Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

యుద్ధప్రాతిపదికన మల్లన్నసాగర్

-పునరావాసానికి కేసీఆర్ డెడ్‌లైన్ మే 11
-అప్పటికల్లా ఒక్క పనీ పెండింగ్‌లో ఉండొద్దు
-అందరికీ పరిహారం, పునరావాస పత్రాలు అందాలి
-పరిహారం చెల్లింపునకు తక్షణం 650 కోట్లు విడుదల
-పునరావాసం పూర్తిచేసి మే 15న హైకోర్టుకు నివేదిక
-కాళేశ్వరం ప్రాజెక్టు ఆలస్యమైతే రాష్ర్టానికి భారీ నష్టం
-నిర్వాసితులను అన్నివిధాలా ఆదుకుంటున్నాం
-వారి విషయంలో మానవత్వంతో వ్యవహరిస్తున్నాం
-ఉన్నతస్థాయి సమీక్షలో సీఎం కేసీఆర్
-తొమ్మిదిమంది అధికారులకు బాధ్యతలు
-అమెరికా పర్యటన రద్దు చేసుకున్న సీఎస్ జోషి
-రాంపూర్, సింగారం గ్రామాలకు చెందిన 460 మందికి చెక్కుల పంపిణీ
-నేటి నుంచి ముంపు గ్రామాల్లోనే

మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణ పనులను కొనసాగిస్తూనే సహాయ పునరావాస ప్రక్రియను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. లక్ష కోట్ల వ్యయంతో చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అలసత్వం వహించడంపట్ల అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. మల్లన్నసాగర్ నిర్వాసితులకు పరిహారం చెల్లింపు ప్రక్రియపై సీఎం కేసీఆర్ శుక్రవారం ఉన్నతాధికారులతో సమీక్షించారు. పునరావాస చర్యల విషయంలో ఎందుకు ఆలస్యం చేయవలసి వచ్చింది? కోర్టులు ఎన్నిసార్లు అవకాశం ఇస్తాయి? ఈ చిల్లర పంచాయితీలు, కిరికిరీలు ఎన్నిరోజులు? లక్షకోట్లు పెట్టి నిర్మిస్తున్న ప్రాజెక్టు విషయంలో ఆలస్యం అయ్యేకొద్దీ ఎంత భారీ మూల్యం చెల్లించుకోవాల్సివస్తుందో అర్థంకాదా? అని ఆయన అధికారులను ఉద్దేశించి ప్రశ్నించారు. నిర్వాసితులను అన్నివిధాలా ఆదుకునే విషయంలో ప్రభుత్వం ఎంతో చిత్తశుద్ధితో, అత్యంత మానవత్వంతో వ్యవహరిస్తున్న విషయాన్ని సీఎం గుర్తుచేశారు. నిర్వాసితులకు పరిహారం అందించే ప్రక్రియను వెంటనే ముగించే కార్యక్రమాన్ని స్వయంగా పర్యవేక్షించాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషిని సీఎం కోరారు. పునరావాస పనులను ప్రత్యక్షంగా పర్యవేక్షించేందుకు సీఎం ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్‌ను ప్రత్యేకంగా నియమించారు. పరిహార పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టేందుకు గ్రామాలవారీగా శిబిరాలు నిర్వహించాలని, ప్రత్యేక అధికారులను నియమించాలని ఆదేశించారు. దీంతో ఈ నెల 11వ తేదీలోపు పునరావాస పనులను పూర్తిచేయడానికి ఎనిమిది గ్రామాలకు డీఆర్వో, ఆర్డీవో ఆ పైస్థాయి అధికారులను తొమ్మిదిమందిని నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఆరేడునెలల్లో మల్లన్నసాగర్
పరిహారం పంపిణీని వెంటనే ముగించి, యుద్ధప్రాతిపదికన మల్లన్నసాగర్ పనులు చేపట్టాలని సీఎం కేసీఆర్ అన్నారు. యుద్ధం జరుగుతుందా.. అన్నట్టు పనులు చేసి, ఆరేడునెలల్లోనే మల్లన్నసాగర్ నిర్మాణం పూర్తిచేయాలని చెప్పారు. వచ్చే ఏడాది జూన్‌లో రిజర్వాయర్‌లో నీళ్లు నింపాలని అధికారులను ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు మల్లన్నసాగర్ గుండెకాయలాంటిదని సీఎం స్పష్టంచేశారు. ఇంత పెద్ద రిజర్వాయర్ నిర్మించే క్రమంలో కొద్దిమంది భూములు, ఇండ్లు కోల్పోతున్నారు. వారి విషయంలో ప్రభు త్వం ఎంతో సానుభూతితో, మానవత్వంతో వ్యవహరిస్తున్నది. నిర్వాసితులు మెరుగైన పునరోపాధి, పునరావాసం పొందటానికి ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచే ప్యాకేజీని అందిస్తున్నది. రూ.800 కోట్లను మల్లన్నసాగర్ నిర్వాసితులకు పరిహారం, పునరావాసం కార్యక్రమాల కోసమే ప్రభుత్వం ఖర్చుచేస్తున్నది. ఇంతచేసినా కొద్దిమందికి సాయం అందించే విషయంలో జరిగిన జాప్యం వల్ల కోర్టులు తరచూ జోక్యం చేసుకోవాల్సి వస్తున్నది. అది అత్యంత బాధాకరం. ఏనుగు ఎల్లింది.. తోక మిగిలింది.. అనే చందంగా మొత్తం ప్రక్రియలో కొద్దిపాటి పరిహారం ఇవ్వడమే మిగిలింది. దీనిని అలుసుగా తీసుకొని కొంతమంది వ్యక్తులు, ప్రగతినిరోధక శక్తులు ప్రాజెక్టునే ఆపడానికి కుట్రలు చేస్తున్నారు. పరిహారం పంపిణీ ప్రక్రియలో మిగిలిన కొంచెం పనినికూడా త్వరగా పూర్తిచేసి, చిల్లర పంచాయితీని వెంటనే ముగించాలి అని సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు.

