Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

యాదాద్రికి విశ్వఖ్యాతి

-నభూతో నభవిష్యతిలా.. ఆలయ పునఃప్రతిష్ఠ మహోత్సవం
-1008 హోమగుండాలతో ప్రతిష్ఠాపనోత్సవాలు
-ఏకకాలంలో 6,500 మంది రుత్వికుల వేదపఠనం
-వెయ్యేండ్లు గుర్తుండిపోయేలా ఆలయ పనులు
-యాదాద్రి సందర్శనలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు
-మరో పదిహేను రోజుల్లో మళ్లీ వస్తానని వెల్లడి
-వెయ్యి ఎకరాల్లో టెంపుల్ సిటీ నిర్మాణం
-భూసేకరణకు రూ.70 కోట్లు విడుదల
-స్వామివారి తెప్పోత్సవానికి గండి చెరువు
-60 ఎకరాల్లో ప్రవచన మండపాలు
-బస్వాపూర్ ప్రాజెక్టువద్ద హోటళ్లు, థియేటర్లు

అద్భుత దివ్యక్షేత్రంగా యాదాద్రి ఆలయ విస్తరణ పనులు శరవేగంగా సాగుతున్నాయని, విశ్వఖ్యాతిని గడించేలా యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం ఉండబోతున్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పారు. యాదాద్రి దేవాలయ పునఃప్రతిష్ఠ మహోత్సవం దేశంలో ఎక్కడా చేయనివిధంగా 1008 హోమగుండాలతో ప్రపంచంలో, దేశం నలుమూలల్లో ఉన్న శ్రీవైష్ణవ సంప్రదాయం పాటించే పెద్దలతో నిర్వహిస్తామని తెలిపారు. చినజీయర్‌స్వామి ఆధ్వర్యంలో బద్రినాథ్ వైష్ణవ పండితులతోపాటు 133 దేశాలనుంచి వైష్ణవ పండితులు ఈ ప్రతిష్ఠాపన మహోత్సవానికి తరలివస్తామని లేఖలు రాశారని వివరించారు. 6,500 మంది రుత్వికులు ఏకకాలంలో వేదపఠనం చేస్తారని, వారి సహాయకులే దాదాపు రెండుమూడు వేల మంది ఉంటారని తెలిపారు. పునఃప్రతిష్ఠాపన సమయంలో ఐదు లక్షల నుంచి 15 లక్షలమంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉందని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని ఓ కార్యకర్తలా తానే దగ్గరుండి జరిపిస్తానని అన్నారు. ఆలయ నిర్మాణం ప్రపంచదేశాలు అబ్బురపడేలా, వెయ్యేండ్లు గుర్తుండేలా ఉంటుందని చెప్పారు. ఇప్పుడు ప్రారంభం, అప్పుడు ప్రారంభం అంటూ మీడియా, పత్రికాసోదరులు వార్తలు రాయవద్దని కోరారు.

ఇంత పెద్ద గొప్పకార్యం రెండుమూడు నెలల్లో పూర్తయ్యేదికాదన్న కేసీఆర్.. ఎప్పుడు ప్రారంభమవుతుందో స్వయంగా తానే వచ్చి చెప్తానని, అప్పటివరకు ప్రారంభోత్సవంపై ఎలాంటి వార్తలు రాయొద్దని సూచించారు. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ విస్తరణ పనులను ఆదివారం వైడీటీఏ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఆయన మళ్లీ పది పదిహేను రోజుల్లో యాదాద్రి సందర్శనకు వస్తానని చెప్పారు. తొలుత యాదాద్రిపై హెలికాప్టర్‌లో విహంగవీక్షణం చేశారు. కొండపై మహారాజ గోపురాలు, ప్రాకారాలను అణువణువు పరిశీలించారు. అనంతరం పెద్దగుట్టపై నిర్మాణమవుతున్న టెంపుల్‌సిటీలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. కేవలం శని, ఆదివారాల్లోనే 70 వేలమంది భక్తులు వస్తున్నారంటే ఈ ఆలయానికి ఎంత మహిమ ఉందో అర్థమవుతున్నదన్నారు. ఇంత గొప్పక్షేత్రం సమైక్య రాష్ట్రంలో వివక్షకు గురైందని ఆవేదన వ్యక్తంచేశారు. మన ఆలయాలను, సంస్కృతిని, సంస్కారాన్ని కాపాడుకునేందుకు ఆరాటపడుతున్నామని తెలిపారు. యాదాద్రి దేవాలయాన్ని మరింత అద్భుతంగా తీర్చిదిద్దేందుకు గొప్పగా నిర్మాణ పనులు చేపట్టామని చెప్పారు.

