-నవీన ఆవిష్కరణలకు నాంది పలకాలి..యువతకు మంత్రి శ్రీ కేటీఆర్ పిలుపు
-అభివృద్ధిలో మనమే నంబర్ 1
-వేగంగా పెరుగుతున్న ఐటీ ఎగుమతులు
-ప్రైవేట్ రంగంలో ఇప్పటికే లక్ష ఉద్యోగాల కల్పన
-ప్రభుత్వ రంగంలో లక్ష ఖాళీల భర్తీ
-సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి నిర్విరామంగా పనిచేస్తున్న మంత్రి శ్రీ హరీశ్ రావు
-రాష్ట్ర అభివృద్ధిలో ఈటల సామర్థ్యం సాటిలేనిది
-కరీంనగర్‌లో ఐటీ టవర్‌కు శంకుస్థాపనలో మంత్రి కేటీఆర్
నిత్యనూతనంగా మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని.. నవీన ఆవిష్కరణలకు యువత నాంది పలుకాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖమంత్రి శ్రీ కే తారకరామారావు పిలుపునిచ్చారు. తెలంగాణ యువత జాబ్ సీకర్స్‌గా కాకుండా.. జాబ్ క్రియేటర్స్‌గా ఎదుగాలని ఆకాంక్షించారు. ఐటీ రంగంలో తెలంగాణ దూసుకుపోతున్నదని, రాజధానితో పాటు ఇతర జిల్లాలకు కూడా విస్తరిస్తున్నదని తెలిపారు. తెలంగాణ ఏర్పడటానికి ముందు రూ.56 వేల కోట్ల రూపాయల ఐటీ ఎగుమతులు జరిగాయని.. 2017 డిసెంబర్ నాటికి రూ.87 వేల కోట్లకు ఈ ఎగుమతులు పెరిగాయని తెలిపారు. అన్ని రంగాల్లో రాష్ట్రం అభివృద్ధిపథంలో దేశంలోనే అగ్రగామిగా దూసుకుపోతున్నదని స్పష్టంచేశారు. సోమవారం కరీంనగర్ జిల్లాలో పర్యటించిన మంత్రి కేటీఆర్ దిగువ మానేరు జలాశయం పరిధిలో రూ.25కోట్లతో చేపట్టిన ఐటీ టవర్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. నగరంలో రూ.250 కోట్లతో చేపట్టబోయే అభివృద్ధి పనులకు సంబంధించిన పైలాన్‌ను ఆవిష్కరించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన వేదికపైనుంచి ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో సిటిజన్ చార్టర్ కేంద్రాన్ని ప్రారంభించి, రూ.25 కోట్లతో చేపట్టిన భూగర్భ డ్రైనేజీ ఇంటింటి కనెక్షన్ పనులకు శంకుస్థాపన చేశారు. స్వచ్ఛత ఆటోలను కూడా మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఐటీ టవర్ శంకుస్థాపన సందర్భంగా కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అధ్యక్షతన ఏర్పాటుచేసిన బహిరంగసభలో మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. ప్రపంచవ్యాప్తంగా ఏర్పడుతున్న ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవడానికి కావాల్సిన నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను యువత కోసం ప్రభుత్వం నిర్వహిస్తుందని వివరించారు. ముప్ఫై నిమిషాలపాటు భావోద్వేగంతో మాట్లాడిన కేటీఆర్ ప్రపంచంలో పోటీపడాలంటే నేటియువత అనుసరించాల్సిన మార్గాలపై దిశానిర్దేశం చేశారు.
