Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

వండర్ ఐపాస్

రాష్ర్టాన్ని పారిశ్రామికంగా కొత్త పుంతలు తొక్కించేందుకు రంగం సిద్ధమైంది! పారిశ్రామికవేత్తలు కంపెనీలు స్థాపించాలంటే అనుమతుల కోసం ఇక వెంపర్లాడాల్సిన పనిలేదు! పదుల సంఖ్యలో కార్యాలయాలు చుట్టూ ప్రదక్షిణలు చేసి.. లంచాలు ముట్టజెప్పాల్సిన అవసరం రాదు! నెలల తరబడి ఎదురుచూసే ప్రసక్తే ఇక ఎదురు కాదు! దానికి బదులుగా పరిశ్రమలు పెట్టేందుకు వచ్చేవారికి ఎదురేగి స్వాగతం పలికే వ్యవస్థ వచ్చేసింది! పదిహేను రోజుల్లోపే అనుమతులు ఇచ్చే విధానం సాక్షాత్కరించింది!

-రాష్ట్ర నూతన పారిశ్రామిక విధానం ఆవిష్కరణ.. పారిశ్రామికవేత్తల హర్షాతిరేకం -వందశాతం కరప్షన్ ఫ్రీ..15 రోజుల్లోనే అనుమతులు -పారిశ్రామికవేత్తలను ఎయిర్‌పోర్టులోనే రిసీవ్ చేసుకుంటాం -రెండోసారి కలిసేలోగా అన్ని అనుమతులు ఇస్తాం -అధికారులు నిర్లక్ష్యం చేస్తే రోజుకు వెయ్యి జరిమాన -టీఎస్ ఐపాస్ ఆవిష్కరణ సభలో సీఎం కేసీఆర్

CM KCR unveiled the Telangana State industrial policy

ఒకసారి కలిసి దరఖాస్తు ఇస్తే.. మరోసారి కలిసేసరికి అనుమతి పత్రాలు చేతుల్లో పెట్టే అపురూపమైన ఇండస్ట్రియల్ పాలసీ.. పారిశ్రామికవేత్తలకు వరంగా ముందుకొచ్చింది! ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా.. అత్యంత సరళమైన.. పారదర్శకమైన.. పటిష్ఠమైన నూతన పారిశ్రామిక విధానం టీఎస్-ఐపాస్‌ను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు దేశంలోనే ప్రఖ్యాత పరిశ్రమ దిగ్గజాలు, వివిధ దేశాల రాయబారుల సమక్షంలో ఆవిష్కరించారు. ఈ విధానానికి ముగ్ధుడైన దేశంలోనే అతిపెద్ద వ్యాపారాల సముదాయాల సంస్థ ఐటీసీ చైర్మన్ దేవేశ్వర్.. రాష్ట్రంలో 8 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెడతామని ప్రకటించారు.

ఆయనతోపాటే అనేక మంది ఇటువంటి పారిశ్రామిక విధానాన్ని మునుపెన్నడూ చూడలేదంటూ రాష్ట్రంలో పెట్టుబడులపై తమ ఆసక్తి చాటారు. పొరుగు రాష్ర్టానికి వెళదామని అనుకుని కూడా.. ఈ విధానం చూసి ఇక్కడే కంపెనీ స్థాపించాలని నిర్ణయించుకున్నామని ప్రకటించారు. శుక్రవారం ఈ అపురూప సన్నివేశానికి రాజధాని నగరంలోని హైటెక్స్ సెంటర్ వేదికైంది. దాదాపు 2500 మంది పారిశ్రామికవేత్తలు, ప్రముఖులు హాజరైన ఈ కార్యక్రమం బంగారు తెలంగాణ నిర్మాణానికి గట్టి పునాది వేసింది. ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి కేసీఆర్.. నూతన పారిశ్రామిక విధానంలో వందశాతం అవినీతి రహితంగా పరిశ్రమలకు అనుమతులు ఇస్తామని ప్రకటించారు. దరఖాస్తు చేసిన 10, 12 రోజుల్లోనే అనుమతులు ఇస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రం పారిశ్రామికవేత్తలకు, వ్యాపారవేత్తలకు రెడ్‌కార్పెట్ పరుస్తుందని చెప్పారు.

