్నీ గ్రీన్ ఛానెల్‌లో ఉంచుతాం… ప్రతిపక్షాలు రైతు ఆత్మహత్యలతోపాటు ప్రాజెక్టుల రీడిజైనింగ్ అంశాన్ని లేవనెత్తే అవకాశముందన్న ముఖ్యమంత్రి… దానికి దీటుగా సమాధానం చెప్పేందుకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ సిద్ధంగా ఉందని స్పష్టం చేసినట్లు తెలిసింది. తెలంగాణ జలవిధానంలో భాగంగా ప్రభుత్వం ఏం చేయబోతున్నది, దానివల్ల తెలంగాణకు ఎలా న్యాయం జరుగబోతున్నదనే వివరాల్ని అవసరమైతే సభలోనే పీపీటీ ద్వారా వివరిస్తానని కూడా అన్నట్లు సమాచారం.

ప్రతిఏటా రూ.25వేల కోట్ల మేర సాగునీటి రంగంపై ఖర్చు చేసేందుకు ప్రణాళిక రూపొందించామని, ఈ నేపథ్యంలో జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు తమ పరిధిలో జరుగుతున్న పనుల్ని పర్యవేక్షించాలని సూచించారు. కాళేశ్వరం, పాలమూరు, డిండి వంటి తాజాగా చేపట్టిన ప్రాజెక్టులే కాకుండా ఆన్‌గోయింగ్ ప్రాజెక్టు పనులు వేగంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కాలువలు, బ్యారేజీల పనులు సమాంతరంగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎంత త్వరగా పనులు పూర్తి చేస్తే ఆ మేరకు నిధులు విడుదల చేస్తామని, వాటర్‌గ్రిడ్ లాగే ఇరిగేషన్ నిధుల్ని గ్రీన్‌ఛానెల్‌లో ఉంచుతామని హామీ ఇచ్చారు.

సమావేశాలు ముగియగానే కమిటీలు… అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే పలు కమిటీలు వేసుకుందామని ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్‌ఎస్‌ఎల్పీలో స్పష్టం చేశారు. మార్కెట్ కమిటీ ఛైర్మన్ల రిజర్వేషన్లు పూర్తయినందున జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇన్‌ఛార్జీలు జాబితాను రూపొందించాలన్నారు. దేవాదాయ కమిటీలు కూడా వేసుకుందామని అన్నారు. ముఖ్యంగా పార్టీ రాష్ట్ర, జిల్లా, అనుబంధ కమిటీలను కూడా పూర్తి చేసుకుందామని చెప్పారు. సాధ్యమైనంతవరకు దసరాలోపు వీటిని పూర్తి చేసుకోవాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు పార్టీవర్గాలు తెలిపాయి. అదేవిధంగా … గతంలో రాష్ట్రస్థాయి పార్టీ శిక్షణ తరగతులు నిర్వహించుకున్నామని, ఇప్పుడు జిల్లాలవారీగా పార్టీ శిక్షణ తరగతులు నిర్వహించుకుందామని సీఎం తెలిపారు. తెలంగాణభవన్‌లోనే ఈ తరగతులు ఉంటాయన్నారు.

దేశంలోనే మొదటి రాష్ట్రం… మార్కెట్ కమిటీ ఛైర్మన్ పదవుల భర్తీలో రిజర్వేషన్లు అమలు చేసిన రాష్ట్రంగా దేశంలోనే తెలంగాణ ముందు ఉందని సీఎం శాసనసభ్యులకు చెప్పారు. అధికారులు డ్రా పద్ధతిన రూపొందించిన జాబితాను సమావేశంలో వెల్లడించారు. కమిటీలకు రిజర్వేషన్లు అమలు చేసిన అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఆయన సూచించారు. డబుల్ బెడ్‌రూం ఇండ్లపై సీఎం మాట్లాడారు. హడ్కో నుంచి రూ.3,500 కోట్ల రుణం వస్తున్నదని, ఈ ఏడాది నియోజకవర్గానికి 400 ఇండ్ల చొప్పున నిర్మించుకుందామని అన్నారు. వచ్చే ఏడాది నియోజకవర్గానికి వెయ్యి ఇండ్ల చొప్పున చేసుకుందామని తెలిపారు. శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్‌గా నేతి విద్యాసాగర్‌రావును కొనసాగించాలని సమావేశంలో సూత్రప్రాయంగా నిర్ణయించారు. విద్యాసాగర్‌రావుకు మాట ఇచ్చినందున..ఆ మేరకు ఆయన్నే కొనసాగించాలని నిర్ణయించినట్లుగా సీఎం అన్నట్లు తెలిసింది.

చేసిందే చెప్పుకుందాం… రాష్ట్రంలో ఇంటింటికీ నల్లా నీళిస్తన్నం. రూ.75వేల కోట్లతో సాగునీటి రంగాన్ని బలోపేతం చేస్తున్నం. 24 గంటల కరెంటు ఇచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నం. ఇవన్నీ పూర్తయితే మనం వద్దన్నా జనం మనకే ఓట్లేస్తరు. 2019లోనూ అధికారం మనదే. ఆ బాధ్యత నాకు వదిలేయండి. మం త్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అన్ని అంశాలపై అవగాహన పెంచుకోండి. దేశంలోనే ఏ రాష్ట్రంలో అమలు చేయని సంక్షేమాన్ని మనం చేస్తున్నం. ప్రజల్లోకి వెళ్లి చెప్పండి. దేన్నీ ఆషామాషీగా తీసుకోవద్దు… అని రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పార్టీ ప్రజాప్రతినిధులకు స్పష్టం చేశారు.

40 మందికి అందిన బీమా… సమావేశంలో మంత్రి హరీశ్‌రావు పార్టీ సభ్యుల బీమా అంశంపై మాట్లాడారు. పార్టీకి 50 లక్షల సభ్యత్వం ఉండగా… వారందరికీ బీమా వర్తింపజేశామని, ఇందుకు రూ.ఐదు కోట్ల మొత్తాన్ని ఇన్సూరెన్స్ కంపెనీలకు చెల్లించామని చెప్పారు. దురదృష్టవశాత్తు ఇప్పటివరకు 200 మంది పార్టీ సభ్యులు రోడ్డు ప్రమాదాల్లో మరణించినట్లుగా సమాచారం ఉందన్నారు. వీరికి బీమా అందేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఈ దిశగా ఇప్పటికే 40 మంది సభ్యుల కుటుంబీలకు బీమా మొత్తాన్ని అందించామన్నారు. ఈ సమయంలో పార్టీ అధ్యక్షుడుగా రాసిన లేఖ జతపరచాలని అభిప్రాయం రాగా ముఖ్యమంత్రి అందుకు అంగీకరించనట్లు తెలిసింది. ఆ బీమా మొత్తాన్ని సంబంధిత మంత్రి, ఎమ్మెల్యే, పార్టీ అధ్యక్షులుగా నేరుగా మృతుని కుటుంబం వద్దకు వెళ్లి ఇవ్వాలని, దీనికి ప్రచారం అవసరంలేదని అన్నట్లు తెలిసింది.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.