Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

యుద్ధానికి పోతున్నా దీవించండి

-వందసీట్లతో అధికారాన్ని చేపట్టబోతున్నాం.. కోనాయిపల్లిలో సీఎం కేసీఆర్
-దేశంలోనే ధనవంతులైన రైతులు, యాదవులు తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నారని చెప్పుకోవాలి
-దళితులు, గిరిజనులు గొప్పగా బాగుపడుతున్న రా్రష్ట్రమని చాటాలి
-నన్ను పెంచింది మీరే.. ఆ కృతజ్ఞత ఎప్పటికీ గుండెల్లో ఉంటుంది
-రెండేండ్లలో సిద్దిపేటకు రైలుకూత వినబడుతుంది
-కాళేశ్వరం జలాలతో వెంకన్నస్వామి పాదాలను అభిషేకిస్తాం
-లక్ష ఓట్ల మెజార్టీతో హరీశ్‌రావును గెలిపించండి
-కోనాయిపల్లి గ్రామస్థులతో ముఖ్యమంత్రి కేసీఆర్
-వేంకటేశ్వరస్వామి ఆలయంలో నామినేషన్ పత్రాలకు ప్రత్యేక పూజలు
-గజ్వేల్ ఆర్డీవో కార్యాలయంలో నామినేషన్ దాఖలుచేసిన సీఎం

కోనాయిపల్లి వెంకన్నస్వామి ఆశీర్వాదం తీసుకొని ఏ కార్యక్రమం చేపట్టినా ఓటమనేదే ఎదురుకాలేదు.. మళ్లీ స్వామివారి ఆశీస్సులు.. మీ దీవెనలతో యుద్ధానికి పోతున్నా.. 100 సీట్లు సాధించి మళ్లీ అద్భుతమైన అధికారాన్ని చేపట్టబోతున్నాం అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. నిండుమనసుతో ఆశీర్వదించాలని కోరారు. బుధవారం మధ్యాహ్నం గజ్వేల్ ఆర్డీవో కార్యాలయంలో ముఖ్యమంత్రి తన నామినేషన్ పత్రాలను దాఖలుచేశారు. అంతకుముందు తనకు ఇష్టదైవమైన సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం కోనాయిపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయంలో నామినేషన్ పత్రాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రం నుంచి రోడ్డు మార్గాన ఉదయం 11.45 నిమిషాలకు కోనాయిపల్లి ఆలయానికి చేరుకున్న సీఎంకు మంత్రి హరీశ్‌రావు, శాసనమండలి చీఫ్‌విప్ పాతూరి సుధాకర్‌రెడ్డి, విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు ఘనస్వాగతం పలికారు. వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతించారు. గుడిలో ప్రదక్షిణలు చేసిన అనంతరం సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావుల నామినేషన్ పత్రాలను స్వామివారి సన్నిధిలో ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో సీఎం వెంట రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్ ఉన్నారు.

పూజల అనంతరం కోనాయిపల్లి గ్రామస్థులనుద్దేశించి ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ.. స్వామి సాక్షిగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా.. జీవితంలో నాకు ఇంతకన్న పెద్ద కోరికలు లేవు. భారతదేశంలోనే గొప్ప రైతులు, ధనవంతులైన రైతులు, ధనవంతులైన యాదవులు ఎక్కడ ఉన్నారంటే.. తెలంగాణ రాష్ట్రంలోనే అని చెప్పుకోవాలి. దళితులు, గిరిజనులు చాలా గొప్పగా బాగుపడుతున్న రా్రష్ట్రం ఏదంటే అది తెలంగాణ అని చాటాలి అన్నారు. దళితులు, గిరిజనుల అభివృద్ధికి ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయని, ఇంకా చేయాల్సినవీ ఉన్నాయని చెప్పారు. దేశంలోనే అతి ఎక్కువ ఆర్థికప్రగతి సాధించాం.. 24 గంటలు కరంట్ అందిస్తున్నాం. అతికొద్ది సమయంలోనే ఇవన్నీ సాధించుకున్నాం. స్వామివారి దయవల్ల రాబోయే రోజుల్లో మరిన్ని చేసుకుంటాం అని కేసీఆర్ పేర్కొన్నారు. వేంకటేశ్వరస్వామి ఆశీస్సులతో ఏ పనిచేపట్టినా విజయం సాధించాం.