పరిస్థితి జటిలం కాకుండా చూడాలన్న హైకోర్టు
మల్లన్నసాగర్ ప్రాజెక్టు పనులు ఆపాలని హైకోర్టు చెప్పలేదని, పనులు కొనసాగిస్తూనే పరిస్థితి జటిలం కాకుండా చూడాలని మాత్రమే ఆదేశించిందని అధికారులు తెలిపారు. అందుకనుగుణంగానే ఇటు ప్రాజెక్టు పనులు, అటు పునరావాస పనులు కొనసాగిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ నిధులతోపాటు రుణం రూపేణా తెచ్చిన నిధులు పెద్ద మొత్తంలో వెచ్చించి కాళేశ్వరం ప్రాజెక్టును అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రభుత్వం నిర్మిస్తున్నది. గోదావరి నది నుంచి సుమారు 290 టీఎంసీలకుపైగా నీటిని తెలంగాణ మాగాణాలకు మళ్లించి 40 లక్షల ఎకరాలకుపైగా సాగులోకి తేవాలని ప్రభుత్వం దృఢసంకల్పంతో పనిచేస్తున్నది. ప్రాజెక్టు పనులు ఆలస్యమయ్యేకొద్దీ వేల కోట్ల రూపాయల వడ్డీ లు పెరిగిపోతాయి. ప్రాజెక్టును త్వరితగతిన పూర్తిచేసి నిర్దేశించిన లక్ష్యాల ప్రకారం నీటిని వినియోగంలోకి తెస్తే తెలంగాణ సస్యశ్యామలం అవుతుంది. వ్యవసాయోత్పత్తులు ఆసాధారణంగా పెరుగుతాయి. అది గ్రామీణ ఆర్థిక విప్లవానికి దోహదం చేస్తుంది. ప్రాజెక్టులపై పెట్టిన పెట్టుబడులు ఫలితాలనిస్తాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అంతగా శ్రద్ధ తీసుకుని అహోరాత్రాలు సమీక్షలు జరుపడం అందుకే. ఇదే కాళేశ్వరం ప్రాజెక్టు కింద 15 టీఎంసీల నీటిని నిల్వచేసే కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్‌ను కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ఆరేడుమాసాల్లో పూర్తిచేయించారు. సుమారు 50 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం కలిగిన మల్లన్నసాగర్ రిజర్వాయర్ కింద 3.3 లక్షల ఎకరాల భూమికి సాగునీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో మల్లన్నసాగర్ రిజర్వాయర్ ఆయువుపట్టు. కరువు ప్రాంతాలైన మెదక్‌లోని అన్ని నియోజకవర్గాలతోపాటు భువనగిరి, ఆలేరు, మేడ్చల్ వంటి ప్రాంతాలకు ఈ రిజర్వాయర్ సాగునీరు అందిస్తుంది. మల్లన్నసాగర్‌పై కొందరు చేస్తున్న చిల్లర మల్లర పంచాయితీలు, కిరికిరీలు తక్షణమే పరిష్కరించి, వచ్చే ఆరేడుమాసాల్లో ప్రాజెక్టును పూర్తిచేసేందుకు యుద్ధప్రాతిపదికన పనిచేయాలని కేసీఆర్ పట్టుదలతో ఉన్నారు. వచ్చే ఏడాది (2020) జూన్ నాటికి మల్లన్నసాగర్‌ను గోదావరి నీటితో నింపాలని ముఖ్యమంత్రి లక్ష్యంగా పెట్టుకున్నారని అధికారులు చెప్తున్నారు. అదేపనిగా ప్రాజెక్టును ఆపడానికి కొందరు పేచీలు లేవనెత్తుతున్నారని, ముంపు బాధితులు వారి వలలో పడకుండా ప్రాజెక్టు పూర్తికావడానికి సహకరిస్తున్నారని అధికారులు అంటున్నారు. సహాయ పునరావాసాలకు సంబంధించి ఒక్క పని కూడా పెండింగులో ఉండకూడదని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారని, ఎవరయినా పరిహారం తీసుకోవడానికి నిరాకరిస్తే వారి జాబితాను కూడా రూపొందించి కోర్టుకు సమర్పించాలని తమకు ఆదేశాలు వచ్చాయని అధికారులు చెప్పారు.