విస్తరణ పనుల్లో మరింత వేగం
ఆలయ విస్తరణ పనుల్లో వేగం మరింత పెంచాల్సిన అవసరం ఉన్నదని సీఎం కేసీఆర్ చెప్పారు. మండపాలు, గోపురాలు, పురవీధుల పనులు అద్భుతంగా ఉన్నాయన్నారు. గాలిగోపురం పూర్తిగా శిలలతోనే నిర్మిస్తున్నామని వివరించారు. శివాలయం, గర్భాలయం, మండప నిర్మాణంతోపాటు అన్ని ప్రాంతాల్లో కృష్ణ శిలలను వాడుతున్నామని చెప్పారు. పనులు పూర్తయ్యాక అద్భుతమైన దివ్యక్షేత్రంగా యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామివారి దేవస్థానం భక్తులకు సాక్షాత్కారం అవుతుందని తెలిపారు. ఆలయ విస్తరణ పనులకు 173 ఎకరాల భూమిని సేకరిస్తున్నామని, ఇందుకు రూ.70 కోట్లు మంజూరుచేశామని సీఎం చెప్పారు. ఇందులో ఉత్తరభాగంలో ఆలయ కిందివైపు 30 ఎకరాలు గండిచెరువు కింద ఉన్నదని, ఈ చెరువును స్వామివారి తెప్పోత్సవానికి ఉపయోగిస్తామని వెల్లడించారు. జూన్‌లో కాళేశ్వరం నుంచి యాదాద్రి కొండ కింద యాదగిరిపల్లిలో ఉన్న గండిచెరువులోకి స్వచ్ఛమైన నీళ్లు వస్తాయని చెప్పారు. చెరువుల చుట్టు చెట్లు, లైట్లతోపాటు రోడ్డుతో అందంగా తీర్చిదిద్దుతామని, స్వచ్ఛమైన నీటితోకూడిన గండిచెరువును స్వామివారి తెప్పోత్సవానికి ఉపయోగిస్తామని వివరించారు.

నిత్యాన్నదాన సత్రానికి రూ.10 కోట్లు
143 ఎకరాల్లో భక్తులకు నిత్యాన్నదానం సత్రం, బస్‌స్టేషన్, కారు పార్కింగ్, మార్కెట్, క్యూ క్లాంప్లెక్స్ వంటివి నిర్మిస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు. ఇందుకు ఆనందరాజు రూ.10 కోట్ల విరాళం అందజేశారని, మరింత విరాళం ఇచ్చేందుకూ సిద్ధంగా ఉన్నారన్నారు. 15 రోజుల్లో మళ్లీ వస్తానని, చిన్నజీయర్‌స్వామివారిని తీసుకొస్తానని చెప్పారు. ఆలయ నిర్మాణం ఆగమశాస్త్రం ప్రకారం జరుగుతున్నదని స్పష్టంచేశారు. కొద్దిమార్పులు తప్ప పనుల్లో ఎలాం టి మార్పులేదని తెలిపారు. ఆలయం బయట పశ్చిమభాగంలో చేపట్టాల్సిన ఏర్పాట్లపై ఆల య అధికారులతో మాట్లాడినట్టు చెప్పారు.

