-మొత్తం 32 జిల్లా పరిషత్ అధ్యక్షస్థానాల్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థుల ఎన్నిక -అన్నిస్థానాల్లోనూ ఏకగ్రీవాలే -వైస్ చైర్మన్లు, కో ఆప్షన్ సభ్యులు కూడా -పరిషత్ చరిత్రలో రికార్డు -మూడోసారి జెడ్పీచైర్‌పర్సన్‌గా సునీతామహేందర్‌రెడ్డి రికార్డు -రాష్ట్రంలో ముగిసిన ఎన్నికల కోడ్
టీఆర్ఎస్ విజయాల పరంపర జెడ్పీ ఎన్నికలతో ఉన్నత శిఖరాన్ని చేరింది. జిల్లా పరిషత్ చైర్మన్ల ఎన్నికల్లో గులాబీ జెండా రెపరెపలాడింది. అన్నీ జెడ్పీలను ఏకగ్రీవంగా గెల్చుకున్న గులాబీదండు సరికొత్త రికార్డు సృష్టించింది. శనివారం నిర్వహించిన జెడ్పీ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కో ఆప్షన్ సభ్యుల ఎన్నికలో ప్రతిపక్షాలు పూర్తిగా చేతులెత్తేశాయి. తమ అభ్యర్థులను పోటీకి కూడా నిలబెట్టలేకపోయాయి. ఈ ఎన్నిక కోసం ఉదయం నిర్వహించిన ప్రత్యేక సమావేశాలకు పలుచోట్ల కాంగ్రెస్, బీజేపీ డుమ్మా కొట్టాయి.
రాష్ట్రంలోని జిల్లా పరిషత్లన్నింటిపైనా గులాబీ జెండా రెపరెపలాడింది. 32 జెడ్పీ అధ్యక్ష పీఠాలను ఏక్రగీవంగా గెలుచుకొని టీఆర్ఎస్ కొత్త రికార్డు సృష్టించింది. 32 జెడ్పీ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కో ఆప్షన్ సభ్యుల పదవులను ఏమాత్రం పోటీలేకుండా ఏకగ్రీవంగా కైవసం చేసుకున్నది. అటు ఉమ్మడి రాష్ట్రంలోనూ.. ఇటు తెలంగాణలోనూ ఒకేపార్టీ అన్ని జెడ్పీలను కైవసం చేసుకోవడం ఇదే ప్రథమం. శనివారం ఉదయం 32 జిల్లా పరిషత్తుల్లో కో ఆప్షన్ సభ్యుల ఎన్నికకు నామినేషన్లు స్వీకరించిన రిట్నరింగ్ అధికారులు.. సాయంత్రం మూడు గంటల కల్లా జెడ్పీ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక ప్రక్రియను ముగించారు. ప్రతి జెడ్పీకి ఇద్దరు కో ఆప్షన్ సభ్యులను ఎన్నుకున్నారు. జిల్లా కలెక్టర్లు రిటర్నింగ్ అధికారులుగా వ్యవహరించారు. అన్ని జెడ్పీల్లో చైర్మన్లతోపాటు వైస్ చైర్మన్లు, కో ఆప్షన్ సభ్యులను కూడా ఏకగీవ్రంగా ఎన్నుకోవడం విశేషం.

ప్రతిపక్షాలు గైర్హాజర్ రెండుమూడు మినహా చాలా జెడ్పీల్లో కాంగ్రెస్, బీజేపీ సభ్యులు సమావేశాలకు హాజరుకాలేదు. జెడ్పీ చైర్మన్ల ఎన్నికకు ప్రత్యేక సమావేశాన్ని శనివారం ఉదయం నిర్వహించనున్నట్టు శుక్రవారమే జిల్లా అధికారులు జెడ్పీటీసీలకు సమాచారమిస్తూ నోటీసులు జారీచేశారు. ఈ సమావేశానికి కాంగ్రెస్, బీజేపీ సభ్యులు దూరంగా ఉన్నారు. మెజార్టీ స్థానా లు టీఆర్ఎస్ సభ్యులే గెలువడంతో.. వారి అవసరం లేకుండాపోయింది. కోరం ఉండటంతో ఎన్నికల అధికారులు ప్రతిపక్ష సభ్యులు రాకపోయినా, సమావేశం నిర్వహించి.. జెడ్పీ చైర్మన్లు, వైస్చైర్మన్లు, కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక ప్రక్రియను పూర్తిచేశారు.