పరిశ్రమలస్థాపనకోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే అన్ని అనుమతులు నిర్ణీత సమయంలోగా వస్తాయని ఆయన వెల్లడించారు. తమ అధికారులు ఎలాంటి భేషజాలకు వెళ్లకుండా తెలంగాణ ఆత్మతో పని చేస్తారని సీఎం చెప్పారు. నూతన పారిశ్రామిక విధానం.. టీఎస్ ఐపాస్-2015ద్వారా ఏ విధంగా పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నది కేసీఆర్ వివరించారు. అవి ఆయన మాటల్లోనే..

అధికారులు నిర్లక్ష్యంచేస్తే రోజుకు వెయ్యి జరిమాన ఐటీసీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ దేవేశ్వర్ రూ.8000 కోట్లతో పరిశ్రమలు ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. నేను వెంటనే అధికారులతో అదేందో చూసి, దరఖాస్తులు తీసుకొని అన్ని రకాల అనుమతులు ఇవ్వాలని చెప్పా. నా దగ్గర ఉన్న ఐఏఎస్ అధికారులు బ్యూరోక్రాట్ల్లే కాదు అంతా టెక్నోక్రాట్లు కూడా. వారికి అపారమైన సాంకేతిక పరిజ్ఞానం ఉంది.

తెలంగాణ రాష్ర్టాన్ని అభివృద్ధి చేయడానికి అంకితభావంతో వారు పనిచేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రదీప్‌చంద్ర తయారుచేశారు. పరిశ్రమలశాఖ కార్యదర్శి అరవింద్ కుమార్ ఈ విధానాన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకుపోతున్నారు. పరిశ్రమల శాఖ కమిషనర్ మాణిక్‌రాజ్ బాగా పని చేస్తున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ పర్యవేక్షణలో అధికారులు బాగా పని చేస్తున్నారు.

సీఎం కార్యాలయంలోనే చేజింగ్ సెల్ సీనియర్ ఐఏఎస్ అధికారి శాంతకుమారి నేతృత్వంలో చేజింగ్‌సెల్ ఏర్పాటు చేశాం. మీకు పర్మిషన్లు ఇచ్చేవరకు వెంటాడి అన్ని క్లియరెన్స్‌లతో పర్మిషన్లు చేజింగ్ సెల్ తెప్పిస్తుంది. ప్రొటోకాల్ ఇబ్బందులు ఎదురవకుండా పరిశ్రమలశాఖలో ప్రొటోకాల్ సెల్ ఏర్పాటు చేశా. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో మీరు దిగగానే.. ప్రొటోకాల్ అధికారులు దగ్గర ఉండి మిమ్ముల్ని నేరుగా నా వద్దకు తీసుకువస్తారు. నాతో కప్పు చాయ్ తాగి, మీ పని మీరు చేసుకొని వెళ్లిపోవచ్చు.

బరాబర్ పది పన్నెండు రోజుల్లో పరిశమ్రకు కావల్సిన అన్ని అనుమతులు ఇస్తాం. విద్యుత్, నీటిసరఫరాతోపాటు అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తాం. 15 రోజులకు అటుఇటుగా అన్ని క్లియరెన్స్‌లతో ఉన్న సర్టిఫికెట్ మీ చేతుల్లో పెడతాం. మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. వేచి ఉండాల్సిన అవసరం లేదు. మీరు ఎలాంటి ఫైల్స్ మోయాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ అధికారులు అనుమతులు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తే రోజుకు వేయి రూపాయల చొప్పున పెనాల్టీ విధిస్తాం. ఈ విషయాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ చెప్పారు కదా!

భద్రతకు పెద్దపీట టాటా కన్సల్టెన్సీ (టీసీఎస్) కంపెనీ హైదరాబాద్ సీఇవో రాజన్న తమ క్యాంపస్ వద్ద ఇబ్బందిగా ఉంది, ట్రాఫిక్ జామ్ అవుతున్నదని మంత్రి కేటీఆర్‌కు ఫోన్ చేసిచెప్పారు. అక్కడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని కోరారు. వెంటనే డీజీపీకి అక్కడ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని చెప్పా. ఇప్పుడు అక్కడ పోలీస్ స్టేషన్ ఏర్పాటు అయింది. మేం భద్రతకు పెద్దపీట వేశాం. 1.15 లక్షల సీసీ కెమెరాలు నగరంలో ఏర్పాటు చేస్తున్నాం. వంద షీటీమ్స్ ఏర్పాటు చేశాం.