ప్రపంచంలో యూనిక్‌గా యాదాద్రి
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయం ప్రపంచంలోనే ఒక యూనిక్ టెంపుల్‌గా ఉండబోతుందని సీఎం కేసీఆర్ తెలిపారు. ఇది రెండు, మూడునెలల్లో నిర్మించేది కాదని అన్నారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన యాదాద్రిని పూర్తిగా కృష్ణశిలలతో నిర్మిస్తున్నామని చెప్పారు. ఏడంతస్థుల రాజగోపురాలు సైతం కృష్ణశిలలతో నిర్మించామన్నారు. మండపాలు, టెంపుల్ సంపద చూస్తే ఆషామాషీగా ఉండబోదని అన్నారు. దేవాలయాలు ఒక తరం నుంచి మరో తరానికి సంస్కారం, సంస్కృతిని అందించే గొప్ప కమ్యూనిటీ సంస్థలని సీఎం పేర్కొన్నారు. కొంత మంది నాస్తికులు పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడుతున్నారని, వాటిని నమ్మొద్దని కోరారు.

60 ఎకరాల్లో ప్రవచన మండపాలు
143 ఎకరాల్లో బస్టాండ్, క్యూకాంప్లెక్స్, అన్నదాన సత్రాలు, షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించాక మిగిలిన భూమిలో 50 నుంచి 60 ఎకరాల్లో ప్రవచన మండపాలు నిర్మిస్తామని కేసీఆర్ తెలిపారు. బ్రహ్మోత్సవాల సమయంలో కొండపైన కల్యాణోత్సవానికి స్థలం సరిపోకపోతే కింద నిర్వహించేలా ప్రవచన మండపాలు నిర్మించి ఉపయోగిస్తామని చెప్పారు. త్వరలో డిజైన్ పనులు పూర్తి చేస్తామని తెలిపారు.

బస్వాపూర్ ప్రాజెక్టువద్ద హోటళ్లు, థియేటర్లు
గంధమల్ల, బస్వాపూర్ రిజర్వాయర్ల పనులను పూర్తి చేస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. బస్వాపూర్‌లో అద్భుతమైన కన్వెన్షన్ సెంటర్లు, సినిమా థియేటర్లను నిర్మిస్తామని చెప్పారు. బస్వాపూర్ ప్రాజెక్టు కింద 260 ఎకరాల్లో స్టార్ హోటళ్లను, హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీ మాదిరిగా భవనాలను నిర్మిస్తామన్నారు. గంధమల్ల ప్రాజెక్టులో బోటింగ్ సౌకర్యం ఉంటుందని తెలిపారు. హైదరాబాద్‌కు అతి సమీపంలో ఉన్న యాదాద్రి క్షేత్రం, భువనగిరి ఖిల్లా, కొలనుపాక, జైన దేవాలయాలను ఉమ్మడి లింక్ పర్యాటక కేంద్రాలుగా మార్చనున్నామని చెప్పారు. యాదాద్రికి వచ్చేవాళ్లు ఈ ప్రాంతంలో మరో రెండురోజులు ఉండేలా అన్ని సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు.

రింగురోడ్డు.. 16 ప్రెసిడెన్షియల్ సూట్లు
యాదాద్రికి రింగురోడ్డు మంజూరు చేశామని, త్వరలో పనులు ప్రారంభమవుతాయని సీఎం కేసీఆర్ చెప్పారు. ఇందుకు కావాల్సిన భూసేకరణ పనులు త్వరలో పూర్తవుతాయన్నారు. వీవీఐపీలకోసం 16 ప్రెసిడెన్సియల్ సూట్స్ నిర్మిస్తామన్నారు. ఆలయ ఉద్ఘాటన సమయంలో రాష్ట్రపతి, దేశనాయకులు, ఇతర రాష్ర్టాల నాయకులు, మన రాష్ట్రంలో ముఖ్య నేతలు హాజరవుతారని, వారికి కావాల్సిన వసతులు కల్పించేలా అద్భుతమైన సూట్ల నిర్మాణం చేపడుతామని చెప్పారు.

