-ప్రాజెక్టుల పూర్తికి రేయింబవళ్లూ శ్రమిద్దాం.. -అవసరమైతే మూడు షిఫ్టుల్లోనూ పనులు -కాళేశ్వరం మనకు అత్యంత ముఖ్యమైంది -ఈ ప్రాజెక్టుతోనే తెలంగాణ సస్యశ్యామలం -జూన్‌లోగా పంప్‌హౌస్‌లు పూర్తి కావాలి -వచ్చే వానకాలం రైతులకు గోదావరి నీళ్లివ్వాలి -గోదావరి ప్రాజెక్టుల క్షేత్రస్థాయి పరిశీలనలో ముఖ్యమంత్రి కేసీఆర్ -నిర్మాణ పనుల్లో జాప్యం సహించనని హెచ్చరిక -ప్రభుత్వ సహకారంలో ఆలస్యం ఉండదని వెల్లడి -నేడు 6వ ప్యాకేజి అండర్ టన్నెల్ పనుల సమీక్ష


రాత్రి పగలు తేడా ఉండొద్దు.. వచ్చే వానకాలం నాటికి ఎట్టి పరిస్థితిలోనైనా రైతాంగానికి సాగునీటిని ఇచ్చితీరాలి. ప్రాజెక్టుల పరిపూర్తికి నిర్మాణ సంస్థలు యుద్ధప్రాతిపదికన పనులు చేయాలి. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం కావాలన్నా క్షణమాలస్యం చేయకుండా అందిస్తాం అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. బరాజ్‌లు.. పంప్‌హౌస్‌ల నిర్మాణం ఏకకాలంలో పూర్తికావాలని, ఇందుకోసం మూడుషిప్టుల్లో పనులు జరుగాలని చెప్పారు. జూన్‌లోగా అన్ని పంప్‌హౌస్‌ల నిర్మాణం పూర్తికావాలని స్పష్టంచేశారు. తాను మళ్లీ వస్తానని, పనుల్లో పురోగతి లేకపోతే చర్యలు తప్పవని కాంట్రాక్టర్లను హెచ్చరించారు. జలస్వప్నం సాకారమయ్యే దిశగా సాగుతున్న ప్రాజెక్టుల ప్రస్థానం గమ్యానికి వేగంగా చేరాలని సాగునీటిరంగ అధికారులు, ప్రాజెక్టుల నిర్మా ణ సంస్థలను విస్పష్టంగా ఆదేశించారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నిర్మాణంలో భాగంగా గోదావరి నదిపై నిర్మిస్తున్న బరాజ్‌లు, పంప్‌హౌస్‌లు, కాల్వల పనుల పురోగతిని సీఎం గురువారం క్షేత్రస్థాయిలో పర్యటించి తెలుసుకొన్నారు.
భూపాలపల్లి జిల్లా దేవాదుల ఎత్తిపోతల పథకంలోని తుపాకులగూడెం బరాజ్‌తోపాటు, కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డ పంప్‌హౌస్‌లు, బరాజ్‌ల నిర్మాణ పనులను పర్యవేక్షించారు. నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా బరాజ్‌లు, పంప్‌హౌస్‌ల నిర్మాణ పనులు జరుగకపోవడంపై.. సాగునీటి అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులపై ఆగ్ర హం వ్యక్తం చేశారు. రాష్ర్టానికి కాళేశ్వరం ఎత్తిపోతల పథకం అత్యంత ముఖ్యమైన ప్రాజెక్టు. దేశమంతా ఈ ప్రాజెక్టువైపే చూస్తున్నది. ఈ నేపథ్యం లో ప్రభుత్వం కాళేశ్వరం నిర్మాణానికి అధిక ప్రాధాన్యమిస్తున్నది. బరాజ్‌లు, పంప్‌హౌస్‌లు, కాలువల నిర్మాణ పనులు ఏకకాలంలో పూర్తిచేయాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్నది. వచ్చే వానకాలం నుంచి కాళేశ్వరం నుంచి నీరు పారాలి. పక్కా ప్రణాళికతో నిర్మాణపనులను ఇంప్రూవ్ చేయాలి. మిషనరీ, లేబర్, మెటీరియల్ మొబిలైజేషన్ చేసుకోవాలి. బరాజ్‌ల నిర్మాణానికి కొంత టైమ్ తీసుకొన్నా, పంప్‌హౌస్‌లు మాత్రం పూర్తికావాల్సిందే. పంప్‌హౌస్‌లలో ఏర్పాటుచేసిన మోటర్లతో గోదావరి జలాలను బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లకు పంపింగ్చేసి తద్వారా ఆయకట్టుకు నీరందించొచ్చు.
ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యాన్ని గుర్తించి, దానికి అనుగుణంగా పనుల వేగం పెంచాల్సిన అవసరం ఉన్నది అని సీఎం కేసీఆర్ తానే ఇంజినీర్‌గా మారి ఇంజినీర్లకు మార్గదర్శనం చేశారు. గురువారం ఉదయం కరీంనగర్ నుంచి ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి రెండు హెలికాప్టర్లలో ముందుగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చేరుకొన్న ముఖ్యమంత్రి జే చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెంవద్ద రూ.1620 కోట్లతో నిర్మిస్తున్న బరాజ్‌తోపాటు, కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా మహదేవ్పూర్ మండలం మేడిగడ్డ, అన్నారం వద్ద గోదావరిపై నిర్మిస్తున్న బరాజ్‌లు, కన్నెపల్లి వద్ద చేపట్టిన పంప్‌హౌస్ నిర్మాణ పనులను పరిశీలించారు. తుపాకులగూడెం బరాజ్ వద్ద పనులను పర్యవేక్షిస్తున్న సాగునీటి అధికారులకు, నిర్మాణ సంస్థ ప్రతినిధులకు సీఎం కేసీఆర్ క్లాస్ ఇచ్చారు. తుపాకులగూడెం దగ్గర గోదావరి వరద ప్రవాహం గురించి అధికారులతో ఆరాతీశారు. ప్రస్తుతం తుపాకులగూడెం వద్ద 6వేల క్యూసెక్కుల వరద ప్రవాహం ఉందని సాగునీటి శాఖ అధికారులు చెప్పారు. బరాజ్ నిర్మాణం కోసం 1132 మీటర్ల కాఫర్ డ్యాం నిర్మాణం పూర్తి కావొచ్చిందని, మరో 150 మీటర్ల కాఫర్ డ్యామ్ నిర్మించాల్సి ఉందని వివరించారు.
ఇతర బరాజ్‌ల నిర్మాణ పనులతో పోల్చితే తుపాకులగూడెం బరాజ్ నిర్మాణ పనులు బాగా వెనుకబడ్డాయని సీఎం కేసీఆర్ అసహనం వ్యక్తంచేశారు. ప్రభుత్వం ఎప్పటికప్పుడు చెల్లింపులు జరుపుతున్నప్పటికీ బరాజ్ నిర్మాణ పనులు నత్తనడకన సాగటమేమిటని ఆయన నిర్మాణసంస్థ ప్రతినిధులు, అధికారులను నిలదీశారు. మళ్లీ 15రోజుల్లో తుపాకులగూడెం వస్తా… అప్పటి వరకు ప్రోగ్రెస్ కనపడాలి. పనులు ఇంప్రూవ్ కావాలి. లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది అని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. నిర్మాణం జరుగుతున్న బరాజ్ దగ్గర భద్రతాపరమైన చర్యలపై తన వెంట ఉన్న డీజీపీ మహేందర్‌రెడ్డితో చర్చించారు. భద్రతకోసం పక్క రాష్ర్టాల పోలీసు అధికారులతో సమన్వయం చేసుకోవాలని, ఆయా రాష్ర్టాల అధికారులతో సరిహద్దు భద్రతపై ఎప్పటికప్పుడు చర్చిస్తూ రిలేషన్ పెంపొందించుకోవాలని డీజీపీకి సూచించారు. అవసరమైతే డ్రోన్ కెమెరాలతో కూడా సాగునీటి ప్రాజెక్టుల పనులను పర్యవేక్షిస్తూ భద్రతాపరంగా ఎలాంటి సమస్యలు రాకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు డీజీపీ వివరించారు. సాగునీటి ప్రాజెక్టుల వద్దకు వెళ్లడానికి రోడ్ల నిర్మాణం వెంటనే చేపట్టాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.