జాబ్ క్రియేటర్స్‌గా ఎదగాలి
వాట్సప్, ఫేస్‌బుక్, ట్విట్టర్ కనిపెట్టిన వాళ్లే గొప్పవాళ్లు కాదని.. ఎవరికి వారు తమలోని సృజనాత్మకతను వెలికితీస్తే అద్భుతమైన ఫలితాలెన్నో ఆవిష్కృతమవుతాయని సూచించారు. వినూత్న ఆవిష్కరణలు చేయగలిగిన సత్తా మనకున్నదని భావించినప్పుడే ప్రపంచంతో పోటీపడగలమని చెప్పారు. యువతకు అండగా నిలవడానికే ప్రభుత్వం టీహబ్ ఏర్పాటు చేసిందని తెలిపారు. పిల్లలు రెండు రకాలుగా ఉంటారనీ, ఇందులో మొదటి రకం జాబ్ సీకర్స్ అనీ, రెండో రకం జాబ్ క్రియేటర్స్ అనీ, ఇందులో ఎలా ఉండాలన్నది ప్రతీ విద్యార్థి ఎవరికి వారు ఆలోచించుకోవాలని సూచించారు. ఉద్యోగం పొందాలనుకొనేవారి కోసం టాస్క్ కేంద్రం ఏర్పాటు చేస్తామని వివరించారు. జాబ్ క్రియేటర్లకు ఉపయోగపడేందుకు హైదరాబాద్‌లో ఉన్న టీహబ్ కేంద్రాన్ని కరీంనగర్ ఐటీ టవర్ వద్ద ఏర్పాటుచేస్తామని చెప్పారు. టీహబ్ కేంద్రంగా యువత తమ మేధస్సుకు పదును పెట్టాలని సూచించారు. కొత్త కొత్త రంగాల్లో ఉద్యోగావకాశాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నామని వెల్లడించారు. ప్రపంచంలో అందరూ భయపడుతున్న సైబర్ సెక్యూరిటీ, డేటా అనలైటిక్స్, రొబోటిక్స్‌తోపాటు కొత్తగా వచ్చే సాంకేతిక పరిజ్ఞానం విషయంలో నైపుణ్యాన్ని పెంచుకుని ప్రపంచంతో పోటీ పడాలని పిలుపునిచ్చారు. కరీంనగర్ వేదికగా రాష్ట్రంలోని యువతకు నేను చేసే విజ్ఞప్తి ఒక్కటే.. ఈ మూడున్నర సంవత్సరాల్లో ప్రభుత్వం తీసుకొన్న కార్యక్రమాల వల్ల ఒకవైపు ప్రభుత్వపరమైన ఉద్యోగ నియమాకాలు జరుగుతున్నాయి, ఇంకోవైపు టీఎస్ ఐపాస్ ద్వారా ప్రైవేట్ రంగంలో పెద్ద మొత్తంగా పెట్టుబడులు రావడం వల్ల ఐటీ రంగంలో లక్ష ఉద్యోగాలు, ఇతర రంగాల్లో మరో రెండు లక్షల ఉద్యోగాలు ప్రత్యక్షంగా సృష్టించగలిగాం. పరోక్షంగా వీటికి మూడు రెట్ల ఉద్యోగాలు సృష్టించాం. భవిష్యత్‌లో వీటిని విస్తరిస్తాం అని కేటీఆర్ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో పెద్ద మొత్తంలో ఉద్యోగాలున్నాయనీ, ఇవి కూడా మన పిల్లలకే రావాలన్న ఉద్దేశంతో కావాల్సిన శిక్షణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు.
నోళ్లు మూతపడ్డాయి
తెలంగాణ ఏర్పడితే రాష్ట్రం అంధకారమవుతుందని.. పరిపాలించే నాయకత్వం ఉండదని.. శక్తివిహీనమవుతుందని.. తెలంగాణ ప్రజలు, నాయకులు ఉద్యమాలు తప్ప పాలన చేయలేరని.. పెట్టుబడులు రావని.. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న కంపెనీలు ఇతర ప్రాంతాలకు తరలివెళ్తాయంటూ ప్రచారాలు చేసిన నాయకుల నోళ్లు.. తెలంగాణ దూసుకెళ్తున్న తీరును చూసి మూతపడ్డాయని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. స్వయంగా ఇటీవల కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీని కలిసినప్పుడు ఉద్యమ నాయకులు పరిపాలనా దక్షకులుగా రాణించడం కష్టతరమనీ, కానీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వీటికి విభిన్నమనీ, నాడు ఉద్యమాన్ని ఉరకలెత్తించినట్లే.. నేడు తన పాలనా దక్షతతో తెలంగాణను అభివృద్థి పథంలో పరుగులు