రోమియోల ఆగడాలను ఇప్పటికే అరికట్టాం. నగరంలో ఈవ్‌టీజింగ్స్ తగ్గిపోయాయి. తెలంగాణ దేశంలోనే యంగెస్ట్ అండ్ న్యూస్టేట్. లా అండ్ ఆర్డర్ కంట్రోల్‌లో ఉంది. నగరంలో చాలామంది ప్రత్యేకంగా మహిళా పోలీస్ స్టేషన్లు ఏర్పాటుచేయాలని అన్నారు. ప్రత్యేక పోలీస్ స్టేషన్లు లేవు. అలాంటి ఆలోచన లేదు కానీ 33శాతం మహిళా పోలీసులను రిక్రూట్ చేసుకుంటాం. తెలంగాణ చాలా విషయాల్లో ముందుంది. ప్లగ్ అండ్ ప్లే ఇండస్ట్రియల్ పాలసీ, బ్యూటిఫుల్ సిటీ.. తెలంగాణలో అన్ని సౌకర్యాలు ఉన్నాయి.

ఫార్మా యూనివర్సిటీ ఏర్పాటు తెలంగాణ వెరీ యంగెస్ట్ స్టేట్. తెలంగాణ వచ్చిన తరువాత ఎలా ఉందనేది రతన్ టాటా చూస్తున్నారు. ఆయన ఇక్కడకు వచ్చినప్పుడు రెండు రాష్ట్రాల సీఎంలను అభినందించారు. ఆయన ప్రోత్సాహం మనందరికీ ఉండాలి. దేశంలో తెలంగాణ రాష్ట్రం చాలా విషయాల్లో ముందుంది. తెలంగాణ ఆర్థిక పరిస్థితి బ్రహ్మాండంగా ఉంది. దేశంలో ఫార్మా ఉత్పత్తుల్లో మూడోవంతు ఇక్కడినుంచే ఉత్పత్తి అవుతున్నాయి. అందుకే ఫార్మాసిటీని ఏర్పాటు చేశాం. దీంట్లో ఫార్మా యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేస్తున్నాం.

నో బ్రోకర్స్ నేను ఇటీవల సింగపూర్ వెళ్లాను. అక్కడ తెలంగాణ పారిశ్రామిక పాలసీ గురించి వివరిస్తే.. మీరు చెప్పిన దాంట్లో 50 శాతం చేసినా చాలు మేము అక్కడకు వస్తాం అని అక్కడివాళ్లు చెప్పారు. మీరు రాజకీయ అవినీతిని అరికట్టవచ్చు కానీ బ్యూరోక్రాట్ల అవినీతి గురించి ఏమిటి? పారిశ్రామిక విధానం ప్రకారం పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులు ఇవ్వడంలో ఏ మాత్రం ఆలస్యం అయినా అధికారులకు జరిమానా విధిస్తాం. మా అధికారులు తెలంగాణ పునర్నిర్మాణం కోసం నిబద్ధతగా పని చేస్తున్నారు. మా అధికారులు కమిట్‌మెంట్‌తో పని చేస్తున్నారు. హైదరాబాద్ మోర్ హ్యాపెనింగ్ సిటీ. గ్లోరియస్ కాస్మోపాలిటన్ సిటీ.

వందశాతం అవినీతి రహితంగా అన్ని అనుమతులు ఇస్తాం. నో బ్రోకర్స్. తెలంగాణ వ్యాపార వర్గాల ఆశీస్సులను ప్రభుత్వం కోరుకుంటుంది. మాకు మీ దీవెనలు కావాలి. మేం హైప్ క్రియేట్ చెయ్యం. ప్రచారం మాకు అవసరం లేదు. ప్రచారం చేసుకునే సీఎంను కాదు, పని మాత్రమే చేస్తాను. నా చెల్లెలు సంగీతరెడ్డి గతంలో ఫిక్కి నుంచి వచ్చి నన్ను కలిసి కొన్ని డిమాండ్లు చేశారు. చూద్దామని అన్నాను. ఆమె ఆశ్చర్యం వ్యక్తంచేశారు. చేయకున్నా పనులు చేస్తానని చెప్పేవాడిని కాదు. చూద్దామన్నాను. చేయగలిగేవే చెప్తున్నా.