వెయ్యి ఎకరాల్లో టెంపుల్‌సిటీ
యాదాద్రి టెంపుల్‌సిటీ 1,100 ఎకరాల్లో ఉంటుందని సీఎం కేసీఆర్ తెలిపారు. ఇప్పటికే 832 ఎకరాలు తమ స్వాధీనంలో ఉన్నదని, మరో 250 ఎకరాలు టెంపుల్ వద్ద ఉన్నట్టు చెప్పారు. 354 అధునాతన కాటేజీలు నిర్మించేందుకు 250 ఎకరాల్లో లేఔట్ తయారుచేశామని తెలిపారు. ఒక్కొక్క కాటేజీని రూ.2 కోట్లు, రూ.కోటి, రూ.50 లక్షలు, రూ.25 లక్షలతో నిర్మించేలా లేఔట్ చేశామని చెప్పారు. రూ.2 కోట్లు ఇచ్చి కాటేజీలు నిర్మింపజేయడానికి 43 మంది దాతలు మందుకు వచ్చారని సీఎం కేసీఆర్ వెల్లడించారు. నిర్మాణానికి సహకరించే దాతలకు సముచితస్థానం ఇస్తామని చెప్పారు. క్వార్టర్లను బ్లాకులవారీగా నిర్మిస్తామని, ఒక్కో బ్లాక్‌కు లక్ష్మీనరసింహ, ప్రహ్లాద, అలివేలుమంగ వంటి పేర్లు పెడుతామని తెలిపారు. టెంపుల్‌టౌన్ సర్వాంగ సుందరంగా ఉండేలా, ఒకమొగ్గలా, పువ్వులా నిర్మిస్తామని చెప్పారు.

నాడు అష్టాదశ శక్తిపీఠం జోగుళాంబపై తీవ్రవివక్ష
ఉద్యమ సమయంలో చెప్పాను.. సమైక్య పాలనలో మా నదులు మాకు కాలె, మా పుష్కరాలు మాకు కాలేదన్నాను.. 100 శాతం ఇది నిజమన్నాను. మా దేవతలను దేవుళ్లుగా చూడలేదని చెప్పాను.. ఇందుకు ఒక ఉదాహరణ చెప్తాను.. అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి శ్రీలంకలో ఉన్నది. ఈ అమ్మవారు ఉపాసన చేసేవారు 18 శక్తి పీఠాల్లో ఉపాసన చేయాలి. అలా చేస్తే సంపూర్ణ ఉపాసకులుగా పిలువబడుతారు. అలా చేసేవారు చండీయాగాలు చేసేందుకు అర్హులుగా ఉంటారు. అష్టాదశ శక్తిపీఠాల్లో గద్వాల జిల్లా అలంపూర్‌లోని జోగుళాంబ ఆలయం కూడా ఒకటి. అలాంటి మహాశక్తిపీఠం నాటి సమైక్య పాలకులవల్ల తీవ్ర వివక్షకు గురైంది. 60 ఏండ్లుగా అక్కడికి వచ్చే ఉపాసకులకు సైతం మౌలిక వసతులు కల్పించలేదంటే తెలంగాణ రాష్ట్ర దేవాలయాలపై ఆంధ్రా నేతల వివక్ష ఎంతో ఉందో అర్థమవుతుంది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. జోగుళాంబలో వసతులు కల్పించాం. ఇప్పుడు ప్రతిరోజు జోగుళాంబను 30 వేలమంది భక్తులు దర్శించుకుంటున్నారు అని సీఎం కేసీఆర్ చెప్పారు. మీడియా సమావేశంలో ఎంపీలు జోగినిపల్లి సంతోష్‌కుమార్, డాక్టర్ బూర నర్సయ్యగౌడ్, బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్యేలు జగదీశ్‌రెడ్డి, గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, పైళ్ల శేఖర్‌రెడ్డి, గాదరి కిశోర్, మర్రి జనార్దన్‌రెడ్డి, కంచర్ల భూపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీలు ఎలిమినేటి కృష్ణారెడ్డి, కర్నె ప్రభాకర్, మాజీమంత్రి ఉమామాధవరెడ్డి, స్పెషలాఫీసర్ జీ కిషన్‌రావు, కలెక్టర్ అనితారామచంద్రన్, రాచకొండ సీపీ మహేశ్‌భగవత్, డీసీపీ రామచంద్రారెడ్డి, ఆలయ ఈవో ఎన్ గీత పాల్గొన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.