కదిలిన అధికారగణం
మల్లన్నసాగర్ ప్రాజెక్టు పునరావాస చర్యల పర్యవేక్షణ కోసమే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి తన అమెరికా పర్యటనను కూడా రద్దుచేసుకుని, సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. సహాయ పునరావాస పనులకు అవసరమైన మొత్తం రూ.650 కోట్లను ప్రభుత్వం శుక్రవారమే సిద్దిపేట కలెక్టరుకు విడుదలచేసింది. సిద్దిపేట కలెక్టర్ కృష్ణభాస్కర్, రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి ఈ ప్రక్రియ పూర్తిచేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటారని అధికారవర్గాలు తెలిపాయి. సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్ కూడా సంబంధిత జిల్లా కలెక్టర్లతో సమావేశమై ఇప్పటివరకు అందిన పరిహారం వివరాలు తెలుసుకొని, మిగిలినవారికి పరిహారం అందించే కార్యక్రమాన్ని ఖరారుచేశారు. ఈ నేపథ్యంలో సహాయ పునరావాస పనులు జరుగాల్సిన ఎనిమిది గ్రామాల్లో శుక్రవారమే ముమ్మరంగా పనులు మొదలయ్యాయి. రాంపూర్, సింగారం గ్రామాల్లో శుక్రవారం 800 మందికి ఇచ్చే చెక్కుల పంపిణీ మొదలయింది. మిగతా గ్రామాల్లో శనివారం నుంచి ప్రత్యేకాధికారుల సమక్షంలో చెక్కులు పంపిణీ చేయనున్నారు. ఎవరైనా చెక్కులు తీసుకునేందుకు విముఖత చూపితే వారి అభిప్రాయాన్ని వీడియో తీయాలని అధికారులు నిర్ణయించారు. చెక్కులు తీసుకునేందుకు విముఖత చూపేవారి జాబితాను కోర్టుకు సమర్పించాలని సీఎం కేసీఆర్ అధికారులకు సూచించారు. ఎట్టిపరిస్థితుల్లో ఈ నెల 11వ తేదీలోపు ముంపు గ్రామాల బాధితులందరికీ పరిహారం అందజేయాలని, ఈ నెల 15వ తేదీన హైకోర్టు ఆదేశించిన మేరకు పునరావాసం పూర్తిచేసిన నివేదికను అందజేయాలని ఆదేశించారు.