నేను బక్క సీఎంను.నా పక్కన పొట్టి మంత్రి (జగదీశ్‌రెడ్డిని ఉద్దేశించి) ఉన్నాడు. ఇద్దరం కలిసి వండర్స్ చేశాం. విద్యుత్ సమస్య లేకుండా చేశాం. జెన్‌కో చైర్మన్ ప్రభాకర్‌రావు ప్రతిభతో, విద్యుత్ ఉద్యోగుల కృషివల్ల మేము ఈ సమస్యను విజయవంతంగా అధిగమించాం. జెన్‌కో చైర్మన్ ప్రభాకర్‌రావుకు అభినందనలు. విద్యుత్ అధికారులు, ఉద్యోగులకు కూడా అభినందనలు. అందరికీ ధన్యవాదాలు.. అంటూ సీఎం తన ప్రసంగం ముగించారు.

అంతకు ముందు టీఎస్ ఐపాస్-2015 ఆవిష్కరణ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్, ఐటీసీ కాకతీయ చైర్మన్ దేవేశ్వర్, మంత్రులు, అధికారులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. 12.02 గంటలకు ఇండస్ట్రియల్ పాలసీ పుస్తకాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. ఆ తరువాత 12.10 గంటలకు టీఎస్ ఐపాస్ వెబ్‌సైట్, 12.18 గంటలకు సోలార్ పవర్ పాలసీ-2015ను సీఎం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమలశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఐటీశాఖ మంత్రి కేటీ రామారావు, విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి,

ఎంపీ కే కేశవరావు, ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలచారి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్సీలు బోడకుంటి వెంకటేశ్వర్లు, సలీమ్, టీఎస్‌పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ రాజీవ్‌శర్మ, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి ప్రదీప్‌చంద్ర, పరిశ్రమలశాఖ కార్యదర్శి అరవింద్ కుమార్, ఐటీశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్, పరిశ్రమలశాఖ ప్రభుత్వ సలహాదారు పాపారావు, డీజీపీ అనురాగ్‌శర్మ, జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్, సీఎంవో ముఖ్యకార్యదర్శి నర్సింగ్‌రావు, కార్యదర్శులు స్మితాసబర్వాల్, రాజశేఖర్‌రెడ్డి, చేజింగ్ సెల్ ఇన్‌చార్జి శాంతకుమారి, పరిశ్రమల శాఖ కమిషనర్ మాణిక్‌రాజ్, పరిశ్రమలశాఖ వీసీ అండ్ ఎండీ వెంకట్రామిరెడ్డి, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

సోలార్ వపర్ పాలసీని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్ రాష్ట్రంలో 10వేల మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు వెళుతున్నది. ఇందుకోసం ప్రత్యేకంగా సోలార్ పవర్ పాలసీని అవిష్కరించింది. టీఎస్ ఐపాస్ ఆవిష్కరణ కార్యక్రమంలోనే ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పారిశ్రామికవేత్తల సమక్షంలో సోలార్ పవర్ పాలసీని ప్రకటించారు. ఈ విధానం ప్రకారం రాష్ట్రంలో సోలార్ పవర్ ప్రాజెక్టులు నెలకొల్పడానికి ముందుకు వచ్చే ఔత్సాహికులకు ప్రత్యేక రాయితీలు, వసతులను ప్రభుత్వం కల్పిస్తుంది. పవర్ ప్రాజెక్టులకు వందశాతం బ్యాంక్ గ్యారెంటీ ఉంటుంది.

2శాతం బ్యాంకింగ్ చార్జీలను విద్యుత్ సరఫరా చేసే సమయంలో సర్దుబాటు చేస్తారు. పవర్‌ప్రాజెక్టు ఒప్పందాలు గరిష్ఠంగా రెండు సంవత్సరాలు ఉంటాయి. ఒక్క మెగావాట్ విద్యుత్ ఉత్పత్తికి 5 ఎకరాల భూమి కేటాయిచాలని నిర్ణయించింది. సోలార్ పవర్ ప్రాజెక్టులు, పార్కులకోసం కేటాయించిన భూములకు ల్యాండ్ సీలింగ్ వర్తించబోదని ఈ పాలసీ స్పష్టం చేసింది. సోలార్ ప్రాజెక్టులకు సత్వరం అనుమతులు వచ్చేలా ఫాస్ట్‌ట్రాక్ సెల్ ఏర్పాటు చేశారు.