పెట్టిస్తున్నారని కొనియాడినట్లు తెలిపారు. కేంద్రంలోని అనేక మంది మంత్రులు ఇదే విషయాన్ని పలుమార్లు ప్రస్ఫుటం చేశారని, ఢిల్లీ నాయకత్వం భేష్ అంటూ కీర్తిస్తుంటే రాష్ట్ర నాయకత్వం గల్లీలో లొల్లిపెట్టే ప్రయత్నం చేస్తున్నదని మండిపడ్డారు. తాజాగా వచ్చిన మహేశ్‌శర్మ కూడా కేసీఆర్ గొప్ప విజన్ ఉన్న నాయకుడనీ, ఇటువంటి నాయకుడిని పోగొట్టుకోవడం మంచిది కాదని చెప్పి వెళ్లారని గుర్తుచేశారు. దాశరథి నా తెలంగాణ కోటి రతనాల వీణ అని చెప్పగా, మన ముఖ్యమంత్రి కాళేశ్వరం, పాలమూరు ఎత్తిపోతల పథకాల ద్వారా కోటి రతనాల వీణే కాదు..కోటి ఎకరాల మాగాణే కావాలని ప్రతిజ్ఞ చేశారు అనీ, ఆ వైపు దూసుకెళ్తున్నారని వివరించారు. మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో నీటి పారుదలశాఖ నిర్విరామంగా పని చేస్తున్నదనీ, ప్రతి ఎకరాకు సాగునీరు అందించే దిశగా అద్భుతమైన ప్రయత్నాలు ప్రభుత్వం కొనసాగిస్తున్నదని వెల్లడించారు. సేద్యానికి 24 గంటల ఉచిత కరంటు ఇస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రశంసిస్తూ, హరిత విప్లవ సారథి స్వామినాథన్ లేఖ రాసిన విషయాన్ని గుర్తుచేశారు.
సత్తా ఉన్న నేత ఈటల ఎవరూ ఊహించని విధంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తుందంటే అందులో ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్ సత్తా, సామర్థ్యం, నాయకత్వ పటిమే కారణమని మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. పెద్ద మొత్తంలో ప్రాజెక్టులు, ఒకవైపు సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంటే నిధుల పరిస్థితి ఎలా ఉంటుందన్న ఆందోళన ఉండేదనీ, కానీ నేడు ఆర్థిక వృద్ధి రేటులో భారత దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా ఉందంటే కేసీఆర్‌కు చేదోడువాదోడుగా ఉన్న మంత్రి ఈటల రాజేందరే కారకులని కొనియాడారు. వయస్సులో తెలంగాణ రాష్ట్రం చిన్నదైనప్పటికీ వృద్ధి రేటులో మాత్రం అగ్రగామిగా నిలిపామని స్పష్టం చేశారు. దేశ జీడీపీతో పోల్చితే తెలంగాణ జీడీపీ డబుల్ ఉండడం ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి కష్టానికి నిదర్శనమని వెల్లడించారు.
యువత.. తెలంగాణ ఆస్తి : మంత్రి ఈటల నేటి యువతీయువకులను తమ ప్రభుత్వం తెలంగాణ భవిష్యత్ ఆస్తులుగా పరిగణిస్తున్నట్లు ఆర్థికశాఖ మంత్రిఈటల రాజేందర్ పేర్కొన్నారు. ప్రభుత్వపరంగా అవకాశాలు అందరికీ కల్పించకపోయినా ప్రైవేట్ రంగం ద్వారా పెద్ద మొత్తంలో ఉద్యోగావకాశాలు కల్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. కరీంనగర్ ఎంపీ వినోద్‌కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతి విషయంలోనూ ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నదని పేర్కొన్నారు. సభకు అధ్యక్షత వహించిన కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ముందుగా ప్రసంగిస్తూ కరీంనగర్‌లో ఒకవైపు మానేరు రివర్‌ఫ్రంట్, మరోవైపు సస్పెన్షన్ బ్రిడ్జితో పాటుగా ఇక్క ఉన్న సౌకర్యాల దృష్ట్యా చాలా ఐటీ కంపెనీలు తమ తమ శాఖలను పెట్టేందుకు