మూడోసారి జెడ్పీ చైర్‌పర్సన్‌గా సునీతారెడ్డి జెడ్పీ చైర్మన్ల ఎన్నికల్లో అన్ని సామాజికవర్గాలకు న్యాయంచేస్తూ టీఆర్ఎస్ నిర్ణయం తీసుకున్నది. పార్టీలో, ఉద్యమంలో కీలకపాత్ర పోషించినవారికి ఈసారి జెడ్పీల్లో అవకాశం కల్పించారు. ఎన్నిక స మావేశానికి ముందు జెడ్పీ చైర్మన్ అభ్యర్థులను పార్టీ ఇంచార్జిలు, మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రకటించారు. ఏకగ్రీవ తీర్మానంతో చైర్మన్లను ఎన్నుకున్నారు. ఈసారి పలువురు చైర్మన్లు రికార్డు సాధించారు. పట్నం సునీతారెడ్డి మూడోసారి జెడ్పీ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. గతంలో ఉమ్మడి రంగారెడ్డి జెడ్పీ చైర్‌పర్సన్‌గా రెండుసార్లు పనిచేసిన సునీతారెడ్డి.. ఈసారి వికారాబాద్ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు.
జెడ్పీ చైర్మన్లుగా మాజీ ఎమ్మెల్యేలు పలువురు మాజీ ఎమ్మెల్యేలకు జెడ్పీ చైర్మన్ పదవి వరించింది. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా మాజీ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, పెద్దపల్లి జెడ్పీ చైర్మన్‌గా మంథని మాజీ ఎమ్మెల్యే పుట్టా మధుకర్, భద్రాద్రి కొత్తగూడెం జెడ్పీ చైర్మన్‌గా మాజీ ఎమ్మెల్యే కోరం కనకయ్య, మహబూబ్‌నగర్ జెడ్పీ చైర్‌పర్సన్‌గా మాజీ ఎమ్మెల్యే స్వర్ణ సుధాకర్‌రెడ్డి ఎన్నికయ్యారు. మరోవైపు మంచిర్యాల జెడ్పీ చైర్‌పర్సన్‌గా మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు సతీమణి నల్లాల భాగ్యలక్ష్మి ఎన్నికయ్యారు. రంగారెడ్డి జెడ్పీ చైర్మన్‌గా మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కోడలు తీగల అనితారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జెడ్పీ చైర్మన్‌గా మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి తనయుడు శరత్ చంద్రారెడ్డి, యాదాద్రి భువనగిరి జెడ్పీ చైర్మన్‌గా హోంశాఖ మాజీ మంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి కుమారుడు సుధీర్‌రెడ్డి ఎన్నికయ్యారు. నిజామాబాద్ జెడ్పీ చైర్మన్‌గా దాదన్నగారి విఠల్‌రావుకు అవకాశం లభించింది.
నాడు వైస్చైర్మన్లు.. నేడు చైర్మన్లు గతంలో ఉమ్మడి జిల్లాల్లో వైస్ చైర్మన్లుగా వ్యవహరించినవారికి కూడా ఈసారి పదవులు దక్కాయి. తెలంగాణ ఉద్యమ సమయంలో కరీంనగర్ జెడ్పీ వైస్ చైర్మన్‌గా ఉన్న డాక్టర్ సుధీర్‌కుమార్ ఈసారి వరంగల్ అర్బన్ జెడ్పీ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఇప్పటివరకు కరీంనగర్ జెడ్పీ వైస్‌చైర్మన్‌గా ఉన్న రాయిరెడ్డి రాజిరెడ్డి ఈసారి హుస్నాబాద్ జెడ్పీటీసీ సభ్యుడిగా గెలిచి సిద్దిపేట జెడ్పీ వైస్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా వ్యవహరించిన బండ నరేందర్‌రెడ్డి ప్రస్తుతం నల్లగొండ జెడ్పీ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. వరంగల్ కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్‌గా వ్యవహరించిన గండ్ర జ్యోతి ప్రస్తుతం వరంగల్ రూరల్ జెడ్పీ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. జ్యోతి భర్త గండ్ర వెంకటరమణారెడ్డి భూపాలపల్లి ఎమ్మెల్యేగా ఉన్నారు. వనపర్తి మున్సిపల్ కార్పొరేషన్ వైస్ చైర్మన్‌గా ఉన్న లోకనాథ్‌రెడ్డికి ఈసారి వనపర్తి జెడ్పీ చైర్మన్‌గా అవకాశం దక్కింది.