దేశంలోనే మెరుగైన ప్యాకేజీ
సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో భూములు కోల్పోయిన వారికి దేశంలోనే అత్యంత మెరుగైన ప్యాకేజీని తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నది. ముంపు గ్రామాల్లో రైతులు కోల్పోయిన భూములు, వ్యవసాయ కొట్టాలు, బావులు, బోర్‌వెల్స్, చెట్లు, తోటలు, పైపులైన్లకు సంబంధించి ఇప్పటివరకు ప్రభుత్వం పరిహారం అందించింది. పునరోపాధి, పునరావాస ప్యాకేజీ కింద అందిస్తున్న సాయం ఇలా ఉంది.. -కేంద్ర చట్టం ఒక్కో ఇంటికి రూ.1.25 లక్షల వ్యయంతో 60 గజాల స్థలంలో ఇందిరా ఆవాస్ యోజన పథకం గృహాన్ని మంజూరుచేయాలని చెప్తున్నది. -తెలంగాణ ప్రభుత్వం మల్లన్నసాగర్ నిర్వాసితులకు అంతకన్నా నాలుగు రెట్లు ఎక్కువగా.. దేశంలో మరే రాష్ట్రంలో లేనివిధంగా ఒక్కో ఇంటి కోసం రూ.5.04 లక్షల విలువైన 560 అడుగుల డబుల్ బెడ్‌రూం ఇండ్లను నిర్మిస్తున్నది. ఈ ఇండ్లను కూడా ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో కాకుండా గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని ఎడ్యుకేషన్ హబ్ పక్కన 460 ఎకరాల విస్తీర్ణంలో ప్రభుత్వమే నిర్మించి ఇస్తున్నది. గృహాలు వద్దనుకునేవారికి 250 గజాల ఇంటి స్థలం, రూ.5.04 లక్షల నగదు అందిస్తున్నది. -ప్రస్తుతం ఉన్న ముంపు గ్రామంలోని ఇంటి స్థలానికి గజం రూ.1600 చొప్పున లెక్కగట్టి పరిహారం చెల్లిస్తున్నది. -కోల్పోయిన ఇంటికి కూడా శాస్త్రీయంగా లెక్కగట్టి పరిహారం చెల్లిస్తున్నది. -ఒక్కో కుటుంబానికి రూ.7.50 లక్షల పునరావాస ప్యాకేజీ అదనంగా అందిస్తున్నది. -18 ఏండ్లు దాటిన అవివాహితులకు కూడా రూ.5 లక్షల పునరావాస సాయం, 250 గజాల ఇంటి స్థలం ఇస్తున్నది. -పునరావాస ప్యాకేజీ కింద ప్రభుత్వం నిర్మించి ఇచ్చిన ఇంటికి ఆర్డీవో సంతకంతో తాసిల్దార్ పట్టా జారీచేస్తారు. అవసరమైన పక్షంలో ఈ ఇంటిని అమ్ముకొనేందుకు, గిఫ్టుగా కుటుంబసభ్యులకు ఇచ్చేందుకు ఈ పట్టాలు అనుకూలంగా ఉన్నాయి. మల్లన్నసాగర్ నిర్వాసితులకు ప్రభుత్వం అందిస్తున్న పునరోపాధి, పునరావాస కార్యక్రమం కింద గరిష్ఠంగా దాదాపు కోటి రూపాయల వరకు సాయం అందుతున్నది.