స్వామివారి ఆశీస్సులు.. మీ అందరి దీవెనలు పొంది. తెలంగాణ సాధించాం. రాష్ట్ర ఏర్పాటుకోసం బయలుదేరినరోజు ఇక్కడికి వచ్చి పూజలుచేసి వెళ్లి డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేశాను. ఎవరికీ నమ్మకం లేనటువంటి పరిస్థితుల నుంచి నేడు రాష్ర్టాన్ని సాధించుకున్నాం. ఆ తరువాత ఒక్కొక్క సమస్యనూ పరిష్కరించుకుంటూ వస్తున్నాం. మనమందరం కష్టసుఖాల్లో పాలుపంచుకున్నాం. ఆనాడు కరంట్ బాధలు ఎట్లా ఉండేవి? మోటర్లు ఎలా కాలిపోతుండె! ఎన్ని అవస్థలు, ఎన్ని బాధలు పడ్డమో మనకు తెలుసు. అవన్నీ కూడా స్వరాష్ట్రంలో పోయాయి. రైతులు అన్నిరకాలుగా బాగుండి, అప్పులు లేకుండా ఐదు, పది లక్షలు బ్యాంకులో ఉండేట్టుగా తెలంగాణ రాష్ట్రం తయారయింది అని చెప్పారు.

రెండేండ్లలోపు సిద్దిపేటకు రైలు కూత
సిద్దిపేటను జిల్లా చేసుకున్నాం.. సాగునీరు వస్తున్నది.. హరీశ్‌రావు మంచిగా పనిచేస్తున్నాడు.. ఇక రెండేండ్లలో సిద్దిపేటకు రైలు కూత కూడా వినపడనున్నది. బ్రహ్మాండంగా రైల్వేస్టేషన్ కుడా రాబోతున్నది అని కేసీఆర్ చెప్పారు. విమానాలు తప్ప ఏం తేవాలో అవన్నీ తెచ్చుకున్నామన్న సీఎం.. మున్ముందు విమానాలూ తెచ్చుకుందామని నవ్వుతూ వ్యాఖ్యానించారు.

ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే
ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే.. మీ మధ్య నుంచే ఇంతగా పెరిగా.. నన్ను పెంచింది మీరే.. ఆ కృతజ్ఞత ఎప్పటికీ నా గుండె ల్లో ఉంటుంది. మరోసారి మీ దీవెనలు తీసుకొని యుద్ధానికి పోతున్న.. మీ నిండు మనస్సుతో మళ్లీ దీవించండి.. ఇక్కడ చిరంజీవి హరీశ్‌ను లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలి అని సీఎం కేసీఆర్ కోనాయిపల్లి ప్రజలను ఉద్దేశించి అన్నారు. తెలంగాణ లక్ష్యంగా ఆనాడు సిద్దిపేటను ప్రత్యేక పరిస్థితుల్లో విడిచిపెట్టాల్సి వచ్చింది. చిరంజీవి హరీశ్‌కు ఈ ప్రాంత అభివృద్ధిని అప్పగించి వెళ్లాను. గొప్పగా పనిచేస్తున్నాడు. నీళ్ల మంత్రి గా చేస్తున్న కృషి, స్వామివారి ఆశీస్సులతో కాళేశ్వరం నీళ్లు రాబోతున్నాయని, వాటితో స్వామివారి పాదాలకు అభిషేకం చేయమని హరీశ్‌కు చెప్పాను అని కేసీఆర్ తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు సీఎం కేసీఆర్‌కు పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్‌చైర్మన్ రాగుల సారయ్య, ఎంపీపీ జాప శ్రీకాంత్‌రెడ్డి, జిల్లా ప్రణాళికా కమిటీ సభ్యుడు దువ్వల మల్లయ్య, సిద్దిపేట ఏఎంసీ చైర్మన్ వేముల వెంకట్‌రెడ్డి, సీనియర్ నేతలు బాలకిషన్‌రావు, తడిసిన వెంకట్‌రెడ్డి, టీఆర్‌ఎస్ రాష్ట్రకార్యదర్శి వేలే టి రాధాకృష్ణశర్మ, కొమురవెల్లి దేవస్థాన చైర్మన్ సేవెల్లి సంపత్, స్థానిక దేవస్థాన కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సీఎం కేసీఆర్‌కు ఎన్నికల ఖర్చుకు కోనాయిపల్లికి చెంది న నిమ్మ బాల్‌రెడ్డి రూ.10,116 విరాళంగా అందజేశారు.

రెండుసెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన కేసీఆర్
కోనాయిపల్లి నుంచి నేరుగా ఎర్రవల్లి వ్యవసాయక్షేత్రానికి వెళ్లిన కేసీఆర్ అక్కడి నుంచి మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో గజ్వేల్ ఆర్డీవో కార్యాలయానికి చేరుకొని గజ్వేల్ శాసనసభ స్థానానికి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి విజయేందర్‌రెడ్డికి రెండు సెట్ల నామినేషన్ పత్రాలను అందజేశారు. మధ్యాహ్నం 2.33 గంటలకు మొదటి సెట్టు, 2.35 గంటలకు రెండోసెట్టు పత్రాలను సమర్పించారు. ఆ తరువాత ఎన్నికల ప్రమాణం చేశారు. కేసీఆర్‌ను లక్ష్మీకాంతారావు, కొట్టాల యాదగిరి ప్రతిపాదించగా, ఎన్నికల ఏజెంట్‌గా జహంగీర్ ఉన్నారని ఎన్నికల రిటర్నింగ్ అధికారి విజయేందర్‌రెడ్డి తెలిపారు.

నిరాడంబరంగా నామినేషన్ కార్యక్రమం
ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుగా చెప్పినట్టే గజ్వేల్‌లో తన మొదటి నామినేషన్‌ను నిరాడంబరంగా వేశారు. నామినేషన్ పత్రాలు సమర్పించడానికి గజ్వేల్ ఆర్డీవో కార్యాలయానికి వస్తున్న సమయంలో టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆయా గ్రామాల రోడ్డుకిరువైపులా బారులుతీరారు. నామినేషన్ పర్వాన్ని నిరాడంబరంగా నిర్వహించాలన్న కేసీఆర్ సూచనల మేరకు గజ్వేల్‌లో ఎలాంటి అట్టహాసాలు లేకుండా కార్యక్రమం జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ నామినేషన్ వేసిన సందర్భంగా గజ్వేల్‌లో పలువురు మిఠాయిలు పంచుకొని బాణాసంచా పేల్చి సంబురాలు చేసుకున్నారు. కేసీఆర్ గజ్వేల్ నుంచి మరోసారి భారీ మెజార్టీతో గెలుపొందుతారని, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతారని కార్యకర్తలు పెద్దఎత్తున నినాదాలు చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా ధన్వాడ మండలం గోతూరు గ్రామానికి చెందిన కేసీఆర్ వీరాభిమాని బోడి జైపాల్ బుధవారం గజ్వేల్ ఆర్డీవో కార్యాలయానికి చేరుకొని నామినేషన్ సమర్పించిన వెంటనే 101 కొబ్బరికాయలు కొట్టి తన అభిమానాన్ని చాటుకున్నారు.

ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే.. మీ మధ్య నుంచే ఇంతగా పెరిగిన.. నన్ను పెంచింది మీరే.. ఆ కృతజ్ఞత ఎప్పటికీ నా గుండెల్లో ఉంటుంది. మరోసారి మీ దీవెనలు తీసుకొని యుద్ధానికి పోతున్న.. మీ నిండు మనస్సుతో మళ్లీ ఆశీర్వదించండి..
-ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు

దేశ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ బాహుబలివంటివారు. టీఆర్‌ఎస్‌ను ఒంటరిగా ఎదుర్కొనే దమ్ము, ధైర్యం, సత్తా లేకనే కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌లు కూటమి పేరుతో జట్టుకట్టాయి. టీఆర్‌ఎస్‌కు మహాకూటమి పోటీయే కాదు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ అమలుచేయని రీతిలో తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ పలు సంక్షేమ పథకాలు చేపట్టి ఆదర్శంగా నిలిచారు.
-డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి

సిద్ధాంతాలు, జెండాలు పక్కనబెట్టి, అధికారమే పరమావధిగా, సీఎం కేసీఆర్‌ను గద్దె దించడమే ఏకైక ఎజెండాగా కూటమి ఏర్పాటు చేసుకుని వచ్చే ఎన్నికల్లో పోటీచేస్తున్న కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ అభ్యర్థులకు ఓట్లేస్తే తెలంగాణ ప్రజలకు మరణశాసనమే. తెలంగాణ రాక ముందు వ్యవసాయాని కేవలం ఆరు గంటలు విద్యుత్ ఇచ్చిన కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు రైతులను అరిగోస పెట్టాయి.
-మంత్రి కే తారకరామారావు

వచ్చే ఎన్నికల్లో మహాకుటమి ప్రలోభాలను కాలరాసి తెలంగాణ ఆత్మగౌరవ బావుటా ఎగరేయాలి. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రభంజనం ముందు పత్రిపక్షాలు మహాకూటమి పేరుతో ఏర్పాటుచేసిన మాయాకూటమి పటాపంచలవుతుంది. నాలుగేండ్లలో సీఎం కేసీఆర్ అమలుచేసిన అభివృద్ధి, సంక్షేమపథకాలకే ప్రజలు పట్టం కడుతారు. దళితుల కోసం ప్రత్యేక పథకాలను మ్యానిఫెస్టొలో రూపొందించనున్నాం.
-మంత్రి ఈటల రాజేందర్

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.