జెడ్పీల్లో ఉన్నత విద్యావంతులు మహబూబాబాద్ జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైన అంగోతు బిందు అతి చిన్న వయస్సున్న చైర్మన్‌గా రికార్డు సాధించారు. ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ అక్క కూతురైన బిందు బీటెక్ పూర్తిచేశారు. 23 ఏండ్లకే జెడ్పీ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. జయశంకర్ భూపాలపల్లి జెడ్పీ చైర్మన్‌గా ఇన్ఫోసిస్ ఉద్యోగి, ఉన్నత విద్యావంతురాలు జక్కు శ్రీహర్షిణి ఎన్నికయ్యారు. వీరిద్దరూ ఈ జెడ్పీటీసీ ఎన్నికలతోనే రాజకీయ రంగప్రవేశం చేశారు. అంతకుముందు ఇన్ఫోసిస్‌లో ఉద్యోగం చేస్తున్న శ్రీహర్షిణి కాటారం జెడ్పీటీసీ నుంచి విజయం సాధించి, జెడ్పీ పీఠాన్ని దక్కించుకున్నారు.
ముగిసిన పరిషత్ ఎన్నికల ప్రక్రియ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా నిర్వహించిన పరిషత్ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. గత నెలలో మూడు విడుతలుగా పరిషత్ ఎన్నికలకు పోలింగ్ నిర్వహించారు. ఓట్ల లెక్కింపు ఈ నెల నాలుగున చేపట్టారు. ప్రస్తుత పరిషత్ సభ్యుల పదవీకాలం వచ్చేనెల 4వ తేదీ వరకు ఉన్నప్పటికీ.. పరిషత్ సభ్యులు, మండల పరిషత్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, జిల్లా పరిషత్ చైర్మన్లు, వైస్చైర్మన్లు, కో ఆప్షన్ సభ్యులను ఎన్నుకున్నారు. శనివారం జిల్లా పరిషత్ చైర్మన్ల ఎన్నికతో పరిషత్ పోరు ముగిసినైట్లెంది. అయితే ఎంపీపీ ఎన్నికలు కొన్నిచోట్ల వాయిదా పడటంతో.. ప్రత్యేక సమావేశం నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలిచ్చింది. రాష్ట్రంలో జెడ్పీ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, మెజార్టీ మండలాల అధ్యక్ష, ఉపాధ్యక్షులు, కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక పూర్తి కావడంతో పరిషత్ ఎన్నికలు ముగిసిపోయాయి.

రాష్ట్రంలో ముగిసిన ఎన్నికల కోడ్ వరుస ఎన్నికలతో గత కొన్ని నెలలుగా రాష్టంలో అమలులో ఉన్న ఎన్నికల కోడ్ శనివారంతో ముగిసింది. రాష్ట్రంలో జిల్లా పరిషత్ ఎన్నికల ఫలితాలు వెలువడిన నేపథ్యంలో ఎన్నికల కోడ్ ముగిసిందని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి అశోక్‌కుమార్ ప్రకటించారు. వాస్తవానికి రాష్ట్రంలో నవంబర్ నెల నుంచి ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నది. గత డిసెంబర్ ఏడో తేదీన శాసనసభ ఎన్నికలు ముగిసిన తర్వాత కొద్దిరోజులు మాత్రమే ఎన్నికల కోడ్ అమలులోలేదు. ఆ తర్వాత జనవరిలో గ్రామపంచాయతీ ఎన్నికలు, ఏప్రిల్‌లో లోక్‌సభ ఎన్నికలు, మేలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, తాజాగా జెడ్పీ చైర్మన్ల ఎన్నికలు వరుసగా జరుగడంతో ఎన్నికల కోడ్ చాలాకాలంపాటు అమలులో ఉన్నది. ఆరునెలలుగా ఏదో ఒకతీరులో కోడ్ అమలులో ఉండటం వల్ల రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి విధాన ప్రకటనలు చేయడానికి, నిర్ణయాలు తీసుకోవడానికి వీలుకాలేదు. శనివారం జిల్లా పరిషత్ చైర్మన్ల ఫలితాలు వెలువడటంతో స్థానికసంస్థల ఎన్నికల ప్రక్రియ పరిసమాప్తమైంది. దీంతో ఎన్నికల కోడ్ ముగిసినట్టు అధికారులు ప్రకటించారు.