మేడిగడ్డే కీలకం
తుపాకులగూడెం నుంచి బయలుదేరిన ముఖ్యమంత్రి కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బరాజ్ పనులను పరిశీలించారు. మేడిగడ్డలో ప్రతీరోజు ఆరువేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ చొప్పున.. నెలకు రెండు లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేయాలని నిర్మాణ సంస్థ ప్రతినిధులు, సాగునీటి శాఖ అధికారులను ఆదేశించారు. వచ్చే జూన్‌లోపు మేడిగడ్డ బరాజ్ పనులు గోదావరిలో రివర్ పోర్షన్ వరకు పూర్తి కావాలని, వర్షాకాలంలో గోదావరి ప్రవహిస్తున్న సమయంలో కూడా ఆగకుండా పనులు కొనసాగాల్సిందేనని తేల్చిచెప్పారు. రౌండ్ ది క్లాక్ పనులు కొనసాగాలని, కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బరాజ్ అత్యంత కీలకమైందని పేర్కొన్నారు. వచ్చే వానకాలం నుంచి మేడిగడ్డ నుంచి గోదావరి జలాలను ఎత్తిపోతల ద్వారా ఆయకట్టుకు అందించాలని స్పష్టంచేశారు.
కన్నెపల్లి పూర్తయితేనే కాళేశ్వరం పూర్తయినట్టు మేడిగడ్డ బరాజ్ నిర్మాణ పనుల పరిశీలన అనంతరం కన్నెపల్లి పంప్‌హౌజ్ నిర్మాణ పనులను ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలించారు. వచ్చే జూన్ నెలాఖరులోగా ఈ పంప్‌హౌస్ నిర్మాణ పనులు పూర్తిచేయాలని నిర్మాణ సంస్థ ప్రతినిధులు, అధికారులకు డెడ్‌లైన్ విధించారు. కన్నెపల్లి పంప్‌హౌస్ పూర్తయితేనే కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు ద్వారా నీరు ముందుకు వెళ్తుందని చెప్పారు. కన్నెపల్లి పంప్‌హౌస్‌లో అమర్చే పంపులు తిరిగేందుకు.. 230 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణ పనులను వచ్చే ఫిబ్రవరిలోగా పూర్తిచేయాలని టీఎస్ జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావును సీఎం ఆదేశించారు. కన్నెపల్లి పంప్‌హౌస్ నుంచి అన్నారం బరాజ్ వద్దకు 13.2 కిలోమీటర్ల పొడవున నిర్మించాల్సి ఉన్న పైపులైన్, కాలువ పనులను సమాంతరంగా పూర్తిచేయాలని చెప్పారు. అన్నారం బరాజ్ నిర్మాణ పనుల్లో కూడా మరింత వేగం పెంచాలని ఆదేశించారు. బరాజ్ పనుల పురోగతిని కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ వెంకటేశ్వర్లును అడిగి తెలుసుకున్నారు. బరాజ్‌లు, పంప్‌హౌస్‌ల వద్ద అధికారులు ఏర్పాటు చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు ఛాయాచిత్రాలను తిలకించారు. రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్, కరీంనగర్, పెద్దపల్లి ఎంపీలు బోయినపల్లి వినోద్‌కుమార్, బాల్క సుమన్, మంథని, పెద్దపల్లి ఎమ్మెల్యేలు పుట్ట మధు, దాసరి మనోహర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు భానుప్రసాద్‌రావు, నారదాసు లక్ష్మణరావు, ప్రభుత్వ సలహాదారు జీ వివేక్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, డీజీపీ మహేందర్‌రెడ్డి, నీటిపారుదలశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్కే జోషి, సీఎం అదనపు కార్యదర్శి స్మితాసభర్వాల్, సాగునీటిశాఖ ఈఎన్సీలు మురళీధర్‌రావు, నాగేందర్రావు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ ఆకునూరి మురళి, జాయింట్ కలెక్టర్ అమేయ్‌కుమార్, పెద్దపల్లి ఇంచార్జి కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి, జయశంకర్ భూపాలపల్లి ఎస్పీ ఆర్ భాస్కరన్, ఐడీసీ చైర్మన్ ఈద శంకర్‌రెడ్డి సీఎం కేసీఆర్ వెంట సాగునీటి ప్రాజెక్టుల బాటలో ఉన్నారు.