కుటుంబాన్ని యూనిట్‌గా తీసుకుంటే..
ఒక్కో కుటుంబానికి అందే మొత్తం : రూ.7.50 లక్షలు ఇద్దరు పెద్ద పిల్లలుంటే అందే మొత్తం : రూ.10 లక్షలు కుటుంబానికి, పెద్ద పిల్లలకు కలిపి వచ్చేవి: 750 గజాల విస్తీర్ణంలో మూడు ప్లాట్లు (ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం రూ.75 లక్షలు) కోల్పోయిన ఇల్లు, ఇంటి స్థలానికి పరిహారం : విస్తీర్ణాన్ని బట్టి

ప్రత్యేకాధికారులు వీరే..
మల్లన్నసాగర్ పరిధిలోని ఎనిమిది గ్రామాల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహించి, నిర్వాసితులకు పరిహారం అందించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. దీనికోసం ప్రత్యేక అధికారులను నియమించారు.

గ్రామాలవారీగా ప్రత్యేకాధికారులు
రాంపూర్ : బీ చంద్రశేఖర్ (డీఆర్వో), ఎం జయచంద్రారెడ్డి (సిద్దిపేట ఆర్డీవో) లకా్ష్మపూర్: బీ చంద్రశేఖర్ (డీఆర్వో), ఎం జయచంద్రారెడ్డి (సిద్దిపేట ఆర్డీవో) బ్రాహ్మణబంజెరుపల్లి: బీ చంద్రశేఖర్ (డీఆర్వో), ఎం జయచంద్రారెడ్డి (సిద్దిపేట ఆర్డీవో) పల్లెపహాడ్: ముత్యంరెడ్డి (గడా ప్రత్యేకాధికారి), ఎం జయచంద్రారెడ్డి (సిద్దిపేట ఆర్డీవో), శ్రీనివాస్‌రెడ్డి (హైదరాబాద్ ఆర్డీవో) ఏటిగడ్డ కిష్టాపూర్: ముత్యంరెడ్డి (గడా ప్రత్యేకాధికారి), ఎం జయచంద్రారెడ్డి (సిద్దిపేట ఆర్డీవో), శ్రీనివాసరావు (సిరిసిల్ల ఆర్డీవో) వేములఘాట్: ముత్యంరెడ్డి (గడా ప్రత్యేకాధికారి), ఎం జయచంద్రారెడ్డి (సిద్దిపేట ఆర్డీవో), రాజాగౌడ్ (సికింద్రాబాద్ ఆర్డీవో), అనంతరెడ్డి (హుస్నాబాద్ ఆర్డీవో) సింగారం : డీ విజయేందర్‌రెడ్డి (గజ్వేల్ ఆర్డీవో), మధుసూదన్ (మల్కాజిగిరి ఆర్డీవో) ఎర్రవెల్లి : గజ్వేల్ ఆర్డీవో డీ విజయేందర్‌రెడ్డి

నిర్వాసితులకు దేశానికే ఆదర్శంగా నిలిచే ప్యాకేజీని తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నది. ఇందుకోసం రూ.800 కోట్లను ఖర్చుచేస్తున్నది. ఇంత చేసినా కొద్దిమందికి సాయం విషయంలో జరిగిన జాప్యం వల్ల కోర్టులు తరచూ జోక్యం చేసుకోవాల్సి వస్తున్నది. అది అత్యంత బాధాకరం. ఏనుగు ఎల్లింది.. తోక మిగిలింది.. అనే చందంగా మొత్తం ప్రక్రియలో కొద్దిపాటి పరిహారం ఇవ్వడమే మిగిలింది. దీనిని అలుసుగా తీసుకొని కొంతమంది వ్యక్తులు, ప్రగతినిరోధక శక్తులు ప్రాజెక్టునే ఆపడానికి కుట్రలు చేస్తున్నారు. పరిహారం పంపిణీ ప్రక్రియలో మిగిలిన కొంచెం పనినికూడా త్వరగా పూర్తిచేసి, చిల్లర పంచాయితీని వెంటనే ముగించాలి. – సమీక్షలో సీఎం కేసీఆర్

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.