ఈ సెల్‌లో సోలార్ పవర్ ప్రాజెక్టులు ఏర్పాటు చేయడానికి దరఖాస్తు చేసిన 21 పనిదినాలలోపు విద్యుత్ ఉత్పత్తికి అనుమతి ఇస్తారు. లేని పక్షంలో అనుమతి వచ్చినట్లే భావించాలి. ఒక మెగావాట్ ఉత్పత్తికోసం ప్రాజెక్టులు పెట్టే వారికి సింగిల్ విండో ద్వారా రూ.10వేల ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది. ప్రాజెక్టు మొత్తం క్లియరెన్స్‌లకు గరిష్ఠంగా రూ.2లక్షల ఫీజు ఉంటుంది.

పంచాయతీలలో 14 రోజులలో అనుమతులు ఇప్పిస్తారు. ఒక్క ఎకరాకు రూ.25 వేల డెవలప్‌మెంట్ చార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. మిగతా చార్జీలు ఉండవు. క్యాప్టివ్ పవర్‌కోసం రాష్ట్ర పరిధిలో ట్రాన్స్‌మిషన్, డిస్ట్రిబ్యూషన్ చార్జీలకు మినహాయింపు ఇస్తారు. థర్డ్ పార్టీకి విద్యుత్ విక్రయిస్తే అన్ని చార్జీలు వర్తిస్తాయి. క్యాప్టివ్ విద్యుత్ వినియోగానికి ఎలక్ట్రిసిటీ డ్యూటీ మినహాయింపు ఉంటుంది. ప్రాజెక్టులకు క్రాస్ సబ్సీడీ వందశాతం ఉంటుంది. కంపెనీలు చెల్లించిన స్టాంప్‌డ్యూటీని, వ్యాట్‌ను తిరిగి వందశాతం చెల్లిస్తారు.

ప్రాజెక్టు మానిటరింగ్ కమిటీ ఏర్పాటు సోలార్ పవర్ ప్రాజెక్టుల ప్రగతిని పరిశీలించడానికి మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ కమిటీకి చైర్మన్‌గా ఇంధనశాఖ కార్యదర్శి ఉంటారు. టాన్స్‌కో సీఎండీ, టీఎస్‌ఎస్‌పీడీసీఎల్ సీఎండీ, టీఎస్‌ఎన్‌పీడీసీల్ సీఎండీ, టీఎన్‌ఆర్‌ఈడీసీఎల్ బీసీ అండ్ ఎండీ/డైరెక్టర్ కమర్షియల్, ఫ్యాప్సీ, సీఐఐ, ఫిక్కీలనుంచి రోటేషన్ పద్ధతిలో ఇద్దరు సభ్యులు, ఇద్దరు సోలార్ పవర్ డెవలపర్స్ కమిటీ సభ్యులుగా ఉంటారు.

పారిశ్రామికవేత్తలతో కలిసి సీఎం కేసీఆర్ భోజనం పారిశ్రామికవేత్తలతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ భోజనం చేశారు. ఐటీసీ చైర్మన్ పద్మభూషణ్ అవార్డు గ్రహీత దేవేశ్వర్, రుయాగ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ పవన్‌రుయా, జీఎమ్మార్ గ్రూప్ చైర్మన్ గ్రంధి మల్లికార్జునరావు, అపోలోగ్రూప్ చైర్మన్ ప్రతాప్‌ సీ రెడ్డి, జీవీకే చైర్మన్ జీవీ కృష్ణారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌వర్మలతో సీఎం ముచ్చటపెడుతూ మధ్యాహ్న భోజనం చేశారు. నూతన పారిశ్రామిక విధానం పాలసీ-2015 ఆవిష్కరణ తర్వాత ప్రత్యేక గదిలో భోజనం చేశారు. పారిశ్రామిక పాలసీ చాలా బాగుందని, పారిశ్రామికంగా తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందుతుందని వారు అన్నారు. మీ దీవెనలు తెలంగాణకు కావాలని ఈ సందర్భంగా సీఎం వారిని కోరారు.

 

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.