నేడు అండర్ టన్నెల్ పనుల పరిశీలన శుక్రవారం పెద్దపల్లి జిల్లాలోని ధర్మారం మండలం నందిమేడారం గ్రామాల్లో జరుగుతున్న 6వ ప్యాకేజీ అండర్ టన్నెల్ పనులను సీఎం పరిశీలిస్తారు. తర్వాత కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వద్ద కొనసాగుతున్న ప్యాకేజీ-8 పంపుహౌస్ పనులు, సర్జ్‌పూల్‌ను సందర్శిస్తారు.
ప్రాజెక్టుల రీడిజైనింగ్‌తో మారనున్న రాష్ట్ర ముఖచిత్రం తెలంగాణ ఆవిర్భావం తరువాత తమ ప్రభుత్వం చేసిన ప్రాజెక్టుల రీడిజైనింగ్‌తో రాష్ట్రం దశ, దిశ మారుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు అన్ని అనుమతులను సాధిస్తూ, సమస్యలను అధిగమించి పనులు పూర్తిచేస్తామని పేర్కొన్నారు. ఎన్ని సమస్యలొచ్చినా గోదావరి నీటితో తెలంగాణ రాష్ర్టాన్ని సస్యశ్యామలం చేయటమే లక్ష్యంగా ప్రాజెక్టుల నిర్మాణ సంస్థలు, అధికారులు కృషిచేయాలని ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే రాష్టంలో వ్యవసాయం సుసంపన్నమవుతుందని సీఎం కేసీఆర్ తెలిపారు.
రెండు హెలికాప్టర్లలో సుడిగాలి పర్యటన సాగునీటి ప్రాజెక్టుల బాటలో భాగంగా బుధవారం రాత్రి కరీంనగర్లో బసచేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం ఉదయం నీటిపారుదలశాఖ మంత్రి టీ హరీశ్‌రావుతోపాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి రెండు హెలికాప్టర్లలో ముందుగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చేరుకొని అక్కడ తుపాకులగూడెం బరాజ్‌ను సందర్శించారు. మధ్యాహ్నం 2గంటలకు పెద్దపల్లి జిల్లాలోని మంథని మండలం సిరిపురం వద్దకు చేరుకొన్నారు. మధ్యాహ్న భోజనం చేసిన తరువాత అక్కడ నిర్మిస్తున్న అన్నారం పంప్‌హౌస్ పనులను పర్యవేక్షించారు. అక్కడినుంచి సుందిళ్ల బరాజ్ వద్దకు వెళ్లి, నిర్మాణం జరుగుతున్న తీరును సమీక్షించారు. ఆ తరువాత పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం గోలివాడ దగ్గర నిర్మిస్తున్న సుందిళ్ల పంప్‌హౌస్ పనులను పరిశీలించారు. సాయంత్రం 5.15 గంటలకు రామగుండంలోని ఎన్టీపీసీ టౌన్‌షిప్‌లోని జ్యోతిక గెస్ట్‌హౌస్‌కు చేరుకొని అక్కడే బసచేశారు.