అసక్తిచూపుతున్నాయని చెప్పారు. ఈ సమావేశంలో ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ, సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్, ఐడీసీ చైర్మన్ ఈద శంకర్‌రెడ్డి, జిల్లా పరిషత్ అధ్యక్షురాలు తుల ఉమ, నగర మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్, ఎమ్మెల్సీలు నారదాసు లక్ష్మణ్‌రావు, భానుప్రసాదరావు, గ్రంథాలయ చైర్మన్ ఏనుగు రవీందర్‌రెడ్డితో పాటుగా పలువురు ప్రజాప్రతినిధులు, రాష్ట్ర, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
లక్ష ఉద్యోగాల కల్పన రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో మూడున్నర నుంచి 4 లక్షల వరకు ఉద్యోగాలు ఉన్నాయని, ఏటా 4 నుంచి 5 శాతం ఉద్యోగులు రిటైర్ అవుతారని తెలిపారు. అ లెక్కన చూస్తే ఖాళీలు లక్ష వరకు భర్తీ చేసే అవకాశం ప్రభుత్వ రంగంలో ఉంటుందనీ, అంతకన్నా ఎక్కువ ఉద్యోగాలిచ్చే శక్తి ప్రపంచంలో ఏ ప్రభుత్వానికీ ఉండదని స్పష్టంచేశారు. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలని ఆలోచించినప్పుడు ముఖ్యమంత్రి.. ప్రభుత్వ పరంగా ఆ అవకాశాలు లేనప్పుడు ప్రైవేట్ పరంగా ఉద్యోగవకాశాలు కల్పించడానికి విస్తృత ప్రయత్నాలు చేయాలని సూచించారని గుర్తుచేశారు. 2014 లో ఐటీ ఎగుమతులు రూ. 56వేల కోట్లు ఉంటే 2020 నాటికి వాటిని డబుల్ చెస్తామని ఆ రోజే చెప్పామన్నారు. గత ఏడాది చివరి నాటికి రూ. 87వేల కోట్లకు ఐటీ ఎగుమతులు పెరిగాయని తెలిపారు.
మరో ఐటీ టవర్ కరీంనగర్‌లో ఐటీ టవర్ నిర్మాణాన్ని 9 నెలల్లో పూర్తి చేస్తామని మంత్రి కేటీఆర్ చెప్పారు. శంకుస్థాపన జరిగిన రోజునే 8 కంపెనీలు 650 ఉద్యోగాల కల్పనతో ఒప్పందాలు చేసుకోవడం సంతోషంగా ఉన్నదని వివరించారు. మరికొన్ని సంస్థలు కరీంనగర్‌లో తమ శాఖల ఏర్పాటుకు ఆసక్తి చూపుతున్నాయని, తద్వారా కనీసంగా వెయ్యిమందికి ఇక్కడ ఉద్యోగాలు వచ్చేందుకు బీజం వేశామని తెలిపారు. కరీంనగర్‌లోనే మరో ఐటీ టవర్ కోసం త్వరలోనే రూ. 25 కోట్లు మంజూరు చేస్తామని ప్రకటించారు. కరీంనగర్ గడ్డపై పుట్టిన తాను ఈ జిల్లాకు సేవలందించి రుణం తీర్చుకొంటానని చెప్పారు. పార్టీ ఆవిర్భావానికి ఊపిరిలూదిన జన్మ నివ్వడమే కాకుండా 2006 ఎన్నికల్లో పునర్జన్మను ప్రసాదించిన ఈ గడ్డకు ఎంత చేసినా తక్కువే అని చెప్పారు. కరీంనగర్ ప్రజల రుణం అందరి కాళ్లు కడిగి నెత్తిమీద చల్లుకున్నా తీర్చుకోలేమన్నారు. మానేరు రివర్ ఫ్రంట్, సస్పెన్షన్ బ్రిడ్జి, మౌలిక వసతుల విషయంలో శరవేగంగా పనులు జరుగుతున్నాయని.. భూగర్భ మురికి కాలువ పనుల కోసం అవసరమైన రూ. 30 కోట్ల నిధులను ఇస్తామన్నారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన షీ టీమ్స్, షీ షటిల్స్‌ను కరీంనగర్‌లో విస్తరిస్తామన్నారు. రాష్ట్రంలో ఉన్న 4800 మంది మహిళా సంఘాల రిసోర్స్‌పర్సన్స్‌కు వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చారు. మెప్మా సిబ్బందికి సంబంధించిన హెచ్‌ఆర్‌ఏ విషయంలోనూ సానుకూల నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.